పౌరసరఫరాల్లో అక్రమాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:40 AM
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ సిబ్బంది నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. జిల్లా గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్‌కు వచ్చి బియ్యం, ఇతర సరుకులను తూకం వేయకుండానే రేషన్ డిపోలకు సరఫరా చేస్తున్నారు. దీనివల్ల టన్నుకు 15-20 కిలోల మేర తరుగు వస్తున్నదని డీలర్లు వాపోతున్నారు. తూకం వేయాల్సిందేనని తాము పట్ట్టుబడితే లేనిపోని కేసులు నమోదు చేసి, డీలర్‌షిప్‌ను రద్దు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్ల సిబ్బంది ఇష్టారాజ్యం
బియ్యం బస్తాలు తూకం వేయకుండానే డిపోలకు సరఫరా
టన్నుకు 15-20 కిలోల మేర తరుగు వస్తున్నదని డీలర్ల ఆవేదన
తూకం వేయాలని పట్టుబడితే.. వేధింపులకు గురిచేస్తారని ఆరోపణ
రావికమతం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ సిబ్బంది నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. జిల్లా గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్‌కు వచ్చి బియ్యం, ఇతర సరుకులను తూకం వేయకుండానే రేషన్ డిపోలకు సరఫరా చేస్తున్నారు. దీనివల్ల టన్నుకు 15-20 కిలోల మేర తరుగు వస్తున్నదని డీలర్లు వాపోతున్నారు. తూకం వేయాల్సిందేనని తాము పట్ట్టుబడితే లేనిపోని కేసులు నమోదు చేసి, డీలర్‌షిప్‌ను రద్దు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రావికమతంలోని పౌరసరఫరాల ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలో రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు చెందిన 95 రేషన్ డిపోలు వున్నాయి. రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయడానికి ప్రతి నెలా సుమారు 600 టన్నుల బియ్యాన్ని ఇక్కడి నుంచి సరఫరా చేస్తుంటారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి, అంగన్‌వాడీ కేందాలకు మరో 30 టన్నుల బియ్యం పంపుతుంటారు. నిబంధనల ప్రకారం జిల్లా గోదాము/ రైస్ మిల్లుల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు లారీల్లో వచ్చిన బియ్యాన్ని గోదాములోకి దించాలి. తరువాత తూకం వేసి, వేరే వాహనాల్లో రేషన్ డిపోలకు పంపాలి. లేదంటే ఇక్కడకు వచ్చిన పెద్ద లారీల్లో నుంచి నేరుగా వ్యాన్లలోకి బియ్యం బస్తాలను లోడింగ్ చేసి, తరువాత వే బ్రిడ్జిలలో ఎలక్ర్టానిక్ కాటాపై తూకం వేయాలి. కానీ ఎంఎల్‌ఎస్ పాయింట్ సిబ్బంది ఈ నిబంధనలను పాటించడం లేదు. జిల్లా గోదాము నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు వచ్చిన బియ్యాన్ని నేరుగా వేరే లారీల్లో లోడింగ్‌చేసి, తూకం వేయకుండానే డిపోలకు సరఫరా చేస్తున్నారు. ప్రతి బస్తాలో నికరంగా 50 కిలోల బియం వుండాలి. గోనె సంచితో కలిపి 50.58 కిలోలుగా పరిగణిస్తారు. కానీ ఆ మేరకు బియ్యం వుండడం లేదని, టన్నుకు 15-20 కిలోల తరుగు వస్తున్నదని రేషన్ డీలర్లు చెబుతున్నారు. తూకం వేసి ఇవ్వాల్సిందేనని తాము పట్టుబడితే.. తరువాత కాలంలో రేషన్ డిపోల్లో తనిఖీల పేరుతో వేధిస్తారని, 6ఏ కేసులు నమోదు చేయిస్తారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ బియ్యాన్ని తూకం వేయకుండా డిపోలకు సరఫరా చేయడంపై స్థానిక ఎంఎల్‌ఎస్ పాయింట్ గోదాము ఇన్‌చార్జిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. డీలర్లు ఇష్టపడే తూకం వేయకుండా బియ్యం తీసుకెళుతున్నారని అన్నారు. తూకం వేయాలని వాళ్లు (డీలర్లు) అడిగితే తప్పకుండా కాటా వేయిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని తహశీల్దారు అంబేడ్కర్ వద్ద ప్రస్తావించగా, తూకం వేయకుండా రేషన్ డిపోలకు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. నిబంధనల ప్రకారం డీలర్ సమక్షంలో తూకం వేసి సరుకులు ఇవ్వాలని, ఈ విషయంపై దృష్టి సారిస్తానని ఆయన చెప్పారు.