Share News

గిరి విద్యార్థుల ఆరోగ్యానికి ఏదీ భరోసా?

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:34 AM

గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్య భరోసా లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. అరకులోయ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధి మన్యం పార్వతీపురం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కలుషిత నీరు కారణంగా రెండు వందల మంది బాలికలు అస్వస్థతకు గురికావడం, వారిలో 37 మంది కేజీహెచ్‌లో, మరో 120 మంది పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న ఘటనతో గిరిజన ప్రాంతంలోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై తాజాగా మరోమారు చర్చకు దారితీసింది.

గిరి విద్యార్థుల ఆరోగ్యానికి ఏదీ భరోసా?
గతేడాది అధిక సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన డుంబ్రిగుడ మండలం జామిగూడ ఆశ్రమ పాఠశాల(ఫైల్‌)

ఏజెన్సీలో ప్రతి ఏడాది 10 నుంచి 15 మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో మృతి

ఆశ్రమాల్లో వైద్య సిబ్బందిని తొలగించిన గత వైసీపీ ప్రభుత్వం

సంపూర్ణ ఆరోగ్య పరీక్షలకు నోచుకోని గిరిజన విద్యార్థులు

ఆశ్రమాల్లో హెల్త్‌ సిబ్బంది నియామకంపై నెరవేరని మంత్రి హామీ

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల డిమాండ్‌

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్య భరోసా లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. అరకులోయ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధి మన్యం పార్వతీపురం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కలుషిత నీరు కారణంగా రెండు వందల మంది బాలికలు అస్వస్థతకు గురికావడం, వారిలో 37 మంది కేజీహెచ్‌లో, మరో 120 మంది పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న ఘటనతో గిరిజన ప్రాంతంలోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై తాజాగా మరోమారు చర్చకు దారితీసింది. పాడేరు ఐటీడీఏ పరిధిలో ప్రతి ఏడాది 10 నుంచి 15 మంది గిరిజన విద్యార్థులు వివిధ ఆరోగ్య సమస్యలతో మృతి చెందుతున్నట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.

గతంలో ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వలంటీర్లుండేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020లో వారినిఅకారణంగా తొలగించింది. దీంతో ఆశ్రమ విద్యార్థులకు ప్రాథమిక వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. దీంతో గిరిజన విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం, సకాలంలో వైద్య సేవలు అందక మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో విద్యార్థులు రోగాల బారిన పడడం, పరిస్థితి విషమించి మృతి చెందడం సర్వసాధారణమైపోయింది. ఏజెన్సీ 11 మండలాల్లో 121 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలున్నాయి. వాటిలో 38 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. విద్యా సంవత్సరంలో సెలవులు మినహా వారంతా ఆశ్రమ పాఠశాలల్లోనే ఉంటారు. కాగా 2014, 2015 సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలతో పదుల సంఖ్యలో గిరిజన విద్యార్థులు మృతి చెందారు. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వలంటీర్‌ పేరిట వైద్య సిబ్బందిని నియమించాలనే డిమాండ్‌ ఉత్పన్నమైంది. దీనికి స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ 121 ఆశ్రమాలకు 2016లో 72 మంది హెల్త్‌ అసిస్టెంట్‌లను, 49 మంది ఏఎన్‌ఎంలను నియమించింది. దీంతో ఆశ్రమాల్లోని విద్యార్థులకు ఆర్యోగ పరీక్షలు నిర్వహించడం, అవసరం మేరకు సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లి వైద్యం అందించడం చేసేశారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యానికి ఒక ప్రత్యేక భరోసా ఉండేది.

కొవిడ్‌ తరువాత వైద్య సిబ్బంది నియామకాల్లేవు

2016 నుంచి ఆశ్రమాల్లో పని చేస్తున్న ఆరోగ్య సిబ్బందిని కొవిడ్‌ తరువాత పాఠశాలల పునఃప్రారంభంలో నియమించకుండా తొలగించారు. కొవిడ్‌ కారణంగా 2019, 2020లో విద్యాలయాలు మూతపడడం, 2021లో పాఠశాలలు తెరచుకున్నప్పటికీ, ఆశ్రమాలో హెల్త్‌ అసిస్టెంట్‌లు, ఏఎన్‌ఎంల నియామకానికి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. వారిని తొలగించినట్టు ప్రకటించింది. దీంతో స్థానిక అధికారులు సైతం ఏమి చేయలేక మిన్నకున్నారు. అలాగే 2021లో పాఠశాలలు అంతంతమాత్రంగా తెరచుకోవడం, 2022 విద్యా సంవత్సరం జూలై ఐదో తేదీ నుంచి ప్రారంభమైనప్పటికీ ఆశ్రమాల్లోని విద్యార్థుల ఆరోగ్య రక్షణ సందిగ్ధంలో పడింది. అలాగే అప్పుడప్పుడు విద్యార్థులు రోగాల బారినపడడంతో ఉపాధ్యాయులే ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోయేవారు.

మొక్కుబడిగా స్కూల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన స్కూల్‌ హెల్త్‌ కార్యక్రమం ఏజెన్సీలో మొక్కుబడిగా అమలవుతున్నది. విద్యార్థులకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం అందిస్తున్నారే గాని, వైద్యులు విద్యాలయాలకు వెళ్లి సేవలు అందిస్తున్న వైనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకున్న నాఽథుడే లేని దుస్థితి కొనసాగుతున్నది. దీంతో గిరిజన విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అలాగే వైద్యారోగ్య శాఖ నిబంధనల ప్రకారం ఏడాదిలో రెండు మార్లు మాత్రమే పాఠశాలలో విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తారు. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది తమకు అందుబాటులో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో మిలిగిన సమయాల్లో విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏజెన్సీలో కస్తూర్బా బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో అందుకు భిన్నంగా కనీస వైద్య సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి కొనసాగుతున్నది.

హెల్త్‌ సిబ్బంది నియామకంపై నెరవేరని మంత్రి హామీ

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని నియమిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గతేడాది జూలైలోనే ప్రకటించారు. కానీ నేటికీ మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదు. వాస్తవానికి ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది ఎంతో అవసరం. అలాగే వారికి నాణ్యమైన పోషకాహారం, శుద్ధి చేసిన తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు సామూహికంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థి సంఘాలు భావిస్తున్నాయి.

Updated Date - Oct 07 , 2025 | 12:34 AM