కాఫీ గింజలకు అంతర్జాతీయ ధరలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:04 PM
కాఫీ గింజలకు జీసీసీ అంతర్జాతీయ ధరలు అందిస్తుందని గిరిజన సహకార సంస్థ స్థానిక డివిజనల్ మేనేజర్(డీఎం) డి. సింహాచలం అన్నారు.
కిలో పార్చిమెంట్ రూ.450,
చెర్రీ రూ.250, రొబస్ట్రా రూ.170
సబ్ డివిజన్‌లో 490 మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యం
దళారులను ఆశ్రయించి నష్టపోరాదు
జీసీసీ డీఎం డి. సింహాచలం
చింతపల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాఫీ గింజలకు జీసీసీ అంతర్జాతీయ ధరలు అందిస్తుందని గిరిజన సహకార సంస్థ స్థానిక డివిజనల్ మేనేజర్(డీఎం) డి. సింహాచలం అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చింతపల్లి సబ్ డివిజన్‌లో ఈ ఏడాది 490 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. రైతులు దళారులను ఆశ్రయించి గరిష్ఠ ధరను నష్టపోరాదన్నారు. గత ఏడాది సబ్ డివిజన్‌లో 549 మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను మార్కెటింగ్ చేశామన్నారు. జీసీసీ గత ఏడాది పార్చిమెంట్ కిలో రూ.400, చెర్రీకి రూ.250 గరిష్ఠ ధరలు అందించిందన్నారు. ఈ ఏడాది కిలో పార్చిమెంట్ రూ.450, చెర్రీ రూ.270, రొబస్ట్రా రూ.170 ధరలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. మరో వారం రోజుల్లో కాఫీ పండ్ల సేకరణ ప్రారంభిస్తామన్నారు. కాయలు, పండ్లు కలిపి సేకరించరాదన్నారు. పండ్లు సేకరించిన ఆరు గంటల్లో పార్చిమెంట్ చేసుకోవాలన్నారు. కాఫీ గింజల ఉత్పత్తిలో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జీసీసీ ద్వారా మార్కెటింగ్ చేసుకునే కాఫీ పార్చిమెంట్‌లో తేమ శాతం 10, చెర్రీలో 10.5 ఉండాలన్నారు. గ్రామాల్లో కాఫీ మార్కెటింగ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది రైతులు పండించిన కాఫీ పండ్లకు మ్యాక్స్, పార్చిమెంట్, చెర్రీకి జీసీసీ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుందన్నారు.