Share News

తాగే నీరు స్వచ్ఛమేనా?

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:47 AM

ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. అనేకచోట్ల మురుగు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి.

తాగే నీరు స్వచ్ఛమేనా?

ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలకు భారీగా నీటి నమూనాలు

వ్యాధులు ప్రబలిన ప్రాంతాల నుంచి మరిన్ని శాంపిల్స్‌

విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):

ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. అనేకచోట్ల మురుగు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. తాగునీటిని సరఫరా చేసే కొళాయి పైప్‌ల లీకేజీలతో తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో తాము తాగే నీటిని పరీక్షించుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

జీవీఎంసీ సరఫరా చేసే నీటితోపాటు వాటర్‌ ఫ్యూరిఫైర్‌ ప్లాంట్స్‌లో కొనుగోలు చేసే నీటిని కూడా అనుమానాలతో పరీక్షలకు తెస్తున్నారు. దీంతో పెదవాల్తేరులోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలకు భారీగా నీటి నమూనాలు చేరుతున్నారు. సాధారణఃగా రోజుకు పది నుంచి 20 నమూనాలు రాగా, కొద్దిరోజులుగా 50 నుంచి 60 వస్తున్నాయని చెబుతున్నారు.

ఎక్కడి నుంచి..

ఇక్కడికి జీవీఎంసీ, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతోపాటు సాధారణ ప్రజలు నమూనాలు తెస్తున్నారు. సాధారణంగా ఆయాశాఖల అధికారులు ప్రతివారం కొన్ని నమూనాలు పంపిస్తుంటారు. అయితే నీటి రుచిలో తేడా ఉందని, ఇంట్లో జ్వరాలు ఎక్కువయ్యాయని, చాలా మంది నమూనాలు తీసుకువచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా కొళాయి నీరు ఉండగా, ఆర్వో ప్లాంట్స్‌లో కొనుగోలు చేసిన నమూనాలు కూడా ఉన్నాయన్నారు.

ఈ పరీక్షలు నిర్వహణ..

కలుషిత నీటిని తాగడం వల్ల డయేరియా, అతిసార వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడకు వస్తున్న నమూనాల్లో పీహెచ్‌, టీడీఎస్‌ (సోడియం, పొటాషియం లెవెల్స్‌), కలర్‌, టర్బిడిటీ (మురికిగా ఉందా లేదా), క్లోరిన్‌ (మోతాదు), నైట్రైట్‌ (డ్రైనేజీ నీరు కలిసిందా లేదా), హార్డ్‌నెస్‌, ఆల్కల్నిటీ (బేసిక్‌ ఎలమింట్స్‌ అయిన కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయా లేదా) అన్నది పరీక్షిస్తుంటారు. కాగా ప్రస్తుతం వస్తున్న నమూనాల్లో పీహెచ్‌ తక్కువగా ఉన్నట్టు తేలిందని అధికారులు చెబుతున్నారు. పీహెచ్‌ (పవర్‌ ఆఫ్‌ హైడ్రోజన్‌) తక్కువగా ఉంటే గ్యాస్ర్టిక్ట్‌ ఇరిటేషన్స్‌ వంటి ఇబ్బందులు వస్తాయని, టీడీఎస్‌ కూడా తక్కువగా ఉందని తేలుతోంది. దీని వల్ల శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం, కాల్షియం వంటి మినరల్స్‌ అందవు. దీనివల్ల శక్తిహీనంగా మారడంతో పాటు రక్త సరఫరా తగ్గుతుంది. అతి తక్కువ నమూనాల్లో మాత్రమే క్లోరిన్‌, నైట్రైట్‌ సంబంధిత సమస్యలున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 12:47 AM