Share News

పెట్టుబడులు సరే... మౌలిక వసతులేవీ?

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:19 AM

రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

పెట్టుబడులు సరే... మౌలిక వసతులేవీ?

మెట్రో రైలు ప్రాజెక్టు పేరుతో ఫ్లైఓవర్లకు మంగళం

రేపు భోగాపురం విమానాశ్రయానికి వెళ్లాలంటే చుక్కలే

మాస్టర్‌ ప్లాన్‌ రహదారులతో ఒనగూరేదేమీ లేదు

ప్లానింగ్‌లో లోపం...ఆచరణ అసాధ్యం

ఐటీ పార్కు ప్రాంతంలో సదుపాయాల కొరత

సీఎం, ఐటీ మంత్రి దృష్టిసారిస్తేనే సమస్యలు పరిష్కారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి లోకేశ్‌ల కృషితో కలలో కూడా ఊహించని కంపెనీలు వస్తున్నాయి. కేవలం ఏడాదిన్నర కాలంలో గూగుల్‌ డేటా సెంటర్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, రిలయన్స్‌, సిఫీ, ఏఎన్‌ఎస్‌ఆర్‌ వంటి ఐటీ సంస్థలను విశాఖపట్నం తీసుకువచ్చారు. వీటి ద్వారా భవిష్యత్తులో లక్షల మందికి ఉపాధి లభించనుంది. అయితే ఈ కంపెనీల ద్వారా విశాఖపట్నంలో పెరిగే జనాభాకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే దిశగా మాత్రం ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదు. ప్రైవేటు సంస్థలు రూ.లక్షల కోట్లు పెట్టడానికి ముందుకు వస్తున్నప్పుడు ప్రభుత్వం అందుకు తగిన రీతిలో మౌలిక వసతుల ప్రాజెక్టులపై నిధులు వెచ్చించాలి. కానీ ఆ ప్రస్తావన, ప్రణాళిక ఎక్కడా కనిపించడం లేదు. ఏ ప్రజా ప్రతినిధి, జిల్లా అధికారులు వీటిపై పెదవి విప్పడం లేదు. దీనిపై సీఎం, ఐటీ మంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.

భోగాపురం వెళ్లాలంటే..ఎలా..?

భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది అక్టోబరుకల్లా ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వమే చెబుతోంది. మరుక్షణం విశాఖ విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలు ఆపేస్తామని తూర్పు నౌకాదళం అంటోంది. అంటే విశాఖపట్నం వాసులంతా హైవే మీదుగానే భోగాపురం విమానాశ్రయానికి వెళ్లాలి. విశాఖలో లంకెలపాలెం మొదలుకొని ఆనందపురం వరకూ హైవేపై అనేక జంక్షన్లు ఉన్నాయి. ట్రాఫిక్‌ చాలా దారుణంగా ఉంటుంది. వీటిలో లంకెలపాలెం, గాజువాక, సత్యం జంక్షన్‌, మద్దిలపాలెం, హనుమంతవాక, ఎండాడ, పీఎం పాలెం కారుషెడ్‌ జంక్షన్‌, కొమ్మాది, ఆనందపురం జంక్షన్లు దాటాలంటే చాలా సమయం పడుతుంది. ఈ జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దీనికి నేషనల్‌ హైవే అథారిటీ కూడా ముందుకు వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్న’ చందంగా వ్యవహరిస్తోంది. విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంటు నుంచి కొమ్మాది వరకు నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టులో వీటిని చేర్చి డబుల్‌ డెక్కర్‌ విధానంలో నిర్మాణాలు చేపడతామని కొత్త పల్లవి అందుకుంది. దీనివల్ల భూసేకరణ సమస్యలు తప్పడంతో పాటు నిధులు ఆదా అవుతాయని అంటోంది. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు పదేళ్లుగా నలుగుతోంది. ఇప్పటికీ దానికి పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్ట్‌ రూపొందించలేదు. ఆ ప్రాజెక్టుకు సుమారు రూ.12 వేల కోట్లు అవసరం. డబుల్‌ డెక్కర్‌ చేరిస్తే మొత్తం రూ.15 వేల కోట్లు కావాలి. అన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవు. కేంద్రాన్ని అడుగుతోంది. వారు ఎప్పుడు కనికరిస్తారో తెలియదు. ప్రాజెక్టు ఎప్పుడు మొదలై...ఎప్పటికి పూర్తవుతుంతో అంచనాలు లేవు. ఇంతా చేస్తే మెట్రో రైలు ప్రాజెక్టు ఆర్థికంగా వెసులుబాటు కాదని హైదరాబాద్‌ మెట్రో ద్వారానే రుజువైంది. విశాఖపట్నం కంటే ఎన్నో రెట్లు పెద్దదైన హైదరాబాద్‌లోనే దానిని నిర్వహించలేక ఎల్‌ అండ్‌ టి వంటి సంస్థ చేతులెత్తేసిందంటే...విశాఖపట్నంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇవన్నీ అభివృద్ధిని అడ్డుకునే వ్యాఖ్యానాలు కావు. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలు. నిధులే లేని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పేరు చెప్పి ఫ్లైఓవర్ల నిర్మాణం పక్కనపెడితే భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేవారికి నరకం కనిపిస్తుంది. ఈ తిప్పలు లేకుండా వీఎంఆర్‌డీఏ ద్వారా మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు నిర్మిస్తున్నామని చెబుతున్నారు. వారు ప్రతిపాదించిన మార్గాలలో పినగాడి-వేపగుంట, అడవివరం-శొంఠ్యాం మార్గాలు మాత్రమే విమానాశ్రయానికి వెళ్లే వారికి ఉపయోగపడతాయి. మిగిలినవన్నీ లేఅవుట్లు మీదుగా నిర్మిస్తున్న రహదారులు. విమానాశ్రయానికి వెళ్లేవారికి ఆయా మార్గాల్లో ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడదు. ఇది వాస్తవం. భోగాపురం విమానాశ్రయానికి టాక్సీలో వెళ్లడానికి ఒక వైపు రూ.2 వేలు చెల్లించాలి. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరులకు విమాన ప్రయాణం సమయం కంటే విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికే ఎక్కువ సమయం పడుతుంది. దీనిని గుర్తించి ఫ్లైఓవర్ల నిర్మాణం తక్షణమే ప్రారంభించాల్సి ఉంది.

అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా మౌలిక వసతులు పెంచాలి. ఐటీ పార్కుల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో పెరుగుతుంది. ఆఫీసు నుంచి బయటకు వచ్చేవారు బస్సుల కోసం నిల్చోడానికి కనీసం బస్టాప్‌ కూడా లేదు. తినడానికి తిండి, వెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేకపోతే చివరకు మిగిలేవి విమర్శలే. డేటా సెంటర్లకు భారీగా నీరు కావాలి. పోలవరం ఎడమ కాలువ నుంచి తీసుకువస్తామని చెబుతున్నారు. ఎక్కడికక్కడ నిల్వ చేయడానికి రిజర్వాయర్లు కావాలి. వాటి నిర్మాణానికి కూడా ప్రణాళికలు లేవు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయలోపం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు, లోకేశ్‌లు విశాఖపై ప్రత్యేక దృష్టి పెడితేనే వారి కృషికి తగిన ఫలితాలు వస్తాయి. జిల్లా అధికారులు ప్లానింగ్‌ కొంత వరకే ఉంది. వాటిని కూడా ఆచరణలో పెట్టడానికి నిధుల సమస్య ఉంది.

Updated Date - Dec 12 , 2025 | 01:19 AM