ఇంటర్నెట్ సేవలు ఘోరం
ABN , Publish Date - May 23 , 2025 | 12:49 AM
జిల్లా కేంద్రం పాడేరుతో సహా మండలంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు ఘోరంగా ఉండడంతో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అవస్థఽలు పడుతున్నారు. పాడేరు ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్, జియో వంటి టెలికామ్ సేవలున్నప్పటికీ వివిధ సాంకేతిక కారణాలతో గత నెల రోజులుగా సేవలు సక్రమంగా అందడం లేదు.
- అవస్థలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
- సుమారు నెల రోజులుగా ఇదే దుస్థితి
పాడేరు, మే 22(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరుతో సహా మండలంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు ఘోరంగా ఉండడంతో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అవస్థఽలు పడుతున్నారు. పాడేరు ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్, జియో వంటి టెలికామ్ సేవలున్నప్పటికీ వివిధ సాంకేతిక కారణాలతో గత నెల రోజులుగా సేవలు సక్రమంగా అందడం లేదు. పాడేరుతో పాటు చుట్టుపక్కన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ సచివాలయాలకు ఇదే సమస్య ఏర్పడింది. దీంతో ఇంటర్నెట్ ఆధారంగా చేసే ఆన్‌లైన్ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ ఉద్యోగులు అవస్థలు పడుతుండగా, ప్రత్యక్షంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల కష్టాలు
ఏజెన్సీలో ఇంటర్నెట్ సేవలు అధ్వానంగా ఉండడంతో ఎక్కువగా వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. పారామెడికల్ సిబ్బంది ప్రజలకు సేవలందించే క్రమంలో 18 యాప్‌లను వినియోగించాల్సి ఉంది. అవన్నీ పని చేయాలంటే ఇంటర్నెట్ సక్రమంగా ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో పారామెడికల్ సిబ్బంది చేసిన పనిని సైతం యాప్‌లో అప్‌లోడ్ చేసుకోని దుస్థితి ఏర్పడుతున్నది. దీంతో ప్రభుత్వ డ్యాష్ బోర్డ్‌లో వివరాలు నమోదుకాక ఏజెన్సీలోని పారామెడికల్ సిబ్బంది ప్రజల సేవలు, ఆన్‌లైన్ నమోదు పక్రియను చేపట్టడడం లేదని భావిస్తున్నారు. ఈ పరిణామాలు తమకు ఇబ్బందికరంగా ఉంటున్నాయని పారామెడికల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్‌లు సైతం ఇదే పరిస్థితిని నిత్యం ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏజెన్సీలో ఇంటర్నెట్ సేవలను మెరుగుపరచాలని పలువురు కోరుతున్నారు.