అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:09 PM
ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న మన్యం(అరకు) కాఫీ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలను అరకు కాఫీ బ్రాండ్‌గా ఎగుమతులు చేస్తున్నారు.
ప్యారిస్‌లోని ‘అరకు కాఫీ’ కేఫ్‌నకు డిమాండ్
గిరిజన ప్రాంతంలో సాగుకు బీజం వేసిన ప్రభుత్వ అధికారి రాఘవేంద్రరావు
చేయూతనిచ్చిన కాఫీ బోర్డు, ఐటీడీఏ
కాఫీ సాగు, మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు
కాఫీ బెర్రీ బోరర్‌ను సమర్థ్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం
నేడు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా...
చింతపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న మన్యం(అరకు) కాఫీ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలను అరకు కాఫీ బ్రాండ్‌గా ఎగుమతులు చేస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు అరకు కాఫీ రుచులను ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్యారిస్‌లో ఏర్పాటుచేసిన ‘అరకు కాఫీ’ కేఫ్‌లో ఇక్కడి గిరిజన రైతులు పండించిన కాఫీని సేవించేందుకు పలు దేశాల పర్యాటకులు క్యూ కడుతున్నారు. అరకు కాఫీ బిస్కెట్లు, చాక్లెట్లను కూడా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఉత్తమ కాఫీ ఉత్పత్తుల్లో ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టిన ఘనత కూడా అరకు కాఫీకే దక్కుతుందని కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీబాత్ కార్యక్రమంలో అరకు కాఫీ ఖ్యాతిని ప్రత్యేకంగా ప్రస్తావించడం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు కాఫీని బాగా ప్రమోట్ చేయడంతో ప్రపంచ దేశాల కాఫీ ప్రియుల దృష్టి అరకు కాఫీపై పడింది.
భారత్ నుంచి ఎగుమతి అవుతున్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీ అగ్రస్థానంలో ఉంది. ఆదివాసీ రైతుల ఆర్థిక ప్రగతికి కాఫీ తోటలు ఎంతగానో దోహదపడుతున్నాయి. 2015 నుంచి ప్రపంచ దేశాల ప్రజలు అక్టోబరు ఒకటిన అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కాఫీ దినోత్సవంలో 77 దేశాల ప్రజలు పాలుపంచుకుంటున్నారు. ఈ కాఫీ దినోత్సవంలోనూ అరకు కాఫీ రుచులపై పలు దేశాల ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అరకుకాఫీ సాగుపై అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కాఫీ పంటను ప్రప్రఽథంగా ఇథియోఫియా దేశీయులు గుర్తించారు. ఇథియోఫియాలో ఖాఫా అనే ప్రాంతంలో 1582లో కాఫీ సాగు ప్రారంభమైంది. ప్రస్తుతం కాఫీ సాగు 82 దేశాల్లో 22 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. భారతదేశంలో తొలిసాగు కర్ణాటకలోని చిక్మంగళూరులో 1670లో ప్రారంభమైంది. 1820లో విశాఖ ఏజెన్సీకి కాఫీ పంట వచ్చింది. తొలుత రైతులు పెరట్లో ఒకటీ, రెండు మొక్కలను సాగు చేసుకునేవారు. వీరు పండించుకున్న అతి తక్కువ కాఫీ గింజలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఏజెన్సీకి రావడం ప్రారంభించారు. అనంతరం జైపూర్ సంస్థానాధీశులు అరకు, పాడేరు, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో కాఫీ సాగును మొదలుపెట్టారు.
రాఘవేంద్రరావు కృషి ఫలితంగా..
విశాఖ ఏజెన్సీ ఆదివాసీ రైతులు కాఫీ సాగు ప్రారంభించడానికి ప్రభుత్వ అధికారి రాఘవేంద్రరావు కృషి ఫలితమేనని చెప్పక తప్పదు. కేంద్ర ప్రభుత్వ అధికారి అయిన ఆయన గిరిజన ప్రాంతాల్లో పర్యటించి కాఫీ సాగుపై లోతుగా అధ్యయనం, పరిశోధనలు చేశారు. విశాఖ ఏజెన్సీ కాఫీ సాగుకు అత్యంత అనుకూలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా కాఫీ సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఆయన పేరిట గూడెంకొత్తవీధి మండలంలో ఆర్‌వీనగర్(రాఘవేద్రరావు నగర్) గ్రామం, కాఫీ ఎస్టేట్ ఏర్పాటయ్యాయి.
అటవీశాఖ, కాఫీబోర్డు సంయుక్తంగా సాగు ప్రారంభం
విశాఖ ఏజెన్సీలో అటవీశాఖ, కాఫీబోర్డు సంయుక్తంగా 1970లో కాఫీసాగును ప్రారంభించింది. తొలుత కేవలం 300 హెక్టారుల్లో కాఫీ సాగు ప్రారంభించి రెండేళ్లలో 1200 హెక్టార్లకు విస్తరించింది. 1976 నుంచి ఏపీఎఫ్‌డీసీ(ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ) కాఫీ సాగును ఏజెన్సీలో పది మండలాల్లో విస్తరించింది. ప్రస్తుతం ఏపీఎఫ్‌డీసీ ఆధీనంలో 4,010 హెక్టారుల్లో కాఫీ సాగు జరుగుతోంది. కాఫీ సాగును కాఫీబోర్డు, ఏపీఎఫ్‌డీసీ విజయవంతంగా సాగుచేస్తుండడంతో ఐటీడీఏ రైతులకు కాఫీ పంటను పరిచయం చేసింది. 1974 నుంచి రైతులు కాఫీ సాగును ప్రారంభించారు. ప్రస్తుతం పాడేరు రెవెన్యూ డివిజన్‌లో 2.45 లక్షల ఆదివాసీ కుటుంబాలు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు.
కాఫీ బోర్డు ప్రత్యేక కృషి
దేశంలో కాఫీ సాగు విస్తరణలో కాఫీ బోర్డు ప్రధాన భూమిక పోషిస్తున్నది. ప్రధానంగా కాఫీ బోర్డు విస్తరణ, పరిశోధన రంగాలు స్థాపించి రైతులకు సేవలందిస్తున్నది. పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లో కాఫీ బోర్డు విస్తరణ కార్యాలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ పరిశోధన స్థానాలను కాఫీబోర్డు ఏర్పాటు చేసింది. ఐదింటిలో ఒకటి ఏఎస్‌ఆర్ జిల్లా గూడెంకొత్తవీధి మండలం ఆర్‌వీనగర్ వద్ద 1976లో రీజనల్ రీసెర్చ్ స్టేషన్, 1982లో ప్రయోగశాలను ఏర్పాటుచేశారు. పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఇప్పటికే పలు రకాల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందజేస్తున్నారు.
ఫైన్ అవార్డుల్లోనూ..
కాఫీబోర్డు ప్రతిష్ఠాత్మకంగా దేశ వ్యాప్తంగా నిర్వహించే ఫైన్ కప్ అవార్డుల్లోనూ అల్లూరి జిల్లా ఆదివాసీ రైతులు సత్తాచాటుతున్నారు. గతంలో గిరిజన ప్రాంతంలో కాఫీ సాగు చేపడుతున్న ఏపీఎఫ్‌డీసీ 12 సార్లు ఫైన్ కప్ అవార్డులను దక్కించుకున్నది. ప్రతి ఏడాది పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రతి ఏడాది రైతులు నాణ్యమైన కాఫీ దిగుబడులు సాధించి ఫ్లేవర్ ఆఫ్ ఫైన్‌కప్ అవార్డును దక్కించుకుంటున్నారు. గత ఏడాది లంబసింగి పంచాయతీ అసరాడ గ్రామానికి చెందిన గిరిజన రైతు లాగరి వెంకటరావు ఫైన్ కప్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
కాఫీ బెర్రీ బోరర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం
అరకు కాఫీకి కాఫీ బెర్రీ బోరర్ కీటకం వ్యాప్తి చెందడంతో అధికారులు, రైతులు కలవరం చెందారు. మన్యం కాఫీకి పెనుముప్పు కమ్ముకొస్తుందని ముందుగానే పసిగట్టిన కేంద్ర కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు, అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి తాజా పరిస్థితిని అంచనా వేసి నివేదిక ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని కాఫీ బెర్రీ బోరర్‌ను సమర్థవంతంగా నియంత్రించాలని, గిరిజన కాఫీ తోటలను సంరక్షించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు గిరిజన ప్రాంతానికి తరలి వచ్చారు. అరకులోయ, చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో 156 ఎకరాల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. 1,700 ఎకరాల్లో పాక్షికంగా కీటకం వ్యాప్తిచెందినట్టు నిర్ధారించి ఉద్యానశాఖ, కేంద్ర కాఫీ బోర్డు పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన నియంత్రణ చర్యలు ప్రారంభించి ప్రాథమిక దశలోనే వ్యాప్తిని అడ్డుకోగలిగారు.