Share News

అంతర్గత రహదారులు అధ్వానం

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:50 AM

జీవీఎంసీ పరిధిలో అంతర్గత రహదారులను అధికారులు పట్టించుకోవడం లేదు.

అంతర్గత రహదారులు అధ్వానం

యూజీడీ గోతులతో వాహన చోదకులకు నిత్యం నరకం

కేబుళ్ల కోసం రోడ్ల తవ్వకాలు...పైపైన పూడ్చివేతలు

పట్టించుకోని అధికారులు

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో అంతర్గత రహదారులను అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధాన మార్గాలు బాగుంటే చాలు అనుకుంటూ కాలనీ రహదారులను గాలికి వదిలేస్తున్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల కోసం రోడ్ల మధ్య తవ్వకాలు జరుపుతున్న కాంట్రాక్టర్లు నెలల తరబడి వాటిని పూర్తి చేయడం లేదు. తమ పని పూర్తయిన తరువాత ఆ గోతుల్లో రాళ్లు పోసి చేతులు దులుపుకుంటున్నారు. సీతమ్మధార, హెచ్‌బీ కాలనీ, టీపీటీ కాలనీల్లో రహదారులు కాంట్రాక్టర్ల దుర్మార్గానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇకపోతే కేబుళ్ల కోసం, పైపులైన్ల కోసం రోడ్డుకు ఒక పక్కగా గోతులు తవ్వుతున్నారు. వాటిపై మట్టి పోసి వెళ్లిపోతున్నారు. వర్షాలకు అది కుంగిపోతోంది. ఆ మార్గాల్లో తారురోడ్లకు నిధులు మంజూరు చేస్తే ఆ గోతులను సరిచేయకుండా వాటిపైనే నిర్మాణం చేపడుతున్నారు. దీంతో అవి వారం రోజులకే కిందికి దిగిపోతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే ఇంజనీరింగ్‌ అధికారులు కళ్లు మూసుకొని వాటికి బిల్లులు మంజూరు చేస్తున్నారు. బీచ్‌ రోడ్డులో సైతం పక్షపాతం చూపిస్తున్నారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి ఆర్‌కే బీచ్‌ వైపు రోడ్డును చక్కగా నిర్వహిస్తూ ఫిషింగ్‌ హార్బర్‌ వైపు మార్గం గోతులు పడినా పూడ్చడం లేదు. వీటిపై జోనల్‌ కమిషనర్ల పర్యవేక్షణ అసలు లేదు. పారిశుధ్యం కోసం వీధుల్లో తిరిగే అధికారులు చెత్తను చూస్తున్నారే తప్ప పాడైన రహదారులను పట్టించుకోవడం లేదు. రహదారులపై జీవీఎంసీ ఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అవన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది.

- భీమునిపట్నంలోని చిన్నబజారు నుంచి తాళ్లవలస వెళ్లే రహదారి గోతులతో అత్యంత దారుణంగా ఉంది. చిన్నబజారు నుంచి యాతకుమ్మరిపాలెం, యాతపేట మీదుగా తగరపువలస-ఆనందపురం జాతీయ రహదారి చేరుకోవడానికి ప్రజలు ఈ రోడ్డును వినియోగిస్తుంటారు. ఈ రోడ్డు 3 కిలోమీటర్లు జీవీఎంసీ పరిధిలోను, 1200 మీటర్లు భీమిలి మండల పరిషత్‌ పరిధిలోనూ ఉంది. ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టకపోవడంతో పూర్తిగా గోతులతో నిండిపోయింది. వర్షం పడితే వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.

- పద్మనాభం మండలంలో చిన్నాపురం జంక్షన్‌-పద్మనాభం-శొంఠ్యాం ఆర్‌అండ్‌బీ రహదారి గోతులమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ గోతులు మరింత ఛిద్రంగా మారాయి. గతుకుల రోడ్డులో ప్రయాణాల వల్ల తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. చిన్నాపురం జంక్షన్‌ నుంచి రెడ్డిపల్లి సినిమా హాలు వరకు, రెడ్డిపల్లి స్టేట్‌ బ్యాంకు వద్ద నుంచి శేరిఖండం వరకు, పద్మనాభం జంక్షన్‌ నుంచి బాకురుపాలెం వరకూ సుమారు పది కిలోమీటర్లు రోడ్డంతా గోతులతో అధ్వానంగా ఉంది.

Updated Date - Nov 22 , 2025 | 12:50 AM