Share News

అంచనాలకు మించి పెట్టుబడులు

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:28 AM

‘‘అంచనాలకు మించి విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయి...

అంచనాలకు మించి పెట్టుబడులు

మారనున్న విశాఖ రూపురేఖలు

గూగుల్‌తో పాటు మరో డేటా సెంటర్‌ ఏర్పాటు

అభివృద్ధికి అనుగుణంగా మౌలిక వసతులు పెంచుకోవాలి

జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించుకుని శరవేగంగా అమలుచేయాలి

పెట్టుబడులు వస్తున్నందున విశాఖ ఎకనామిక్‌ జోన్‌ ఇటు శ్రీకాకుళం నుంచి అటు కోనసీమ వరకూ విస్తరణ

యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు

అనకాపల్లి నుంచి విజయనగరం మీదుగా శ్రీకాకుళం వరకూ రింగ్‌ రోడ్డు ప్రతిపాదన

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు

ప్రజలకు ప్రతి విషయం వివరించండి...మీ కేరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలబోతుంది

విశాఖ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

‘‘అంచనాలకు మించి విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయి...ఇంత భారీ స్పందన వస్తుందని ఊహించలేదు. గూగుల్‌ డేటా సెంటర్‌తోపాటు వన్‌ గిగావాట్‌ సామర్థ్యంలో మరో పెద్ద సంస్థ విశాఖలో డేటా సెంటర్‌ నెలకొల్పబోతోంది. వాటికి అనుబంధంగా మరికొన్ని పరిశ్రమలు వస్తుండడంతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయి’’...అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఉదయం పోర్టు అతిథిగృహం ఆవరణలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు రాష్ట్రంలో గేమ్‌ ఛేంజర్‌గా పేర్కొన్నారు. ప్రధానంగా అభివృద్ధిపరంగా విశాఖ మౌలిక స్వరూపం మారుతుందన్నారు. గూగుల్‌ తరహాలో మరో పెద్ద కంపెనీ ఒక గిగావాట్‌ సామర్థ్యంతో డేటా సెంటర్‌ విశాఖలో ఏర్పాటుచేయబోతోందన్నారు. దీనిపై ఈ రోజు (గురువారం సాయంత్రం) ప్రకటన వెలువడనున్నదన్నారు. వీటితోపాటు మరికొన్ని కంపెనీలు విశాఖకు రానుండడంతో మౌలిక వసతులు పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా నగరం, పరిసరాల్లో వసతుల కల్పన దిశగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించుకుని శరవేగంగా అమలు చేయాలన్నారు. కంపెనీల రాకతో ఉత్తరాంధ్రలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

భారీ పెట్టుబడులతో కంపెనీలు వస్తున్నందున విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ పరిధిని ఇటు శ్రీకాకుళం, అటు కోనసీమ వరకూ విస్తరిస్తున్నామన్నారు. ఈ రీజియన్‌ ఆర్థికంగా పురోగతి సాధించే క్రమంలో వసతులు అంతేస్థాయిలో పెంచుకోవాలన్నారు. రీజియన్‌ అభివృద్ధిలో భాగంగా అనకాపల్లి జిల్లా నుంచి విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లా వరకై అవుటర్‌ రింగ్‌రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదించామని, దీనిపై మరింత సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించామన్నారు. అవుటర్‌ రింగ్‌రోడ్డులో భాగంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. మాడుగుల, చోడవరం ప్రాంతంలో ఒక సెజ్‌ ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రతిపాదించామన్నారు. పారిశ్రామికంగా ఆ రెండు అసెంబ్లీ సెగ్మెంట్‌లు అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

విశాఖ, పరిసరాల్లో అనేక పరిశ్రమలు రానుండడంతో పెద్దఎత్తున యువతకు ఉపాధి లభిస్తుందని, తద్వారా ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందన్నారు. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులపై ఉందని చంద్రబాబునాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న వేళ...ప్రజలకు ప్రతి విషయం చెప్పాలని, అప్పుడు మీ కేరీర్‌లో ఇదో ల్యాండ్‌మార్క్‌ అవుతుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజలకు చెప్పడం ద్వారా వారితో అనుబంధం మరింత బలపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన వారిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, కోండ్రు మురళి, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఎ చైర్మన్‌ ఎం.ప్రణవ్‌గోపాల్‌, ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, తదితరులు ఉన్నారు.


సదస్సుకు మూడంచెల భద్రత

ఎనిమిది మంది ఐపీఎస్‌ల పర్యవేక్షణలో 2,300 మందితో బందోబస్తు

కీలక ప్రాంతాల్లో పికెట్ల ఏర్పాటు

ప్రాంగణంలో కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌

ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సుకు మూడు అంచెల్లో పటిష్ట భద్రతను ఏర్పాటుచేశారు. మద్దిలపాలెం కూడలితోపాటు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ జంక్షన్‌, ఎస్పీ బంగ్లా జంక్షన్‌ వద్ద పోలీసు పికెట్‌లు ఏర్పాటుచేసి, సదస్సు జరిగే ఏయూ మైదానం వైపు కేవలం పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించే రెండు మార్గాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుంది. ప్రతినిధులు, అధికారులతోపాటు పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. దీనికి సంబంధించిన ఐదుచోట్ల ఐపీఎస్‌ అధికారులు బందోబస్తు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు. ప్రాంగణం లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తారు.

భారీగా బలగాలు

సదస్సు భద్రత కోసం డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా పర్యవేక్షణలో సీపీ శంఖబ్రతబాగ్చి ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఐపీఎస్‌లు, మరో ఎనిమిది మంది అదనపు ఎస్పీలు, 32 మంది డీఎస్పీలు, 89 మంది సీఐలు, 192 మంది ఎస్‌ఐలు, సుమారు రెండు వేల మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ

ప్రాంగణంలోని ప్రధాన వేదిక, ఇతర సమావేశ హాళ్లు, ప్రతినిధుల క్యాబిన్‌లు, రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు, ఎగ్జిబిషన్‌ హాల్‌తోపాటు కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌, పార్కింగ్‌ ప్రాంతాలను డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా గురువారం పరిశీలించారు. ప్రాంగణంలో ఒక త్రెడ్‌ డ్రోన్‌తో పాటు 15 డ్రోన్‌ కెమెరాలు, 155 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించామని సీపీ శంఖబ్రతబాగ్చి డీజీపీకి వివరించారు. నగరంలోని అన్నిహోటళ్లు, లాడ్జిలు, రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లలో నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని, కీలక ప్రాంతాల్లో పోలీస్‌ పికెట్‌లు ఏర్పాటుచేశామన్నారు. ప్రతినిధులు ప్రాంగణానికి వచ్చిపోయే మార్గాల్లో ప్రతి కదలిక కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌లో ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. నగరంలో ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు ‘అస్త్రం’ యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. సదస్సు రెండు రోజులు భద్రతా పరంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సీపీకి డీజీపీ సూచించారు.

Updated Date - Nov 14 , 2025 | 01:28 AM