వంతెనల నిర్మాణం ఉత్తిదేనా?
ABN , Publish Date - May 27 , 2025 | 12:27 AM
మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ అండంగిసింగి గెడ్డ, రాళ్లగెడ్డపై వంతెనల నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. ఈ రెండు వంతెనలను నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో వర్షాలు కురిసినప్పుడు గెడ్డలు ఉధృతంగా ప్రవహించి పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.
కలగా మిగిలిన అండంగిసింగి, రాళ్ల గెడ్డలపై బ్రిడ్జిల నిర్మాణం
వర్షాలు కురిస్తే 10 గ్రామాలకు రాకపోకలు బంద్
ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా ఫలితం శూన్యం
గిరిజనులకు తప్పని ఇబ్బందులు
జి.మాడుగుల, మే 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ అండంగిసింగి గెడ్డ, రాళ్లగెడ్డపై వంతెనల నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. ఈ రెండు వంతెనలను నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో వర్షాలు కురిసినప్పుడు గెడ్డలు ఉధృతంగా ప్రవహించి పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.
అండంగిసింగి గెడ్డ, రాళ్లగెడ్డ మీదుగా పది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ గెడ్డలపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతుంటాయి. ప్రాణాలకు తెగించి గెడ్డను దాటే క్రమంలో గతంలో పలువురు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పంచాయతీలో పర్యటించిన అప్పటి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ వంతెనల నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఆ తరువాత వాటి సంగతి మరిచిపోయారు. గత ఏడాది జూలై నెలలో భారీ వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహించి రాకపోకలు నిలిచిపోయి గిరిజనులు పడుతున్న ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్ దినేశ్‌కుమార్ స్పందించారు. అండంగిసింగి గెడ్డను పరిశీలించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే అది కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పది గ్రామాల గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రెండు గెడ్డలపై వంతెనలు నిర్మించాలని వారు కోరుతున్నారు.