సాగునీటి వనరులకు జవసత్వాలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:49 AM
మన్యంలోని సాగునీటి వనరులకు జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఏజెన్సీలో 321 సాగునీటి వనరులకు మరమ్మతులు చేపట్టి 14 వేల 979 ఎకరాల్లో ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఈ ఏడాది ప్రతిపాదనలు చేశారు.
ఈ ఏడాది చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు రూ.77.11 కోట్లతో ప్రతిపాదనలు
గతేడాది రెండు విడతలుగా రూ.20.11 కోట్లతో పనులు
గత వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి రంగం పూర్తిగా నిర్లక్ష్యం
కూటమి ప్రభుత్వంలో పునరుజ్జీవం
కలెక్టర్ చొరవతో చెక్‌డ్యామ్‌లు, మినీ రిజర్వాయర్ల మరమ్మతులకు మోక్షం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలోని సాగునీటి వనరులకు జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఏజెన్సీలో 321 సాగునీటి వనరులకు మరమ్మతులు చేపట్టి 14 వేల 979 ఎకరాల్లో ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఈ ఏడాది ప్రతిపాదనలు చేశారు. ఏజెన్సీలోని చెక్‌డ్యామ్‌లు, మినీ రిజర్వాయర్లకు మరమ్మతులు చేపట్టేందుకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పటికే రెండు విడతలుగా 136 వనరులకు మరమ్మతులు చేసేందుకు రూ.20 కోట్ల 11 లక్షలను మంజూరు చేశారు. తాజాగా రూ.77 కోట్ల 11 లక్షలతో మరికొన్నింటిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
గిరిజన ప్రాంతంలో సాగునీటి వనరులపై గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏజెన్సీలోని సాగునీటి రంగానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం గమనార్హం. ఏజెన్సీ పదకొండు మండలాల పరిధిలో 1,566 చిన్న తరహా సాగునీటి(చెక్ డ్యామ్‌లు) వనరులున్నాయి. వాటి పరిధిలో 66 వేల ఎకరాల్లో ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. అయితే ఆయా సాగునీటి వనరులు ఏడాది విడిచి ఏడాదికోమారు మరమ్మతులకు గురవుతుంటాయి. ఫలితంగా సాగునీరు పంట పొలాలకు అందకుండా వృథాగా పోతుంటాయి. ఈ తరుణంలో ఆయా సాగునీటి వనరులకు అవసరమైన మరమ్మతులను చిన్నతరహా సాగునీటి పారుదల శాఖ అధికారులు చేపడతారు. కానీ వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏజెన్సీలో సగానికి పైగా సాగునీటి వనరులు మరమ్మతులకు గురయ్యాయి.
గతంలో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు కేటాయించినా దక్కని ఫలితం
వైసీపీ ప్రభుత్వం ఒక అసెంబ్లీ స్థానం పరిధిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.20 కోట్లు కేటాయించినా, వాటిలో సైతం సాగునీటి వనరుల మరమ్మతులకు ఒక్క రూపాయి వెచ్చించలేదు. నియోజకవర్గానికి కేటాయించిన మొత్తం నిధులను కేవలం మెటల్ రోడ్డు, సీసీరోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలకు మాత్రమే కేటాయించారు. దీంతో గిరిజన రైతులు కేవలం వర్షాధారంగానే వ్యవసాయాన్ని చేయాల్సిన పరిస్థితి వైసీపీ హయాంలో కొనసాగింది.
తాజా 321 వనరుల మరమ్మతులకు రూ.77 కోట్లతో ప్రతిపాదనలు
మన్యంలో ఈ ఏడాది 321 సాగునీటి వనరులకు మరమ్మతులు చేపట్టి, వాటి కింద ఉన్న 14 వేల 979 ఎకరాల్లోని ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. అందుకు గాను రూ.77 కోట్ల 11 అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి చిన్ననీటి పారుదల శాఖాధికారులు కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు ప్రతిపాదనలు సమర్పించారు.
గతేడాది రెండు విడతల్లో రూ.20.11 కోట్లు మంజూరు
ఏజెన్సీలో సాగునీటి వనరులకు జీవం పోయాలనే ఆలోచనతో జాతీయ ఉపాధి పథకం ద్వారా ఏజెన్సీలోని 136 చెక్‌డ్యామ్‌లు/మినీ రిజర్వాయర్లకు మరమ్మతులు చేపట్టేందుకు కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ గతేడాది రెండు విడతలుగా రూ.20 కోట్ల 11 లక్షలు మంజూరు చేశారు. తొలి విడతలో రూ.12 కోట్ల వ్యయంతో 71 పనులు మంజూరు కాగా, రెండో విడతలో రూ.8 కోట్ల 11 లక్షలతో 65 పనులను మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన ప్రాంతంలో సాగునీటి వనరులకు మోక్షం కలగడంపై గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాగునీటి వనరుల మరమ్మతుల ప్రతిపాదనల వివరాలు
వ.సం మండలం చెక్‌డ్యామ్‌లు ఆయకట్టు(ఎకరాల్లో) వ్యయం(రూ.లక్షల్లో)
1. అనంతగిరి 78 3,958 1,454.6
2. అరకులోయ 16 828 671
3. డుంబ్రిగుడ 25 1,150 667
4. హుకుంపేట 16 1,135 238
5. పెదబయలు 31 1,555 473
6. ముంచంగిపుట్టు 12 402 178
7. పాడేరు 23 675 333
8. చింతపల్లి 25 1,245 720
9. జీకేవీధి 20 1,268 1176
10. జి.మాడుగుల 43 1,880 1,124
11. కొయ్యూరు 22 883 678
-----------------------------------------------------------------------------------------------
మొత్తం 321 14,979 7711.6
-----------------------------------------------------------------------------------------------