Share News

చెత్త తరలింపులో అక్రమాలు

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:09 AM

జోన్‌ల నుంచి కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు చెత్త తరలింపులో అక్రమాలు చోటుచేసుకున్న విషయం వాస్తవమేనని జీవీఎంసీ అధికారులు నిర్ధారించారు.

చెత్త తరలింపులో అక్రమాలు

  • నిర్ధారించిన జీవీఎంసీ అధికారులు

  • చేసిన పనికి మించి డీజిల్‌ డ్రా చేసినట్టు గుర్తింపు

  • కాంట్రాక్టర్‌ నుంచి రికవరీకి చర్యలు

  • ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

జోన్‌ల నుంచి కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు చెత్త తరలింపులో అక్రమాలు చోటుచేసుకున్న విషయం వాస్తవమేనని జీవీఎంసీ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి రికవరీకి చర్యలు ప్రారంభించారు.

జోన్‌-4 పరిధిలోని టౌన్‌కొత్తరోడ్డు, జోన్‌-6 పరిధిలోని గాజువాక, జోన్‌-7 పరిధిలోని చీమలాపల్లిలో ఏర్పాటుచేసిన క్లోజ్డ్‌ కాంపాక్టర్‌ సిస్టమ్‌ (సీసీఎస్‌) ప్రాజెక్టు నుంచి చెత్తను హుక్‌ లోడర్ల ద్వారా కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించాల్సి ఉంది. అయితే రాత్రి వేళ ఓపెన్‌ టిప్పర్లతో తరలిస్తున్నారని, హుక్‌ లోడర్లు మరమ్మతులో ఉన్నప్పటికీ వాటి పేరిట జీవీఎంసీ నుంచి ప్రతి నెలా డీజిల్‌ తీసుకుంటున్నారని ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ స్పందించి మెకానికల్‌ విభాగం అధికారులను విచారణకు ఆదేశించారు. అధికారులు ఆయా జోన్లలోని సీసీఎస్‌ ప్రాజెక్టుల నుంచి కాపులుప్పాడలోని జిందాల్‌ ప్లాంటుకు తరలింపు, జీవీఎంసీ నుంచి ఎంత డీజిల్‌ను తీసుకున్నారనే దానిపై లోతుగా విచారణ జరిపారు. గాజువాకలో ఒక హుక్‌ లోడర్‌ రోడ్డు ప్రమాదం కారణంగా గ్యారేజీలో ఉన్నప్పటికీ దాని పేరిట సుమారు రూ.21 లక్షల వరకు డీజిల్‌ను తీసుకున్నట్టు గుర్తించారని తెలిసింది. అలాగే జిందాల్‌ ప్లాంటు ప్రతినిధులు ఇచ్చిన ట్రిప్‌ షీట్‌లకు, బిల్లు కోసం కాంట్రాక్టరు అధికారులకు అందజేసిన ట్రిప్‌ షీట్‌లకు భారీ తేడా (సుమారు 700 ట్రిప్పులు) ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. అదనపు ట్రిప్పులు పేరుతో డ్రా చేసిన డీజిల్‌ను కూడా చీమలాపల్లి, గాజువాక, టౌన్‌కొత్తరోడ్డు సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను చూస్తున్న కాంట్రాక్టర్‌ నుంచి రికవరీకి ప్రతిపాదనలు తయారుచేస్తున్నట్టు సమాచారం.

ఇదిలావుండగా సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణ చూసే కాంట్రాక్టర్లకు మెకానికల్‌ విభాగంలోని ఒక అధికారి కొమ్ముకాస్తున్నారని, వారికి అనుకూలంగా బిల్లు చెల్లించేలా ఫైల్‌ పెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఆ విభాగం సిబ్బంది చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పైస్థాయిలో పలుకుబడి ఉన్నవారని, తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుందని తమను బెదిరిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఇటీవల టౌన్‌కొత్తరోడ్డులోని సీసీఎస్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు టెర్మినేషన్‌ నోటీసు ఇవ్వాలని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ స్వయంగా ఆదేశించారు. ఆ మేరకు మెకానికల్‌ విభాగం అధికారులు జారీచేసిన నోటీసుపై ఏఈ, డీఈలు సంతకం చేసినా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఉన్న అధికారి మాత్రం సంతకం చేయలేదని చెబుతున్నారు. ఏదిఏమైనా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వరుస కథనాలతో సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణలో అవినీతికి అడ్డుకట్టపడిందని మెకానికల్‌ విభాగం సిబ్బంది హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 01:09 AM