Share News

సజావుగా సాగేనా?

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:49 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం నిర్వహించే పరీక్షలపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

సజావుగా సాగేనా?

ఈ నెల 25 నుంచి ఏయూ దూర విద్య పరీక్షలు

హాజరుకానున్న పది వేల మందికిపైగా విద్యార్థులు

గతంలో అనేక చోట్ల మాస్‌ కాపీయింగ్‌ ఆరోపణలు

ఈసారి పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు

కొన్ని కేంద్రాలపై చర్యలు తీసుకున్న అధికారులు

ఇప్పటికీ అనేక చోట్ల భారీగా వసూళ్లు

విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం నిర్వహించే పరీక్షలపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేసి, కొన్ని కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహించినట్టు తేలింది. ఈ దశలో పలు కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈనెల 25 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమయింది. ఈసారి పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నా, ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్‌కు వీలుగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుచేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏయూ దూరవిద్య ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో బ్యాక్‌లాగ్స్‌ విద్యార్థులు పది వేల మందికిపైగా ఉన్నారు. వీరంతా ఈనెల 25 నుంచి జరగనున్న పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు శ్రీకాకుళం జిల్లా మందస నుంచి గుంతకల్లు వరకు 78 కేంద్రాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. కాగా గతంలో కొన్ని కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా తాడేపల్లి, కొత్తవలస, విజయనగరం తదితర చోట్ల కొన్ని కాలేజీల్లో ఈ వ్యవహారం నడిచిందని సమాచారం. విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలుచేసి మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజా పరీక్షల నేపథ్యంలో డబ్బులు చేతులుమారయని, ఇప్పటికే కొన్నిచోట్ల ఒక్కో విద్యార్థి వద్ద రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని కొందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దూరవిద్య అధికారులు పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నారు.

వీసీ ప్రత్యేక దృష్టి

దూర విద్య పరీక్షల నిర్వహణపై ఏయూ వైస్‌ చాన్సల ర్‌ జీపీ రాజశేఖర్‌ కూడా కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో డైరెక్టర్‌ అప్పలనాయుడు అబ్జర్వర్ల నియామకంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా పరీక్షలకు ముందే ఆయా కాలేజీలకు చెందిన ప్రతినిధులు దూరవిద్య అధికారుల వద్దకు వచ్చి లాబీయింగ్‌ చేయడం, అబ్జర్వర్ల నియామకంలో చూసీ, చూడనట్టు వ్యవహరించేలా చేసుకోవడం పరిపాటిగా వస్తోంది. ఇటువంటి వాటికి చెక్‌ చెప్పేలా చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అబ్జర్వర్ల నియామకానికి సంబంధించిన వివరాలను ఎవరికీ తెలియనివ్వడం లేదు.

ముందస్తు హెచ్చరికలు జారీ..

కొన్నాళ్లుగా దూరవిద్యపై తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో ఈ పరీక్షలను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రంగా ఉన్న కాలేజీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే జామిలో నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష కేంద్రాన్ని మంజూరుచేసిన కాలేజీపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్కడ కనీసం లేకపోయినా దూరవిద్య కేంద్రాన్ని మంజూరు చేశారు. దీంతో అధికారులు ఈ కేంద్రాన్ని మార్చారు. దీంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నామనే సంకేతాలు పంపినట్టు అయిందని సమాచారం.

Updated Date - Nov 24 , 2025 | 12:49 AM