ప్రాణాలు నిలుపుకునే దారేదీ?
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:45 PM
మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంద గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వైద్య సేవలు అందక పలువురు మృతి చెందారు. ఆరు నెలల వ్యవధిలో అనారోగ్యంతో ఆరుగురు మృతి చెందారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రహదారి సౌకర్యం లేక జాజులబంద గ్రామస్థుల అవస్థలు
ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇబ్బందులే..
ఆరు నెలల వ్యవధిలో ఆరుగురు మృతి
రోడ్డు నిర్మించాలని గిరిజనుల వేడుకోలు
కొయ్యూరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంద గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వైద్య సేవలు అందక పలువురు మృతి చెందారు. ఆరు నెలల వ్యవధిలో అనారోగ్యంతో ఆరుగురు మృతి చెందారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
జాజులబంద గ్రామంలో సుమారు 200 మంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. రోలుగుంట మండలం అర్ల గ్రామం నుంచి కొండ ఎక్కితే గాని ఈ గ్రామం చేరుకోలేం. ఈ గ్రామం డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. 20 కిలోమీటర్లు రోడ్డు సౌకర్యం ఉన్నా, మిగిలిన ఎనిమిది కిలోమీటర్ల మేర కొండ ఎక్కాల్సిందే. రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే జాజులబంద, పిత్రిగెడ్డ గ్రామస్థులు చందాలు వేసుకుని రూ.6 లక్షలు పోగుచేసి శ్రమదానంతో తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం 2023-24లో గిరిజన సంక్షేమశాఖ నుంచి ఈ రోడ్డు నిర్మాణానికి రూ1.2 కోట్లు మంజూరైంది. దీంతో రహదారి మధ్య కల్వర్టు నిర్మాణాలకు రూ.29 లక్షలు వెచ్చించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన పనులు నిలిచిపోయాయి. అప్పట్లో ఆయా గ్రామాల గిరిజనుల ఆందోళనలు చేయడంతో అప్పటి అనకాపల్లి కలెక్టర్ ఆ జిల్లా పరిధిలో గల అర్ల గ్రామం నుంచి పిత్రిగెడ్డ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4.1 కోట్లు మంజూరు చేశారు. ఆ పనులు కూడా బిల్లులు విడుదల కాకపోవడంతో నిలిచిపోయాయి. కాగా భారీ వర్షాలకు గిరిజనులు శ్రమదానంతో ఏర్పాటు చేసుకున్న మార్గంతో పాటు అనకాపల్లి జిల్లా పరిధిలో నిర్మించిన రోడ్డు కూడా కొట్టుకుపోయాయి. దీంతో ఈ రహదారిపై కనీసం నడిచి వెళ్లే అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో కొండ శిఖర గ్రామమైన జాజులబందలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అర్ల గ్రామం వరకు తరలించడం కష్టంగా ఉంది. ఆరు నెలల వ్యవధిలో ఈ గ్రామానికి చెందిన పాంగి ఎస్తేరు, పాంగి సుబ్బారావు, గెమ్మెలి ఆనందరావు, మర్రి కావ్య, నెల రోజుల పాప, నాలుగు నెలల బాలుడు మర్రి ఎనోష్‌కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. రహదారి లేకపోవడం వల్లే వీరంతా మృతి చెందారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.