Share News

అడుగడుగునా అక్రమాలు

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:22 AM

మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూర్మన్నపాలెంలో నిర్మించిన ఎంవీవీ-ఎంకే పార్క్‌ ప్రాజెక్టులో అక్రమాలు వాస్తవమేనని జీవీఎంసీ టౌన్‌ సర్వేయర్‌ నిర్ధారించారు.

అడుగడుగునా అక్రమాలు

ఎంవీవీ ఎంకే ప్రాజెక్టుపై జీవీఎంసీకి టౌన్‌ సర్వేయర్‌ నివేదిక

26 సెంట్లు ప్రభుత్వ భూమి ఆక్రమించినట్టు నిర్ధారణ

ప్రభుత్వ స్థలంలోని రోడ్డు కూడా కబ్జా చేసి అపార్టుమెంట్‌ నిర్మాణం

నాలా పన్ను కట్టకపోయినా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చేసిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

బిల్డర్‌ కోర్టులో కేసు వేసినా కౌంటర్‌ దాఖలుచేయని జీవీఎంసీ అధికారులు

ఆ భవనం జోలికివెళ్లొదంటూ ఇటీవల నాయస్థానం ఆదేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూర్మన్నపాలెంలో నిర్మించిన ఎంవీవీ-ఎంకే పార్క్‌ ప్రాజెక్టులో అక్రమాలు వాస్తవమేనని జీవీఎంసీ టౌన్‌ సర్వేయర్‌ నిర్ధారించారు. ఈ మేరకు నివేదికను రెండు రోజుల క్రితం మేయర్‌ పీలా శ్రీనివాసరావుకు అందజేశారు. ఎంవీవీ, ఎంకే పార్క్‌ అపార్టుమెంట్‌కు సెమీ బల్క్‌ నీటి కనెక్షన్‌ ఇచ్చే అంశంపై రెండు నెలల కిందట జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరిగాయని, బిల్డర్‌ జీవీఎంసీ, రెవెన్యూ ఆదాయానికి గండి కొట్టినందున వాటిపై విచారణ జరపాలని 87వ వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. టౌన్‌సర్వేయర్‌ విచారణ జరపగా ఉల్లంఘనలు వాస్తవమేనని నిర్ధారణ అయింది.

జీవీఎంసీ జోన్‌-6 (గాజువాక) 86వ వార్డు పరిధి కూర్మన్నపాలెం సర్వే నంబర్‌ 58/3పి, 59/1బి పార్టు, 52/5సీ, 60/1పిలోని 9.56 ఎకరాల్లో జీ+9 తరహా అపార్టుమెంట్‌ నిర్మాణానికి మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మరో వ్యక్తి కలిపి ప్లాన్‌ కోసం జీవీఎంసీకి 2019లో దరఖాస్తు చేసుకున్నారు. కొన్నాళ్ల కిందట భవన నిర్మాణం పూర్తవడంతో సెమీబల్క్‌ నీటి కనెక్షన్‌ ఇవ్వాలంటూ నివాసితులు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దీనికోసం అంచనాలు తయారుచేసి పైప్‌లైన్‌ నిర్మాణం కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ మేరకు కట్టేశారు. సెమీ బల్క్‌ కనెక్షన్‌ ఇవ్వాలంటే జీవీఎంసీ కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి కావడంతో నీటి సరఫరా విభాగం అధికారులు ప్రతిపాదన తయారుచేసి రెండు నెలల కిందట జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకునేలా అజెండాలో చేర్చారు. కౌన్సిల్‌లో దీనిపై చర్చ సందర్భంగా 87వ వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్‌ ఆ ప్రాజెక్టులో అనేక ఉల్లంఘనలు జరిగాయని, నాలా కట్టకపోయినా ప్లాన్‌తోపాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేసేశారని, రైవాడ కాలువ బఫర్‌ జోన్‌, శ్మశానం కబ్జా చేసి అపార్టుమెంట్‌ నిర్మించారని దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. జోన్‌-6 టౌన్‌ సర్వేయర్‌ దీనిపై సమగ్ర విచారణ జరిపారు.

ప్లాన్‌ దరఖాస్తుతోపాటు అపార్టుమెంట్‌ నిర్మించనున్న భూమికి సంబంధించి 9.59 ఎకరాలకు మాత్రమే ఓనర్‌షిప్‌ డీడ్‌లను సమర్పించారు. కానీ ప్రాజెక్టు మాత్రం 9.85 ఎకరాల్లో నిర్మించినట్టు టౌన్‌ సర్వేయర్‌ విచారణలో గుర్తించారు. సర్వే నంబర్‌ 55పీలోని 26 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారని నివేదికలో సర్వేయర్‌ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ రికార్డులో రోడ్డుగా గుర్తించిన భూమిని కూడా ఆక్రమించినట్టు నిర్ధారించారు. ప్లాన్‌కు దరఖాస్తు చేసినప్పుడే సుమారు రూ.9 కోట్లు నాలా కింద రెవెన్యూ అధికారులకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని చెల్లించలేదని పేర్కొన్నారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసేలోపు ఆ మొత్తాన్ని చెల్లించాలని బిల్డర్‌కు నోటీసు ఇవ్వడంతోపాటు ప్లాన్‌ రిమార్కులో పొందుపరిచినా, ఇప్పటికీ కట్టలేదని సర్వేయర్‌ వివరించారు. నాలా మొత్తాన్ని రెవెన్యూ శాఖకు కట్టించిన తర్వాతే ఓసీ జారీచేయాల్సి ఉన్నా సరే ఆ విషయాన్ని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు విస్మరించినట్టు నిర్ధారించారు. పైగా ఆ భవన నిర్మాణానికి ప్లాన్‌ కోసం రూ.9.67 కోట్లు ఫీజు కింద జీవీఎంసీకి చెల్లించాల్సి ఉండగా, జోన్‌-2 పరిధిలోని మూడు టీడీఆర్‌లను పెట్టి ఆదాయానికి గండికొట్టారు. ఇదిలావుండగా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఈ నివేదికను రెండు రోజుల కిందట మేయర్‌కు అందజేశారు. ఈ ప్రాజెక్టుపై 87వ వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్‌తోపాటు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు లోకేష్‌, పి.నారాయణకు ఫిర్యాదు చేయడంతో బిల్డర్‌ ముందుజాగ్రత్తగా భవనంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేకుండా కోర్టును ఆశ్రయించారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కోర్టులో కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో బిల్డర్‌కు అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీచేసిందని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 01:22 AM