Share News

ఈపీడీసీఎల్‌ఎల్‌లో అడ్డగోలు బదిలీలు

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:42 AM

తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)లో బదిలీలకు ఓ సమయం అంటూ లేకుండా పోయింది. అంతా అధికారుల ఇష్టారాజ్యంగా మారింది.

ఈపీడీసీఎల్‌ఎల్‌లో అడ్డగోలు బదిలీలు

అనకాపల్లి సర్కిల్‌లో అధికారుల ఇష్టారాజ్యం

అడ్మిన్‌ గ్రౌండ్స్‌ పేరుతో

ఎక్కడికి కావాలంటే అక్కడికే...

40 రోజుల క్రితం ముగ్గురు మహిళలకు,

తాజాగా మరో నలుగురికి...

కార్పొరేట్‌ కార్యాలయానికి సమాచారం నిల్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)లో బదిలీలకు ఓ సమయం అంటూ లేకుండా పోయింది. అంతా అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. ప్రతి శాఖలో ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే బదిలీల ప్రక్రియ చేపడతారు. ఆ తరువాత అత్యవసరం అనుకుంటే ఉన్నతాధికారులతో చర్చించి ఒకటి, రెండు చేస్తారు. కానీ ఈపీడీసీఎల్‌ అనకాపల్లి సర్కిల్‌లో గత కొద్దికాలంగా ఎప్పుడు పడితే అప్పుడు బదిలీలు చేస్తున్నారు. సాధారణంగా సిబ్బంది పనితీరు బాగుండకపోయినా, అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నా ఆ విషయాన్ని ఆ ప్రాంత అధికారులు ...జిల్లా బాధ్యుల దృష్టికి తీసుకువెళతారు. వినియోగదారుల సౌకర్యార్థం అవసరమైతే వారిని మార్చాలని లేఖ రాస్తారు. వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీ. కానీ ఇటీవల అనకాపల్లి సర్కిల్‌లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, ఏ అధికారి లేఖలు రాయకున్నా...కొందరిని ఉన్నతాధికారులు బదిలీ చేస్తున్నారు. పోనీ అక్కడ సమస్య పరిష్కారం కోసమా?...అంటే ఆ కారణాలూ కనిపించడం లేదు. ఎవరి లబ్ధి కోసమో బదిలీలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా అంటే రెండు రోజుల కిందట నలుగురు జూనియర్‌ ఇంజనీర్లను బదిలీలు చేశారు. పరవాడ ఫార్మాసిటీలో పనిచేస్తున్న ఎస్‌.బంగారయ్యను రోలుగుంటకు వేశారు. రోలుగుంటలో ఉన్న ఓ.రమేశ్‌ను నక్కపల్లికి పంపించారు. అక్కడ ఉన్న ఎం.రామచంద్రను అచ్యుతాపురం వేశారు. అక్కడ పనిచేస్తున్న డి.జె.ప్రసాదరావును పరవాడ ఫార్మాసిటీకి బదిలీ చేశారు. పరిపాలన, ఆపరేషన్‌ సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేశామని ఉత్తర్వుల్లో ఎస్‌ఈ పేర్కొన్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఎవరూ వీరి బదిలీల కోసం సిఫారసు చేయలేదు. లేఖలూ రాయలేదు.

ఆ విషయం కార్పొరేట్‌ కార్యాలయానికే తెలియదు

అనకాపల్లి సర్కిల్‌లో జరుగుతున్న బదిలీల విషయం పక్కనే విశాఖలో ఉన్న కార్పొరేట్‌ కార్యాలయానికి కూడా తెలియడం లేదు. ఆ సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఏఈలుగా పనిచేస్తున్న ముగ్గురు మహిళలు పి.విజయప్రభ, వి.విజయలక్ష్మి, విష్ణుప్రియలను జిల్లా ఉన్నతాధికారి 40 రోజుల క్రితం బదిలీ చేశారు. ఈ విషయం తెలియక ఇటీవల సీఐఐ పెట్టుబడిదారుల సదస్సుకు డ్యూటీలు వేసినప్పుడు ఆయా మహిళా అధికారులు పూర్వపు స్థానాల్లోనే ఉన్నారనుకొని ఆ విధంగానే ఉత్తర్వులు జారీ చేశారు. ఇది చూసి సర్కిల్‌ అధికారులు అంతా ఆశ్చర్యపోయారు. ఏ విషయం కార్పొరేట్‌ కార్యాలయానికి చెప్పడం లేదనే విషయం బయటపడింది.

పనితీరులో అట్టడుగున...

అనకాపల్లి జిల్లాకు ఇటీవల అధిక ప్రాధాన్యం ఏర్పడింది. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వస్తున్నాయి. అయితే వినియోగదారుల నుంచి ప్రతి నెలా తీసుకునే ఫీడ్‌ బ్యాక్‌ ప్రకారం చూసుకుంటే ఈ జిల్లా అట్టడుగున ఉంటోంది. విద్యుత్‌ సరఫరా సరిగ్గా ఉండడం లేదని, ఫిర్యాదులు చేస్తే సకాలంలో స్పందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గత ఐదు నెలల నుంచీ ఈ జిల్లా అట్టడుగున ఉందని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ముఖ్యంగా మాడుగుల, రావికమతం మండలాల నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆకస్మిక బదిలీలపై అనకాపల్లి ఎస్‌ఈ జి.ప్రసాద్‌ను వివరణ కోరగా, పరిపాలన అవసరాల కోసమే చేపడుతున్నామన్నారు. కార్పొరేట్‌ కార్యాలయానికి కూడా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు.


పెరిగిన గుడ్డు ధర

హోల్‌సేల్‌గా 100 గుడ్లు రూ.610

రిటైల్‌లో రూ.6.50-రూ.7

తూర్పుభారతానికి ఎగుమతులు పెరగడమే కారణం

విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):

కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది. విశాఖలో హోల్‌సేల్‌గా 100 గుడ్లు రూ.610, విజయనగరం, శ్రీకాకుళంలో రూ.614కు చేరుకుంది. రిటైల్‌ మార్కెట్‌లో ఒక గుడ్డు రూ.6.50 నుంచి ఏడు రూపాయలకు విక్రయిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మరింత ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కార్తీకమాసంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. చికెన్‌ కిలో స్కిన్‌లెస్‌ రూ.240కు లభిస్తోంది. అయితే గుడ్డు రేటు మాత్రం అమాంతం పెరిగింది. ఇంకా పెరుగుతుందని గుడ్లు రైతులు చెబుతున్నారు. చలికాలం కావడంతో రాష్ట్రం నుంచి తూర్పు భారతం ప్రధానంగా కోల్‌కతా మార్కెట్‌కు భారీగా గుడ్లు ఎగుమతులు అవుతున్నాయి. మిగిలిన సీజన్లతో పోల్చితే తూర్పు, ఈశాన్య భారతాల్లో శీతాకాలం గుడ్డు వినియోగం రెండింతలు అవుతుందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకల కోసం కేకులు తయారీకి భారీగా గుడ్లు వినియోగిస్తున్నారు. అందువల్ల మార్కెట్‌లో గుడ్డు రేటు పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. చలి తీవ్రత కొనసాగినంత కాలం కోల్‌కతా మార్కెట్‌లో గుడ్డుకు డిమాండ్‌ ఉంటుందని, దానివల్ల ఉత్తరాంధ్రలో గుడ్డు రేటు పెరుగుతుంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - Nov 18 , 2025 | 01:42 AM