Share News

ముమ్మరంగా రాగుల కోతలు

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:45 AM

మన్యంలో ప్రస్తుతం రాగులు(చోడి) పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది వరి పంటకు ముందుగానే గిరిజనులు రాగులను కోస్తారు. దీంతో ప్రస్తుతం ఏజెన్సీలో ఎటు చూసినా రాగుల కోతలు చేపడుతున్న గిరి మహిళలే కనిపిస్తున్నారు.

ముమ్మరంగా రాగుల కోతలు
పాడేరు మండలం గుజ్జలి ప్రాంతంలో రాగులు పంట కోస్తున్న గిరి మహిళలు

గిరిజనుల ప్రధాన ఆహార పంటగా రాగులు

జిల్లాలో 37,555 ఎకరాల్లో, పాడేరు డివిజన్‌లో 26 వేల ఎకరాల విస్తీర్ణం

మెట్ట, కొండ ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతిలో సాగు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

మన్యంలో ప్రస్తుతం రాగులు(చోడి) పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది వరి పంటకు ముందుగానే గిరిజనులు రాగులను కోస్తారు. దీంతో ప్రస్తుతం ఏజెన్సీలో ఎటు చూసినా రాగుల కోతలు చేపడుతున్న గిరి మహిళలే కనిపిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 37,555 ఎకరాల్లో రాగులు పండిస్తే, అందులో పాడేరు డివిజన్‌ పరిధిలోని పంట విస్తీర్ణం 26 వేల ఎకరాలు ఉండడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో చోడిని ప్రధాన ఆహార పంటగా గిరిజనులు సాగు చేస్తుంటారు. సాగునీటి సదుపాయం ఉన్న పల్లపు ప్రాంతాల్లో వరిని పండిస్తే, కాస్త మెట్ట, కొండ ప్రాంతాల్లో చోడిని వేస్తుంటారు. అలాగే కొండవాలు ప్రాంతాల్లో నీటి తడి ఎక్కువగా అవసరం లేని ప్రాంతాల్లో సైతం చోడి పండుతుంది. దీంతో గిరిజనులు తమ గ్రామాలకు చేరువగా ఉన్న కొండ ప్రాంతాల్లో చోడి సాగు చేస్తుంటారు. చోడిని పండించి, వాటిని పిండిగా చేసుకుని ఏడాదంతా గిరిజనులు నిల్వ చేస్తారు. ఇళ్లల్లో నిల్వ చేసిన చోడి పిండితో జావ(అంబలి)చేసుకుని ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటారు. తక్కువ ఖర్చుతో చక్కని ఆహారం సమకూరడంతో పాటు చోడిలో పిండి పదార్థాలు, ఇనుము, తదితర పోషక విలువలు ఉండడంతో గిరిజనులకు ఆరోగ్యపరంగా అది ఉపయోగపడుతుంది.

చిరు ధాన్యాలకు కానరాని సర్కారు సాయం

ఏజెన్సీలో రాగులు(చోడి) సాగు చేసే గిరిజన రైతులకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఎటువంటి సాయం చేయకపోయినా గిరిజనులు మాత్రం తాము పండించిన పంట నుంచే విత్తనాలు సమకూర్చుకుని, చోడి సాగును ప్రతి ఏడాది చేపడుతున్నారు. చిరు ధాన్యాల జాబితాలో ఉన్న చోడి పంటకు ప్రభుత్వ పరంగా సాయం అందించడంతో పాటు ఆ పంట అంతరించిపోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని గిరిజన రైతులు కోరుతున్నారు. లేకుంటే ఇప్పటికే ప్రతి ఏడాది తగ్గుతున్న సాగు విస్తీర్ణం భవిష్యత్తులో ఈ పంట కనుమరుగయ్యే ప్రమాదముందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎటువ ంటి ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించకుండా సంప్రదాయబద్ధంగా, సేంద్రీయ విధానంలో సాగు చేసే రాగుల పంటను ఏజెన్సీలో మరింతగా అభివృద్ధి చేసేందుకు పాలకులు అవసరమైన చర్యలు చేపట్టాలని గిరి రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 12:45 AM