లైంగిక వేధింపులపై విచారణ
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:50 AM
నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నతాధికారి ఒకరు మహిళా పీజీలను, సిబ్బందిని వేధిస్తున్నారని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వరుసగా ప్రచురించిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది.
ఈఎన్‌టీ ఆస్పత్రికి వెళ్లిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ
అధికారి వ్యవహారంపై డీఎంఈకు అందిన ఫిర్యాదులు
రెండు రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం
విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నతాధికారి ఒకరు మహిళా పీజీలను, సిబ్బందిని వేధిస్తున్నారని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వరుసగా ప్రచురించిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. ఆ వైద్యాధికారిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)కు కూడా ఫిర్యాదు అందడంతో కమిటీతో విచారణ చేయించి, నివేదిక ఇవ్వాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఆ మేరకు ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి ఐదుగురు వైద్యాధికారులతో కమిటీని నియమించారు. అందులో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, పరిపాలనాధికారి పీవీ రమణ, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ సత్యప్రసాద్, జనరల్ సర్జరీ హెచ్‌ఓడీ, మైక్రోబయాలజీ హెచ్‌ఓడీ ఉన్నారు. వారంతా పెదవాల్తేరులోని ఈఎన్‌టీ ఆస్పత్రికి గురువారం ఉదయం పది గంటలకు వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విచారణ చేశారు. పీజీ విద్యార్థినులు, మహిళా వైద్యులు, సిబ్బందిని వేర్వేరుగా పిలిచి వేధింపులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నాళ్ల నుంచి ఇలా జరుగుతోంది?, ఏ విషయాల్లో ఇబ్బంది పెడుతున్నారు?...అనే అంశాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో మహిళ ఒకరు ఆడియో రికార్డింగ్‌ను డీఎంఈకి పంపించారు. అది కమిటీకి అందజేయడంతో, దానిని వినిపించి, అందులో అంశాలు వాస్తవమా?, కాదా?...అని పలువురిని ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సిబ్బందిలో కొందరు అదంతా నిజమే అని చెప్పగా, అయితే రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరగా, ఆ తరువాత తమకు మళ్లీ ఇబ్బందులు వస్తాయని, వారు వెనకడుగు వేసినట్టు సమాచారం. ఉన్నతాధికారి చరిత్ర గురించి కూడా కమిటీ ఆరా తీసింది. మహిళలు వెల్లడించిన అంశాలపై కమిటీ చర్చించి, అవసరమైతే మరోసారి ఆస్పత్రికి వెళ్లి ఇంకాస్త లోతుగా విచారణ చేయాలని కమిటీ భావిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా రెండు రోజుల్లో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు కమిటీ నివేదిక ఇవ్వనుంది.