Share News

స్ట్రాబెర్రీ సాగుపై ఆసక్తి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:36 AM

గిరిజన గ్రామాల్లో విదేశీ ఉద్యాన పంటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటలైన స్ట్రాబెర్రీ, డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో దిగుబడులు, ఆదాయం ఆశాజనకంగా ఉండడంతో ఈ పంటలను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

స్ట్రాబెర్రీ సాగుపై ఆసక్తి
లంబసింగి సమీపం కిటుములలో గిరిజన రైతులు సాగుచేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌

డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడోపై కూడా..

అధిక దిగుబడులు, ఆశాజనకంగా ఆదాయం వస్తుండడంతో మొగ్గు చూపుతున్న రైతులు

ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం

చింతపల్లి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో విదేశీ ఉద్యాన పంటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటలైన స్ట్రాబెర్రీ, డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో దిగుబడులు, ఆదాయం ఆశాజనకంగా ఉండడంతో ఈ పంటలను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వీటి సాగును ప్రోత్సహిస్తోంది. దీంతో గిరిజన ప్రాంతాల్లో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది.

అరకులోయ, లంబసింగి పరిసర ప్రాంతాల్లో 50 ఎకరాల్లో స్ట్రాబెర్రీ, ఎనిమిది ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగు చేస్తూ రైతులు ఆదాయాన్ని పొందుతున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా గిరిజన రైతులకు అవకాడో, డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడంతో రైతులు నాట్లు వేసుకున్నారు. ఈ పంటల నుంచి దిగుబడులు మరో రెండేళ్లు వస్తాయి.

స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలం

అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో గిరిజన రైతులు స్ట్రాబెర్రీని సాగు చేస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు స్ట్రాబెర్రీ సాగుకు గిరిజన ప్రాంతం అత్యంత అనుకూలమని నిర్ధారించారు. శాస్త్రవేత్తల సహకారంతో 2008లో చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు బౌడు కుశలవుడు తొలిసారిగా స్ట్రాబెర్రీని సాగు చేపట్టాడు. తొలి ఏడాది నష్టపోయినప్పటికీ మరుసటి ఏడాది నుంచి లాభాలు సాధించాడు. కుశలవుడును స్ఫూర్తిగా తీసుకొని కొంత మంది మైదాన ప్రాంత రైతులు గిరిజన ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకొని సాగు చేపట్టారు. దిగుబడులు ఆశించిన దానికంటే అధికంగా వస్తుండడంతో గత ఎనిమిదేళ్లుగా లంబసింగి, అరకులోయ ప్రాంతాల్లో గిరిజన రైతులు స్ట్రాబెర్రీ సాగు చేపడుతున్నారు. దిగుబడులు నవంబరు నుంచి జనవరి వరకు వస్తున్నాయి. అధిక శాతం స్ట్రాబెర్రీలను పర్యాటకులు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ పరిమాణంలో స్ట్రాబెర్రీలను మైదాన ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ప్రాంతీయ మార్కెట్‌లో 200 గ్రాముల స్ట్రాబెర్రీలు రూ.60 నుంచి రూ.80లకు విక్రయిస్తున్నారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ ఆదాయం భేష్‌

లంబసింగి, అనంతగిరి ప్రాంతాల్లో గిరిజన రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. 2014లో తెనాలికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయ శ్రీరామ్‌ లంబసింగి పంచాయతీ జల్లూరిమెట్టలో నాలుగు ఎకరాలు లీజుకు తీసుకొని ఎకరం విస్తీర్ణంలో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. దీనిపై చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు అనుకూలమని నిర్ధారించారు. ప్రస్తుతం పెదవలస, లంబసింగి, గొందిపాకలు, కిటుముల పంచాయతీ పరిధిలో గిరిజన రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. తొలి రోజుల్లో డ్రాగన్‌ఫ్రూట్‌ ఒకటి (600-800గ్రాములు) 100 నుంచి 150 రూపాయలకు విక్రయించేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక డ్రాగన్‌ ఫ్రూట్‌ను రూ. 30 నుంచి రూ.40లకు విక్రయిస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి ప్రోత్సాహం లభించడంతో రైతులు సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

ప్రతి మండలంలో ఆవకాడో సాగు

పాడేరు డివిజన్‌లోని ప్రతి మండలంలో రైతులు రెండేళ్లుగా ఆవకాడో సాగును ప్రారంభించారు. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీలో 2004లో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ పంటకు నీడ కోసమని ఆవకాడో మొక్కలను కొంతమంది రైతులకు పంపిణీ చేశారు. ఒక్కొక్క రైతు ఐదు నుంచి పది మొక్కలు కాఫీ తోటల్లో నాటుకున్నారు. ఈ మొక్కలు గత ఆరేళ్లుగా దిగుబడులనిస్తున్నాయి. తొలి రోజుల్లో ఆవకాడో పండ్ల విలువ తెలియక ఆదివాసీలు మార్కెట్‌ చేసుకునేవారుకాదు. ప్రస్తుతం మైదాన ప్రాంత వర్తకులు గ్రామానికి వచ్చి ఆవకాడో పండ్లను కొనుగోలు చేస్తున్నారు. రైతులు కిలో పండ్లను రూ.120 ధరకు విక్రయిస్తున్నారు. ఆవకాడో సాగులో రైతులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా ప్రభుత్వం సాగును ప్రోత్సహిస్తున్నది. ప్రస్తుతం నాటిన మొక్కల నుంచి మరో మూడేళ్లలో దిగుబడులు రానున్నాయి.

Updated Date - Oct 09 , 2025 | 09:16 PM