Share News

పెట్టుబడులు రూ.98,917 కోట్లు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:58 AM

జిల్లాలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు భాగస్వామ్య సదస్సులో 99 ఒప్పందాలు జరిగినట్టు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ తెలిపారు.

పెట్టుబడులు రూ.98,917 కోట్లు

2,58,089 మందికి ఉద్యోగావకాశాలు

జిల్లాలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు భాగస్వామ్య సదస్సులో 99 ఒప్పందాలు

ఐటీ, పర్యాటక రంగాలకు చెందినవే ఎక్కువ

500 నుంచి 600 ఎకరాలు సిద్ధం

కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు భాగస్వామ్య సదస్సులో 99 ఒప్పందాలు జరిగినట్టు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ 99 ఒప్పందాలకు సంబంధించి రూ.98,917 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, వాటి వల్ల 2,58,089 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఒప్పందాలు చేసుకున్న వాటిలో ఐటీ, డేటా సెంటర్లు, పర్యాటక రంగానికి చెందిన ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయన్నారు. ఐటీ, డేటా సెంటర్ల కోసం 500 నుంచి 600 ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు. వీఎంఆర్‌డీఏ మరో 1,200 ఎకరాలు సేకరిస్తోందన్నారు. ఈనెల 13వ తేదీన ఏడు ఐటీ కంపెనీలకు శంకుస్థాపన జరిగినట్టు కలెక్టర్‌ తెలిపారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు త్వరితగతిన ఏర్పాటయ్యేలా జిల్లా యంత్రాంగం కార్యాచరణ అమలుచేస్తోందన్నారు. ప్రధానంగా రాష్ట్రస్థాయిలో పెట్టుబడులను ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఈడీబీ) పర్యవేక్షిస్తోందని పేర్కొంటూ, ఆ సంస్థ సూచన మేరకు జిల్లాలో కంపెనీలకు భూములు కేటాయిస్తామన్నారు. జిల్లాలో సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగంగా సాగేలా తాము చూస్తామన్నారు. భూములు కేటాయింపు, నీరు, విద్యుత్‌, మౌలిక వసతుల కల్పన వంటివి జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోందని కలెక్టర్‌ తెలిపారు. మెడ్‌టెక్‌ జోన్‌ కార్యకలాపాల విస్తరణకు మరికొంత భూమి కావాలని సంబంధిత వర్గాలు కోరుతున్నాయని పేర్కొన్నారు. భీమునిపట్నం మండలం కొత్తవలసలో నేవీ అవసరాలకు 150 ఎకరాలు సేకరించే పనిలో యంత్రాంగం ఉందన్నారు.


గడువులోగా మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం

ఇంజనీరింగ్‌, ప్లానింగ్‌ విభాగాలకు కమిషనర్‌ ఆదేశం

క్షేత్రస్థాయిలో పనులు పరిశీలన

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ నిర్మించాలని ప్రతిపాదించిన మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ తేజ్‌ భరత్‌ సూచించారు. ఆయా పనులు ఎంతవరకూ వచ్చాయో స్వయంగా తెలుసుకోవడానికి ఇంజనీరింగ్‌, ప్లానింగ్‌ అధికారులతో కలసి గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మొత్తం ఏడు రహదారులను 26.72 కి.మీ. పొడవున రూ.175 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని చీఫ్‌ ఇంజనీర్‌ వినయకుమార్‌ వివరించారు. అందులో ప్రధానమైన అడవివరం-గండిగుండం, గంభీరం, గంభీరం-పరదేశిపాలెం, బోయపాలెం, కాపులుప్పాడ రహదారులను కమిషనర్‌ పరిశీలించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీయూపీ శిల్ప, ఎస్‌ఈ మధుసూదనరావు, ఈఈ రామరాజు తదితరులు పాల్గొన్నారు.


ధాన్యం కొనుగోలుకు 10 కేంద్రాలు

‘ఎ’ గ్రేడ్‌ క్వింటా రూ.2,389, సాధారణ రకం రూ.2,369...

జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

ఖరీఫ్‌ సీజన్‌లో పండిన ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలోని 29 రైతుసేవా కేంద్రాల పరిధిలో 10 కేంద్రాలు ఏర్పాటుచేశామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ‘ఎ’ గ్రేడ్‌ ధాన్యం క్వింటా రూ.2,389, సాధారణ రకం క్వింటా రూ.2,369కు కొనుగోలు చేస్తారని అన్నారు. పది ధాన్యం సేకరణ కేంద్రాలను జిల్లాలో మూడు రైస్‌ మిల్లులకు అనుసంధానం చేశామన్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు గన్నీల (40 కిలోల సామర్థ్యం)కు రూ.4.74, లేబర్‌ చార్జీల కింద రూ.22, రవాణా చార్జీల కోసం టన్నుకు రూ.295 చెల్లిస్తామన్నారు. రైతులు ధాన్యం అమ్మకానికి వాట్సాప్‌ నంబరు 73373 59375కు హాయ్‌ అని మెసేజ్‌ చేసి షెడ్యూల్‌ చేసుకోవాలన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్ములు జమ చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పనిచేస్తాయన్నారు. జిల్లాలో ధాన్యం పండించే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జేసీ కోరారు.

Updated Date - Nov 21 , 2025 | 12:58 AM