Share News

సాగునీటికి ఇక్కట్లు

ABN , Publish Date - May 11 , 2025 | 12:53 AM

మండలంలోని ధారగెడ్డ మొదటి ఆనకట్ట శిథిలావస్థకు చే రడంతో ఆయకట్టుకు నీరు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మదుములు, ఆనకట్ట మరమ్మతులు చేయాలని పదేళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీటికి ఇక్కట్లు
శిథిలావస్థకు చేరిన ధారగెడ్డ ఆనకట్టు

శిథిలమైన ధారగెడ్డ ఆనకట్ట

దెబ్బతిన్న మదుము, పాడైనగేట్లు

కాలువలకు పారని నీరు

రెండు వేల ఎకరాలకు నీరు అందక రైతుల ఇక్కట్లు

పదేళ్ల నుంచి ప్రతిపాదనల్లోనే మరమ్మతులు

గొలుగొండ, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ధారగెడ్డ మొదటి ఆనకట్ట శిథిలావస్థకు చే రడంతో ఆయకట్టుకు నీరు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మదుములు, ఆనకట్ట మరమ్మతులు చేయాలని పదేళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని పాతమల్లంపేట పంచాయతీ పరిధిలోని కొండల్లో కురిసిన వర్షం నీరు ధారగెడ్డ ద్వారా ప్రవహిస్తుంది. ఏడాది పొడవునా నీటి ప్రవాహం వుండడంతో చాలా ఏళ్ల క్రితం ఆనకట్ట నిర్మించారు. దీనిద్వారా సుమారు రెండు వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఏటా ఖరీఫ్‌, రబీలో రైతులు వరి పంటను సాగు చేస్తుంటారు. అయితే కాలక్రమేణా ఆనకట్ట, మదుము శిథిలావస్థకు చేరుకున్నాయి. మదుము గేటు పాడైపోయింది. దీంతో కాలువల ద్వారా పంటపొలాలకు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరమ్మతులు చేయించాలని ఇరిగేషన్‌ అధికారులను తరచూ కోరుతున్నారు. కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. ధారగెడ్డ నీరు పంట పొలాలకు మళ్లకుండా వృథాగా పోతున్నదని రైతులు వాపోతున్నారు.

కాగా మండలంలో వంద ఎకరాల లోపు ఆయకట్టు కలిగిన చెరువులు 112 వుండగా, వంద ఎకరాలకుపైబడి ఆయకట్టు వున్న ఆనకట్టలు ఏడు వున్నాయి. మొత్తం 13 సాగునీటి సంఘాలకు రెండు నెలల క్రితం ఎన్నికలు జరిగి కమిటీలు ఏర్పాటయ్యాయి. కానీ ఇంతవరకు నీటి వనరుల మరమ్మతుల గురించి పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. సాగునీటి వనరులకు మరమ్మతుల కోసం ఏటా ప్రతిపాదనలు తయారుచేయడం, ప్రభుత్వానికి పంపడం, ఆమోదం లభించకపోవడం ఆనవాయితీగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా మొత్తం 43 పనులకు రూ.6 కోట్లు మంజూరు కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. మరో నెల రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం అవుతుందని, సాగునీటి వనరుల్లో పూడికతీత, మరమ్మతు పనులు ఈలోగానే చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కాగా సాగు వనరులకు మరమ్మతులపై ఇరిగేషన్‌ జేఈ రవికిరణ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ధారగెడ్డ ఆనకట్ట మరమ్మతులు, పంట కాలువల్లో పూడిక తీత, గేట్లకు మరమ్మతు పనులకు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఏటా ప్రతిపాదనలకే పరిమితం

లెక్కల నానాజీ, రైతు, పాతమల్లంపేట

ధారగెడ్డలో ఏడాది పొడవునా నీటి ప్రవాహం వుంటుంది. కానీ ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో కాలువలకు నీరు ప్రవహించడంలేదు. దీంతో పంటలకు నీరు సరిగా అందక ఇబ్బంది పడుతున్నాం. ఆనకట్ట, మదుములకు మరమ్మతులు చేయించాలని ఎన్నోసార్లు అధికారులను కోరాం. ఏటా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపడం, బుట్టదాఖలు చేయడం ఆనవాయితీగా మారింది.

Updated Date - May 11 , 2025 | 12:53 AM