జీసీసీలో ఆగని అక్రమాలు!
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:23 PM
గిరిజన సహకార సంస్థలో అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ చోటు చేసుకోని అక్రమాలు జీసీసీలోనే జరుగుతున్నాయి. తాజాగా పెదబయలు బ్రాంచ్‌లో సుమారు కోటిన్నర నిధులు గోల్‌మాల్ అయ్యాయి.
తాజాగా పెదబయలు బ్రాంచ్‌లో రూ.కోటిన్నర గోల్‌మాల్
అకౌంటెంట్‌ను సస్పెండ్ చేసి మిన్నకున్న అధికారులు
పైనుంచి కింద వరకు కమిషన్లే కారణం
కాఫీ గింజల కొనుగోలుల్లో అక్రమాలపై దృష్టి సారించని వైనం
ఐఏఎస్ అధికారి ఎండీగా ఉన్నాగాడిన పడని జీసీసీ
(పాడేరు/పెదబయలు- ఆంధ్రజ్యోతి)
గిరిజన సహకార సంస్థలో అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ చోటు చేసుకోని అక్రమాలు జీసీసీలోనే జరుగుతున్నాయి. తాజాగా పెదబయలు బ్రాంచ్‌లో సుమారు కోటిన్నర నిధులు గోల్‌మాల్ అయ్యాయి. సంస్థలోని కింది స్థాయి ఉద్యోగి మొదలుకుని పైస్థాయి అధికారి వరకు కమిషన్లకు కక్కుర్తిపడడం వల్లే అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు పంపకాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెదబయలు బ్రాంచ్‌లో అక్రమాల తీరిదీ
స్థానిక జీసీసీ డివిజన్ పరిధిలోని పెదబయలు బ్రాంచ్‌లోని 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచే అక్రమాలు మొదలైనప్పటికీ అధికారుల పర్యవేక్షణా లోపంతో తాజాగా (2025లో) వెలుగులోకి వచ్చాయి. పెదబయలు బ్రాంచ్‌లోని అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అధికారి 2022లో రూ.7 లక్షలు, 2023లో రూ.31 లక్షలు, 2024లో రూ.44 లక్షలు, 2025లో రూ.1.64 లక్షలు మొత్తం రూ.83 లక్షల 64 వేలు స్వాహా చేసినట్టు తాజాగా జరిగిన విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. కాని వాస్తవానికి రూ.కోటిన్నర వరకు స్వాహా అయినట్టు సిబ్బందే చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా ఒక బ్రాంచ్‌లో రూ.లక్షల మేరకు స్వాహా జరుగుతున్నప్పటికీ వెలుగులోకి రాకపోవడం గమనార్హం. అలాగే ఇదే బ్రాంచ్‌లో పసుపు, కాఫీ గింజల కొనుగోలుకు సంబంఽధించి అక్రమాలు సైతం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని అంటున్నారు. అయితే జీసీసీకి సంబంధించిన అక్రమాల్లో పెదబయలు బ్రాంచ్ మొదటిదీ కాదు.. ఆఖరిదీ కాదు. గతంలో పాడేరు, చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల, అరకులోయ బ్రాంచ్‌ల్లోనూ అనేక అక్రమాలు చోటుచేసుకున్నప్పటికీ అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టకపోవడంతో జీసీసీలో అక్రమాలు నిత్యకృత్యంగా మారాయి.
అధికారుల కమిషన్ల కక్కుర్తే అక్రమాలకు కారణం
జీసీసీ వ్యవహారాల్లో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కంటే కమిషన్లపైనే అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే అక్రమాలను గుర్తించకపోవడం, అక్రమార్కులతో చేతులు కలపడం వంటివి చేస్తుంటారని అంటున్నారు. అందువల్లే జీసీసీలో ఏళ్ల తరబడి అక్రమాలకు పాల్పడినా అధికారులు ఆఖరి స్థాయికి చేరుకునే వరకు మిన్నకుంటున్నారని అంటున్నారు. వాస్తవానికి ఏ సంస్థలోనైనా ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో ఆడిట్ జరుగుతుంది. ఈక్రమంలోనే ఆర్థిక లావాదేవీల్లోని అవకతవకలు, హెచ్చుతగ్గులుంటే బయటపడతాయి. కాని జీసీసీలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆడిట్ ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈలోపు నిధులు గోల్‌మాల్ జరుగుతుంటాయి. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగి పదవీ విరమణకు కొన్ని రోజులు ముందు మాత్రమే అధికారులు ఆయా అక్రమాలను గుర్తించి, తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటారు. దీంతో సంస్థకు ఎటువంటి ప్రయోజనం కలగకపోగా అక్రమాలకు పాల్పడిన వాళ్లకే ప్రత్యక్షంగా మేలు జరుగుతున్నది. అలాగే జీసీసీకి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారులు, ఉద్యోగుల అక్రమాలు, పనితీరును మెరుగుపర్చే అంశాల్లో కనీస మార్పులు చోటు చేసుకోకపోవడం గమనార్హం. ఇక గిరిజన రైతుల నుంచి కాఫీ గింజల కొనుగోలు వ్యవహారాల్లో అక్రమాలను గుర్తించడం, బాధ్యులను శిక్షించడం వంటివి మచ్చుకైనా చేయలేని పరిస్థితిలో జీసీసీ యంత్రాంగం ఉంది. ఇదే అదనుగా జీసీసీలో అక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే సంస్థ మనుగడను కోల్పోయి, నిర్జీవ స్థితికి చేరుకుంటుందని పలువురు జీసీసీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.