Share News

డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో సాగుపై ఆసక్తి

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:52 AM

గిరిజన ప్రాంతంలో అరుదైన ఉద్యాన పంటలు డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో సాగుపై ఆదివాసీ రైతులు ఆసక్తి చూపుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు మూడేళ్ల సాగు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంతంలో డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. చింతపల్లి పరిధిలో ఈ ఏడాది 46 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌, 89 ఎకరాల్లో ఆవకాడో సాగుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో సాగుపై ఆసక్తి
సిరిబాలతో గిరిజన రైతు సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు

- గిరిజన ప్రాంతంలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం

- ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా ఉచితంగా మొక్కల పంపిణీ

- సాగుపై గిరిజన రైతులకు ప్రత్యేక శిక్షణ

చింతపల్లి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో అరుదైన ఉద్యాన పంటలు డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో సాగుపై ఆదివాసీ రైతులు ఆసక్తి చూపుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు మూడేళ్ల సాగు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంతంలో డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. చింతపల్లి పరిధిలో ఈ ఏడాది 46 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌, 89 ఎకరాల్లో ఆవకాడో సాగుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

జిల్లాలోని గిరిజన ప్రాంతం ఉత్తర భారతదేశ వాతావరణాన్ని పోలి ఉంటుంది. దీంతో అరుదైన ఉద్యాన పంటలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఆవకాడో, డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుపై పరిశోధనలు నిర్వహించి గిరిజన ప్రాంతానికి అనువైనవిగా గుర్తించారు. 2004లో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు ఆవకాడోను పరిచయం చేశారు. కాఫీ పంటకు నీడ కోసమని గొందిపాకలు గ్రామంలో కొంత మంది రైతులకు ఆవకాడో మొక్కలను పంపిణీ చేశారు. ఈ మొక్కలు మంచి దిగుబడి ఇస్తున్నాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ను 2008లో లంబసింగిలో తెనాలికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయశ్రీరామ్‌ సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించారు. నాటి నుంచి కొంత మంది రైతులు వ్యక్తిగత ఆసక్తితో డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడోను సాగు చేస్తున్నారు.

ఐదేళ్ల నిరీక్షణకు ఫలితం

గిరిజన ప్రాంత రైతుల ఐదేళ్ల నిరీక్షణకు ఫలితం లభించింది. తాజంగి, లంబసింగి, గొందిపాకలు, పెదబరడ పంచాయతీల్లో రైతులు అనాస, నారింజ, కమల, మామిడి, పనస, ఇతర ఉద్యాన పంటలను అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. 2018 డిసెంబరులో ఉపాధి హామీ పథకం ద్వారా డ్రాగన్‌ ఫ్రూట్‌, స్ట్రాబెర్రీ మొక్కలు పంపిణీ చేసేందుకు నాటి గిరిజన సంక్షేమశాఖా మంత్రి నక్కా ఆనందబాబు ఆదేశాలతో ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు మరుగున పడిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2024 నుంచి గిరిజన ప్రాంత రైతులకు అధిక విస్తీర్ణంలో డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో సాగు చేసుకునేందుకు మొక్కల పంపిణీ ప్రారంభించింది.

అరెకరం, ఎకరం విస్తీర్ణంలో సాగు

డ్రాగన్‌ ఫ్రూట్‌ అరెకరం, ఆవకాడో ఎకరం విస్తీర్ణంలో రైతులు సాగు చేసుకునేందుకు ఉపాధి హామీ పథకం అధికారులు ఏర్పాట్లు చేశారు. 2024లో చింతపల్లి మండలంలో 14 ఎకరాల్లో 28 మంది రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌, 28 ఎకరాల్లో 28 మంది రైతులు ఆవకాడో, జీకేవీధి మండలంలో ఏడుగురు రైతులతో 3.5 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ నాట్లు వేయించారు. ఈ ఏడాది చింతపల్లి మండలంలో 12 ఎకరాల్లో 24 మంది రైతులు, ఆవకాడో 64 మంది రైతులతో 64 ఎకరాలు, జీకేవీధి మండలంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ 70 మంది రైతులు 34 ఎకరాలు, ఆవకాడో 25 మంది రైతులు 25 ఎకరాల్లో సాగు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు కోసం అరెకరంలో 225 స్తంభాలు ఏర్పాటు చేసుకోవాల్సి వుంది. స్తంభం చుట్టూ నాలుగు మొక్కలను నాటుకోవాలి. స్తంభాల కోసం రూ.1.25 లక్షలను రైతులకు అందజేశారు. అలాగే ఆవకాడో, డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలకు గోతులు తీయడం, మొక్కలు నాటడం, చుట్టూ గూడు నిర్మించడం, ఇతర యాజమాన్య పనులకు నిర్దేశించిన నగదు ప్రోత్సాహకాలను ఉపాధి హామీ పథకం ద్వారా అందజేయనున్నారు.

సాగుపై ప్రత్యేక శిక్షణ

గిరిజన రైతులకు డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో సాగు కొత్త కావడంతో స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలతో శిక్షణ ఇప్పించేందుకు ఉపాధి హామీ పథకం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్ల పాటు ఉద్యానశాఖ, శాస్త్రవేత్తలు రైతులకు డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో సాగులో పాటించాల్సిన మెలకువలు తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా స్థానికంగాఉన్న వ్యవసాయ, ఉద్యాన సహాయకులు ఎప్పటికప్పుడు ఆవకాడో, డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలను పరిశీలిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తారు. అలాగే ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పంట పొలాలను సందర్శించి రైతులకు సాంకేతిక సహకారం అందించేలా ఏర్పాట్లు చేశారు.

Updated Date - Sep 03 , 2025 | 12:52 AM