టెక్నాలజీ సాయంతో కేసుల దర్యాప్తు
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:21 AM
కేసుల దర్యాప్తులో టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు మెరుగైన సేవలు అందిస్తున్నారని విశాఖ రేంజ్ డీఐటీ గోపీనాథ్ జెట్టి అన్నారు. శనివారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో డ్రోన్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిని, గంజాయి రవాణా చేసేవారిని గుర్తించడానికి డ్రోన్‌లు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
- స్థానికంగా గంజాయి నేరాలకు పాల్పడుతున్నవారిని గుర్తిస్తున్నాం
- హాస్టళ్లు, ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
- విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
నర్సీపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేసుల దర్యాప్తులో టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు మెరుగైన సేవలు అందిస్తున్నారని విశాఖ రేంజ్ డీఐటీ గోపీనాథ్ జెట్టి అన్నారు. శనివారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో డ్రోన్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిని, గంజాయి రవాణా చేసేవారిని గుర్తించడానికి డ్రోన్‌లు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కేసుల దర్యాప్తులో కొన్ని రకాల అప్లికేషన్లు ఉపయోగిస్తున్నామన్నారు. అన్ని ప్రార్థనామందిరాలు, వసతి గృహాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి స్థానికులతో కలిసిపోయి గంజాయి రవాణాకు పాల్పడుతున్నారన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో నేరాల్లో 50 శాతం సైబర్ నేరాలు ఉంటాయన్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఎక్కువగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని డిజిటల్ అరెస్టులు పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. డిజిటల్ అరెస్టులు అనేవి లేవని, సైబర్ నేరాలపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నియంత్రణకు శక్తి టీమ్స్, శక్తి యాప్ ఉపయోగపడుతున్నాయని, పిల్లలపై జరుగుతున్న నేరాలపై కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.