Share News

సింహాచలం ‘సిరి’ గల్లంతుపై తూతూమంత్రంగా విచారణ

ABN , Publish Date - Sep 11 , 2025 | 01:12 AM

సింహాచలం దేవస్థానం అధికారులు ఆభరణాల లెక్కలలో తేడాలకు కారణమైన వారిపై చర్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ‘సింహాచలం సిరి గల్లంతు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ప్రచురించిన కథనంపై ఓ అధికారి స్పందించారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం ఐదుగురితో కమిటీని నియమించిందని తెలిపారు.

సింహాచలం ‘సిరి’ గల్లంతుపై   తూతూమంత్రంగా  విచారణ

నివేదిక తయారీ బాధ్యత కమిటీలో ఒకరికి అప్పగింత

సిద్ధం చేసిన తరువాత వచ్చి

సంతకాలు పెడతామంటూ మిగిలిన సభ్యుల ఫోన్లు

ఆ వస్తువులన్నీ రిజిస్టర్‌లో

నమోదు చేస్తామంటూ అధికారి వివరణ

విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం దేవస్థానం అధికారులు ఆభరణాల లెక్కలలో తేడాలకు కారణమైన వారిపై చర్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ‘సింహాచలం సిరి గల్లంతు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ప్రచురించిన కథనంపై ఓ అధికారి స్పందించారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం ఐదుగురితో కమిటీని నియమించిందని తెలిపారు. జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారి (జీవీఓ) పల్లంరాజు ఫిబ్రవరి నెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం ఉప ఆలయాల్లో రిజిస్టర్‌ చేయకుండా ఉంచిన 9.464 కిలోల వస్తువులను ఆయా రిజిస్టర్లలో నమోదు చేశామని చెప్పారు. దాతలు వాటిని ఇచ్చిన వెంటనే ఎందుకు పుస్తకాల్లో నమోదు చేయలేదనే దానిపై ఎవరి వివరణ కోరలేదని, ఎవరిపైనా చర్యలకు సిఫారసు చేయలేదని తెలిసింది. ముత్యాలహారంలో దాదాపు 70 గ్రాముల బంగారం మాయంపై కూడా పెద్దగా విచారణ చేయలేదని విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం ఐదుగురు కమిటీలో ఉండగా, అంతా కలిసి ఒకరికే నివేదిక తయారీ ఆ బాధ్యత అప్పగించి, త్వరగా దానిని పూర్తిచేస్తే అంతా వచ్చి సంతకాలు చేస్తామని ఫోన్ల ద్వారా చెప్పినట్టు తెలిసింది. దీనిని బట్టి తూతూమంత్రంగా విచారణ ముగిస్తున్నట్టుగా అర్థమవుతోంది.

30 ఏళ్ల సర్వీసులో వెండి గ్లాసు చూడలేదట

సింహాచలంలో సిరి గల్లంతు కథనంపై అర్చకుల్లో ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. స్వామి వారి పూజలకు ఉపయోగించే వస్తువులు ఆలయంలోనే ఉంటాయని, ఎవరైనా అర్చకులు పదవీ విరమణ చేస్తే వాటిని భౌతికంగా తరువాత వచ్చే అర్చకులకు అప్పగించడమే ఆనవాయితీగా వస్తోందని, లెక్కలు చూసి తీసుకోవడం తన 30 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదని ఆయన వివరించారు. స్వామి వారి పూజాసామగ్రిలో మొదట వెండి గ్లాసు పేరు రిజిస్టర్‌లో ఉంటుందని, అయితే ఎప్పుడూ ఆ వెండి గ్లాసును తాను చూడలేదని సదరు అర్చకుడు చెప్పడం గమనార్హం. అంటే...దేవస్థానంలో పుస్తకాలలో లెక్కలకు, వాస్తవంగా ఉండే వస్తువులకు పొంతన ఉండదని అర్థమవుతోంది. అయితే అఽధికారులు మాత్రం తనిఖీలు, విచారణ అంటూ మసి పూసి మారేడు కాయ చేసి భక్తులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.

Updated Date - Sep 11 , 2025 | 01:12 AM