భూ సమీకరణలో అక్రమాలు
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:42 AM
గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టిన విచారణలో అనేక అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో భూ సమీకరణ పేరిట రూ.25 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం. అసలు భూములే లేని వారిని బినామీలుగా చూపించి, వారికి పది వేల గజాలు కేటాయించినట్టు వచ్చిన ఫిర్యాదులపై విచారణకు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ అధికారులు వెనుకంజవేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
విజిలెన్స్ విచారణలో వెలుగులోకి
పేదలకు ఇళ్ల కోసం జెర్రిపోతులపాలెంలో 64.63 ఎకరాలు సమీకరించిన వైసీపీ ప్రభుత్వం
భూమి లేని వారికి 10 వేల గజాల కేటాయింపు
ఆ మొత్తం విలువ రూ.25 కోట్లు పైమాటే
అక్రమాల్లో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాత్ర
విశాఖపట్నం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి):
గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టిన విచారణలో అనేక అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో భూ సమీకరణ పేరిట రూ.25 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం. అసలు భూములే లేని వారిని బినామీలుగా చూపించి, వారికి పది వేల గజాలు కేటాయించినట్టు వచ్చిన ఫిర్యాదులపై విచారణకు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ అధికారులు వెనుకంజవేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఇళ్ల నిర్మాణం కోసం జెర్రిపోతులపాలెంలో మొత్తం 64.63 ఎకరాలను సుమారు 50 మందికి పైగా రైతుల నుంచి సమీకరించారు. డీపట్టా ఉంటే 900 గజాలు, డీపట్టా లేకుండా భూమి ఆధీనంలో ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదైతే 450 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. భూములు ఇచ్చిన రైతులకు గ్రామ సమీపంలో గల కొండకు ఆనుకుని ప్లాట్లు అభివృద్ధి చేసి అందించారు. మొత్తం 65 మందికి 5,444.5 గజాలు కేటాయించారు. కాగా కొందరు స్థానిక వైసీపీ నేతలు, అప్పటి పెందుర్తి తహసీల్దారు, సిబ్బంది ఏకమై 15 మంది బినామీల పేర్లు నమోదుచేశారు. వీరి పేరిట సుమారు 10 వేల గజాల ప్లాట్లు కేటాయించారు. వాస్తవంగా రైతుల నుంచి సమీకరించిన భూమికి ప్లాట్లు కేటాయించలేదు. ఆక్రమిత భూమికి ఎకరాకు 450 గజాల చొప్పున రైతులకు అందాలి. కానీ కొందరికి చాలా తక్కువ ఇచ్చారు.
గత ప్రభుత్వ పెద్దల దన్నుతో గ్రామంలోని ఓ వైసీపీ నేత తనకు వచ్చే వాటా కంటే ఐదింతలు ప్లాట్లు తీసుకున్నారు. అతని సతీమణి, అత్త, బావమరిది, మరదలు, తోడల్లుడు పేరిట అక్రమాలు సాగాయి. వాస్తవంగా వీరికి భూములు లేకపోయినా బినామీలుగా జాబితాలో చోటు సంపాదించారు. పెందుర్తి తహసీల్దారు కార్యాలయం కేంద్రంగా రికార్డులు మార్చేశారు. ఇదిలా ఉండగా జెర్రిపోతులపాలెం భూ సమీకరణపై జరుగుతున్న విచారణను పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.