Share News

విశాఖకు పెట్టుబడుల వెల్లువ

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:18 AM

విశాఖపట్నానికి పెట్టుబడులు పోటెత్తాయి. విజయవాడలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటికి అమోదం లభించింది.

విశాఖకు పెట్టుబడుల వెల్లువ

తర్లువాడ, అడవివరంలో ‘రైడెన్‌’

రూ.87,250 కోట్లతో డేటా సెంటర్‌ల ఏర్పాటు

కాపులుప్పాడలో ఇమాజినేటివ్‌ టెక్‌ సొల్యూషన్స్‌

గుర్రంపాలెంలో అవంతి లాజిస్టిక్స్‌ పార్క్‌

స్టీల్‌ప్లాంటుకు రూ.2,400 కోట్ల మేర సాయం

విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నానికి పెట్టుబడులు పోటెత్తాయి. విజయవాడలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటికి అమోదం లభించింది. అందులో కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కాపులుప్పాడ సర్వే నంబరు 401లో ఇమాజినేటివ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ (ఇండియా)కు ఎకరా రూ.2 కోట్లు చొప్పున 4.05 ఎకరాలు కేటాయించారు. వారు రూ.140 కోట్లు పెట్టుబడి పెట్టి 2,600 మందికి ఉపాధి కల్పిస్తారు.

- రైడెన్‌ ఇన్ఫోటెక్‌ సంస్థకు తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో మొత్తం 480 ఎకరాలు కేటాయించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-పవర్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. వీరు రూ.87,250 కోట్లు పెట్టుబడి పెట్టి 200 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తారు. పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

- పరవాడ ఫార్మాసిటీలో ఎంఎన్‌ఆర్‌ ఫార్మా కంపెనీ 22.18 ఎకరాల్లో రూ.160 కోట్లు పెట్టుబడి పెట్టి 198 మందికి ఉద్యోగాలు ఇస్తుంది.

- పెందుర్తి సమీపాన గుర్రంపాలెంలో అవంతి వేర్‌ హౌసింగ్‌ సంస్థకు ఇండస్ట్రియల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌కు 20 ఎకరాలు కేటాయించారు. ఎకరాకు రూ.80 లక్షలు ధర నిర్ణయించారు. మొత్తం రూ.319 కోట్లు పెట్టుబడి పెడతారు.

- బీచ్‌రోడ్డులో లులు మాల్‌కు కేటాయించిన 13.74 ఎకరాల్లో రూ.1,066 కోట్లు పెట్టుబడి పెట్టి 500 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. వీరికి ఏడాదికి రూ.7.08 కోట్లు లీజు నిర్ణయించారు.

- అరకులోయలో వీఎస్‌కే హోటల్‌ అండ్‌ రిసార్ట్‌ ఏర్పాటు చేసి రూ.55.84 కోట్లతో 98 మందికి ఉద్యోగాలు ఇస్తుంది.

- వరుణ్‌ బీచ్‌ సంస్థ బీచ్‌రోడ్డులో పునర్నిర్మించే ప్రాజెక్టుకు పర్యాటక శాఖ నుంచి రాయితీలు ఇవ్వాలని తీర్మానించారు.

- విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చిన రూ.2,400 కోట్లను విద్యుత్‌ బిల్లుల రూపేణా సమకూర్చాలని తీర్మానించారు. ఇప్పటివరకూ రూ.753.29 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఆర్‌ఐఎన్‌ఎల్‌ చెల్లించాల్సి ఉంది. ఈపీడీసీఎల్‌ రెండేళ్ల పాటు బిల్లులు తీసుకోకుండా ఉండేలా, ఆ మొత్తాన్ని విద్యుత్‌ సంస్థకు పదేళ్ల తరువాత ప్రిఫరెన్షియల్‌ షేర్‌ క్యాపిటల్‌గా మార్చడానికి నిర్ణయించారు.

Updated Date - Oct 11 , 2025 | 01:18 AM