Share News

చెత్త సమస్యకు పరిష్కారం లేదా?

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:29 PM

అనకాపల్లి పట్టణ వాసులను డంపింగ్‌ యార్డు సమస్య వేధిస్తోంది. ఇక్కడ డంపింగ్‌ యార్డు లేకపోవడంతో జీవీఎంసీ జోనల్‌ కార్యాలయ ప్రాంగణంలోనే చెత్త నిల్వ చేయాల్సి వస్తోంది. తీవ్ర దుర్గంధంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

చెత్త సమస్యకు పరిష్కారం లేదా?
అనకాపల్లిలో జీవీఎంసీ జోనల్‌ కార్యాలయ ఆవరణంలో పేరుకుపోయిన చెత్త

డంపింగ్‌ యార్డు లేక జీవీఎంసీ కార్యాలయ ప్రాంగణంలోనే చెత్త నిల్వ

తీవ్ర దుర్గంధంతో పరిసర ప్రాంతాల ప్రజల ఇబ్బందులు

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మరిచిపోతున్న నేతలు

రెండు దశాబ్దాలుగా ఇదే తీరు

డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అనకాపల్లి వాసుల వేడుకోలు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి పట్టణ వాసులను డంపింగ్‌ యార్డు సమస్య వేధిస్తోంది. ఇక్కడ డంపింగ్‌ యార్డు లేకపోవడంతో జీవీఎంసీ జోనల్‌ కార్యాలయ ప్రాంగణంలోనే చెత్త నిల్వ చేయాల్సి వస్తోంది. తీవ్ర దుర్గంధంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రెండు దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు.

జీవీఎంసీ జోనల్‌ పరిధిలో 80 వేలకుపైగా గృహాలు ఉన్నాయి. సుమారు 1.2 లక్షల మంది జనాభా ఉన్నారు. జనాభా పెరుగుదలకు తగ్గట్టు నగరం విస్తరిస్తున్నా డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం లభించడం లేదు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా జీవీఎంసీ అధికారులు సుమారు 35 చెత్త సేకరణ మినీ వాహనాలను, 4 ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ఇంటింటా సేకరించిన చెత్తను పట్టణ నడిబొడ్డున ఉడ్‌పేట-నెహ్రూచౌక్‌కు మధ్యలో ఉన్న జీవీఎంసీ జోనల్‌ కార్యాలయంలోనే పోస్తున్నారు. ఒకటి, రెండురోజులకు ఒకసారి జీవీఎంసీ పరిధిలో ఉన్న ఆరు లారీల్లో ఈ చెత్తను మధురవాడకు తరలిస్తున్నారు. జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం పరిఽసరాల్లో వివిధ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, గృహాలు ఉన్నాయి. పట్టణానికి మధ్యలో ఉన్న కార్యాలయం ప్రాంగణంలోనే చెత్త నిల్వ చేయడం వలన వెలువడుతున్న దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో శారదా నగర్‌లో డంపింగ్‌ యార్డు కోసం స్థలాన్ని కేటాయించగా, స్థానికులు అభ్యంతరం చెప్పడంతో వేరొక ప్రాంతంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తరువాత అనకాపల్లి మండలం అచ్చెయ్యపేట పరిసరాల్లో ఏర్పాటు చేయాలని భావించగా, ఆ ప్రాంత వాసులు డంపిగ్‌ యార్డు ఇక్కడ వద్దంటూ అడ్డుకున్నారు. దీంతో దీర్ఘ కాలంగా అనకాపల్లి పట్టణంలో చెత్త సమస్య వేధిస్తోంది.

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు

అనకాపల్లి పట్టణంలో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ప్రతిపాదనలు ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. 2019 ఎన్నికల ముందు అప్పటి వైసీపీ నాయకులు డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో డంపింగ్‌ యార్డు ఊసెత్తలేదు. స్థానికులు అనేక పర్యాయాలు అప్పటి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కలిసి తమ గోడు వినిపించినా డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం లభించలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు ప్రస్తుత ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా కనీసం డంపింగ్‌ యార్డుకు స్థలాన్వేషణ కూడా జరగడం లేదు. జీవీఎంసీ, రెవెన్యూ అధికారులకు డంపింగ్‌ యార్డు కోసం స్థలాన్ని ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశించినా అధికారులు మాత్రం స్థలాన్ని కేటాయించే ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:29 PM