ఉక్కు ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టుకు 21న ఇంటర్వ్యూలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:33 AM
స్టీల్ ప్లాంటులో చాలాకాలంగా ఖాళీగా ఉన్న డైరెక్టర్ పోస్టుల భర్తీపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటులో చాలాకాలంగా ఖాళీగా ఉన్న డైరెక్టర్ పోస్టుల భర్తీపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రెండు రోజుల క్రితం ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సలీం జి పురుషోత్తమన్‌ను నియమించింది. శనివారం ఉత్తర్వులు రాగా ఆయన ఆదివారం సెలవు రోజున బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టును భర్తీ చేయడానికి ఈ నెల 21వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇదిలావుండగా సీఎండీ పోస్టుకు కూడా ఒకరిని నాలుగు నెలల క్రితమే ఎంపిక చేశారు. అయితే ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా...మాంగనీన్ ఓర్ ఇండియా లిమిటెడ్ నుంచి శక్తిమణిని డిప్యూటేషన్‌పై తీసుకువచ్చి పెట్టారు. ఆయన ఇక్కడ ఉద్యోగులను, కాంట్రాక్టు కార్మికులను తగ్గించే పనిలో ఉన్నారు. తాజాగా 900 మంది కాంట్రాక్టు కార్మికులను ఆపేశారు. దీనిపై కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.
పోలీస్ శాఖలో పదోన్నతులు, బదిలీలు
విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ సీపీ శంఖబ్రతబాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఆరుగురికి హెడ్ కానిస్టేబుళ్లుగా, హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న నలుగురికి ఏఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించారు.
34 మందికి బదిలీ
నగర పోలీస్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐలుగా పనిచేస్తున్న 34 మందిని ఇతర స్టేషన్లకు బదిలీ చేస్తూ సోమవారం సీపీ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో ముగ్గురు ఏఎస్‌ఐలు, 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 11 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.