Share News

కాపు భవనం కథ కంచికేనా!

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:04 AM

మండలంలోని ఇరువాడ శివారు గణపతినగర్‌లో ఏడేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన కాపు సామాజిక భవనం ఇప్పటికీ పునాదుల స్థాయిలోనే వుంది. గత టీడీపీ హయాంలో పనులు ప్రారంభించగా, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. కూటమి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా అదే పరిస్థితి కొనసాగుతున్నది.

కాపు భవనం కథ కంచికేనా!
కాపు సామాజిక భవన నిర్మాణం చేపట్టింది ఇక్కడే!

‘సబ్బవరం’లో శంకుస్థాపన చేసి ఏడేళ్లు

రూ.15.5 లక్షల మేర పనులు

కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వని వైసీపీ పాలకులు

అప్పటి నుంచి పునాదుల్లోనే భవనం

కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కాపు నేతల వినతి

సబ్బవరం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇరువాడ శివారు గణపతినగర్‌లో ఏడేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన కాపు సామాజిక భవనం ఇప్పటికీ పునాదుల స్థాయిలోనే వుంది. గత టీడీపీ హయాంలో పనులు ప్రారంభించగా, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. కూటమి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా అదే పరిస్థితి కొనసాగుతున్నది.

సబ్బవరం మండలంలో కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలని స్థానిక నేతలు విజ్ఞప్తి చేయడంతో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొండవాలు ప్రదేశంలో స్థలం కూడా కేటాయించడంతో సుమారు రూ.3 లక్షల ఖర్చుచేసి ఆ ప్రదేశాన్ని చదును చేయించారు. డిసెంబరు మూడో తేదీన కాపు సామాజిక భవన నిర్మాణానికి అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు మొదలుపెట్టారు. సుమారు రూ.12.5 లక్షల మేర పనులు పూర్తిచేసిన తరువాత బిల్లు అప్‌లోడ్‌ చేశారు. ఈ సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లో వుండడం, తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో బిల్లు చెల్లింపు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. మూడేళ్ల తరువాత వైసీపీకి చెందిన కాపు నేతలు ఒత్తిడి చేయడంతో అప్పటి ప్రజాప్రతినిధులు స్పందించి భవన నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ప్రయత్నించారు. మండల పరిషత్తు నుంచి రూ.5 లక్షలు, జిల్లా పరిషత్తు నుంచి రూ.5 లక్షలు కేటాయించేలా చర్యలు చేపట్టారు. అయితే నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించాలని పట్టుబట్టారు. అయితే భూమి చదును, మొదటి దశ నిర్మాణ పనులకు అయిన రూ.15.5 లక్షలను కాంట్రాక్టర్‌కు చెల్లించి, ఆ తరువాత డిపార్ట్‌మెంట్‌ను మార్చుకోవాలని నాడు నిర్మాణ పనులు పర్యవేక్షించిన ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.. భవన నిర్మాణ పనులు పునఃప్రారంభం కాలేదు. గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కాపు సామాజిక భవన నిర్మాణం పునఃప్రారంభం అవుతుందని స్థానికులు భావించారు. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక శ్రద్ధతీసుకుని కాపు సామాజిక భవన నిర్మాణాన్ని పూర్తిచేయించి అందుబాటులోకి తీసుకురావాలని కాపు నేతలు కోరుతున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 01:04 AM