Share News

ఫార్మా ప్రమాదాలకు అంతం లేదా?

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:08 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఫార్మా కంపెనీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడం కలవరపెడుతున్నది. భారీ ప్రమాదాలు జరిగి కార్మికులు మృతి చెందుతున్నా అధికారులు, సంబంధిత కంపెనీలపై కఠిన చర్యలు చేపట్టకపోవడం ఆరోపణలకు తావిస్తున్నది.

ఫార్మా ప్రమాదాలకు అంతం లేదా?
గత ఏడాది నవంబరు 2న మెట్రోకెమ్‌ ఫార్మాలో సంభవించిన ప్రమాద దృశ్యం

తరచూ పేలుళ్లు, విషవాయువులు లీకు

ప్రాణాలు కోల్పోతున్న ఉద్యోగులు, కార్మికులు

తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు

బాధిత కుటుంబాలకు నష్టపరిహారం పంపిణీతో సరి

ఐదేళ్లలో 51 ప్రమాదాలు... 97 మంది మృతి

తాజాగా సాయిశ్రేయాస్‌లో విషవాయువులు పీల్చి ఇద్దరు ఉద్యోగుల మృతి

పరవాడ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఫార్మా కంపెనీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడం కలవరపెడుతున్నది. భారీ ప్రమాదాలు జరిగి కార్మికులు మృతి చెందుతున్నా అధికారులు, సంబంధిత కంపెనీలపై కఠిన చర్యలు చేపట్టకపోవడం ఆరోపణలకు తావిస్తున్నది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ధోరణిలో ఇటు అధికారులు, అటు కంపెనీల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. కంపెనీల్లో ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు మాత్రం తీసుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలోని విశాఖ ఫార్మాసిటీలో 105, అచ్యుతాపురం సెజ్‌లో 210 పరిశ్రమలు ఉన్నాయి. ఇవి కాకుండా నక్కపల్లిలో హెటెరో డ్రగ్స్‌ కంపెనీ ఉంది. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో గత ఏడాది జరిగిన భారీ పేలుడు సంభవించి 17 మంది చనిపోయారు. దీనిపై అన్ని శాఖల అధికారులు హడావిడి చేశారు. కూటమి నేతలు పరామర్శలకు క్యూ కట్టారు. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. అంత భారీ ప్రమాదాన్ని కూడా అధికారులు తేలిగ్గా తీసుకోవడం, యాజమాన్యంపై కఠిన చర్యలు లేకపోవడం వల్ల మిగిలిన సంస్థలు కనీస జాగ్రత్తలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది నవంబరులో ఠాగూర్‌ ఫార్మాలో విషవాయువులు లీకైన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో 36 మంది అస్వస్థతకు గురయ్యారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే రక్షిత్‌ డ్రగ్స్‌, విజయశ్రీ ఆర్గానిక్స్‌, మెట్రోకెమ్‌ పరిశ్రమల్లో కూడా ప్రమాదాలు సంభవించాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ తరహా సంఘటనలు పరవాడ ఫార్మాసిటీలోనే అధికంగా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు.

గత ఐదేళ్లలో పరవాడ ఫార్మా కంపెనీల్లో జరిగిన ప్రమాదాలు, మృతులు

ఏడాది ప్రమాదాలు మరణాలు

2019-20 13 17

2020-21 9 31

2021-22 11 12

2022-23 6 11

2023-24 4 29

2024-25 8 6

మొత్తం 51 106

అచ్యుతాపురం సెజ్‌ ఫార్మా కంపెనీల్లో..

అచ్యుతాపురం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఏర్పాటైన ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఫార్మా కంపెనీల్లో గత రెండున్నరేళ్ల కాలంలో పలు ప్రమాదాలు సంభవించాయి. 2023 జనవరి 30న జీఎఫ్‌ఎంసీ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి ఒకరు మృతిచెందారు. అదే ఏడాది జూన్‌ 30న సాహితీ ఫార్మా కెమికల్స్‌ రియాక్టర్‌ పేలి ఆరుగురు మృతిచెందారు. 2024 జూలై 17న వసంత కెమికల్స్‌లో రియాక్టర్‌ పేలి ఒకరు మృతిచెందారు. ఆగస్టు 21న ఎసెన్షియా కర్మాగారంలో రియాక్టర్‌ పేలి 17 మంది చనిపోయారు.

రాంకీ యాజమాన్యానికి పీసీబీ నోటీసులు

మల్లోడి గెడ్డలోకి రసాయన వ్యర్థాలను విడిచిపెట్టడంపై చర్యలు

పరవాడ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్‌కు డెవలపర్‌గా వ్యవహరిస్తున్న రాంకీ యాజమాన్యానికి బుధవారం నోటీసులు జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీ పీసీబీ) ఈఈ పీవీ ముకుందరావు తెలిపారు. రాంకీ యాజమాన్యం గత నెల 18వ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా పరవాడ మల్లోడి గెడ్డలోకి విడిచిపెట్టింది. దీనిపై సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, భరణికం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ బొండా తాతారావు, పెదిశెట్టి సత్యారావు మరుసటి రోజు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇక్కడకు వచ్చి మల్లోడిగెడ్డలో నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. సీటీవో, హెచ్‌డబ్ల్యుఏ నిబంధనలు పాటించలేదని పీసీబీ గుర్తించింది. ఇందుకుగాను రాంకీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్టు ఈఈ ముకుందరావు తెలిపారు. తదుపరి చర్యలు కోరుతూ పీసీబీ ప్రధాన కార్యాలయానికి నివేదిక సమర్పించినట్టు ఆయన చెప్పారు.

Updated Date - Jun 19 , 2025 | 01:08 AM