Share News

పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్‌ కార్డు

ABN , Publish Date - Nov 30 , 2025 | 01:41 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఒక ఇంటిగ్రేటెడ్‌ కార్డు తీసుకురావాలని నిర్ణయించారు.

పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్‌ కార్డు

వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో నిర్ణయం

కైలాసగిరిపై నిర్మించే త్రిశూల్‌, ఢమరుకం ప్రాజెక్టుకు అదనపు నిధులు

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఒక ఇంటిగ్రేటెడ్‌ కార్డు తీసుకురావాలని నిర్ణయించారు. వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం బోర్డు సమావేశం జరిగింది. చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌, విజయవాడ నుంచి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌లు వర్చువల్‌గా పాల్గొన్నారు. అజెండా అంశాలను కమిషనర్‌ తేజ్‌ భరత్‌ ఒక్కొక్కటి వివరించగా దానిపై ముఖ్య కార్యదర్శి పలు సూచనలు చేశారు. కైలాసగిరిపై నిర్మించే త్రిశూల్‌, ఢమరుకం ప్రాజెక్టుకు అవసరమైన అదనపు నిధుల మంజూరుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇంజనీరింగ్‌, ప్లానింగ్‌ విభాగాలకు అవసరమైన సిబ్బందిని గ్రామ, వార్డు సచివాలయాల నుంచి సమకూర్చుకోవడానికి కూడా అనుమతించారు. ఇంకా పలు అంశాలపై చర్చించారు.


రుషికొండలో వాటర్‌ స్పోర్ట్స్‌

సురక్షితమైన స్విమ్మింగ్‌ జోన్‌తో పాటు స్కూబా డైవింగ్‌

శాప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు

వీఎంఆర్‌డీఏ టెండర్లకు కానరాని స్పందన

అందుకే స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అప్పగింత

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

రుషికొండ బీచ్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి (వీఎంఆర్‌డీఏ) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీచ్‌లో వీఎంఆర్‌డీఏకు కొంత స్థలం ఉంది. అందులో పర్యాటకులను ఆకర్షించేలా వాటర్‌ స్పోర్ట్స్‌ ఏర్పాటుచేయాలని అధికారులు భావించారు. సురక్షితమైన స్విమ్మింగ్‌ జోన్‌తో పాటు స్కూబా డైవింగ్‌ వంటివి పెట్టాలని అనుకున్నారు. దీనికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈఓఐ) జారీచేశారు. ఆగస్టులో ఒకసారి, అక్టోబరులో మరోసారి, అంతకుముందు ఇంకోసారి మొత్తం మూడు దఫాలుగా టెండర్లను ఆహ్వానించారు. తాము కేటాయించే భూమిలో సుమారు రూ.2.2 కోట్ల వ్యయంతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. అయితే వీటికి పెద్దగా స్పందన రాలేదు.

రుషికొండను బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా గుర్తించారు. పర్యాటకులకు అన్నిరకాల వసతులు కల్పించేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలోని బృందం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అక్కడ వాటర్‌ స్పోర్ట్స్‌ అభివృద్ధిలో భాగంగా పలు ప్రైవేటు సంస్థలకు పర్యాటక శాఖ అనుమతులు ఇచ్చింది. జెట్‌ స్కైయింగ్‌, విండ్‌ సర్ఫింగ్‌, బనానా బోటు డ్రైవింగ్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా మరిన్ని వాటర్‌ స్పోర్ట్స్‌ తేవాలని వీఎంఆర్‌డీఏ భావించింది. వాటిలో ముఖ్యంగా స్కూబా డైవింగ్‌, దానికి సర్టిఫికెట్‌ కోర్సు వంటివి పెట్టాలనుకుంది. కానీ స్పందన లేకపోవడంతో వెనకడుగు వేసింది.

శాప్‌కు అప్పగింత

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహణ వ్యవహారాలు చూస్తోంది. వీరికి అందులో అనుభవం ఉంది. రుషికొండలో ఎలా చేయవచ్చు?...అనే దానిపై అధ్యయనం చేశారు. ఇప్పుడు వీఎంఆర్‌డీఏ తమ స్థలాన్ని శాప్‌కే అప్పగించి వాటర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.


విశాఖలో మహిళల టీ20 మ్యాచ్‌లు

డిసెంబరు 21, 23 తేదీల్లో శ్రీలంక జట్టుతో ఢీ

విశాఖపట్నం, స్పోర్ట్స్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం మరోసారి అంతర్జాతీయ మహిళల వన్డే మ్యాచ్‌లకు వేదిక కానున్నది. భారత్‌లో పర్యటించనున్న శ్రీలంక జట్టు సిరీస్‌లో భాగంగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. డిసెంబరు 21, 23 తేదీల్లో జరగనున్న తొలి రెండు మ్యాచ్‌లో పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో, మిగిలిన మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరగనున్నాయి. ఇటీవల జరిగిన మహిళల వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఐదు మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. కాగా డిసెంబరు 6న భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న పురుషుల వన్డే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అయిపోయాయి. డిసెంబరు 21, 23 తేదీల్లో జరగనున్న మహిళల టీ20 మ్యాచ్‌లకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి.


పూర్తికాని స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీ

డీలర్ల వద్దే 49 వేల కార్డులు

వచ్చే నెల సరకుల పంపిణీతో పాటు

కార్డులు అందజేసేందుకు అధికారుల చర్యలు

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీ ప్రారంభించి మూడు నెలలైంది. అయితే ఇప్పటికీ జిల్లాలో 49,064 మంది కార్డులు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ కార్డులు ఆయా రేషన్‌ డిపోల్లోనే ఉన్నాయి. వచ్చే నెల (డిసెంబరు ఒకటో తేదీ నుంచి) బియ్యం కోసం డిపోలకు వచ్చినప్పుడు కార్డులు పంపిణీ చేసేందుకు డీలర్లు చొరవ తీసుకోవాలని అధికారులు సూచించారు.

స్మార్ట్‌ కార్డుల పంపిణీ ప్రారంభ సమయంలోనే నగరంలో కొంత గందరగోళం ఏర్పడింది. కార్డులను సచివాలయాలకు పంపడంతో అక్కడ సగం పంపిణీ చేశారు. ఆ తరువాత అక్కడ నుంచి డిపోలకు పంపడంతో అక్కడ కొన్ని అందజేశారు. అయితే బియ్యం తీసుకునేందుకు పోర్టబిలిటీ విధానం (కార్డు ఎక్కడ ఉన్నా సమీపంలో గల డిపోలో సరుకులు తీసుకోవచ్చు) అమలులో ఉండడంతో చాలామంది తమ కార్డు మ్యాప్‌ అయిన సచివాలయం/డిపో వైపు వెళ్లడం లేదు. ఇంకా నగరం నుంచి కొందరు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. అందులో కొందరు ఇంకా నగరానికి రాలేదు. అలాగే సచివాలయాలు, రేషన్‌ డిపోల మధ్య సమన్వయం లేకపోవడంతో కొన్ని కార్డులు పంపిణీ కాలేదు.

జిల్లాలో 5,17,155 రైస్‌ కార్డులు ఉండగా, ఇంతవరకూ 4,68,091 (91 శాతం) పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో పద్మనాభం మండలంలో 97 శాతం, పెందుర్తిలో 95 శాతం, ఆనందపురంలో 94 శాతం, భీమిలిలో 91 శాతం పంపిణీ చేశారు. నగరానికి వచ్చేసరికి సర్కిల్‌-3లో 92 శాతం, సర్కిల్‌-1లో 89 శాతం, సర్కిల్‌-2లో 88 శాతం పంపిణీ చేశారు. నగరంలో కొందరు కేవలం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ కార్డు కోసం బియ్యం కార్డు తీసుకుంటున్నారు. వారంతా సరుకులు తీసుకోవడం లేదు. ఇలాంటివారు సుమారు 30 వేలమంది వరకూ ఉంటారంటున్నారు. తమ కార్డు ఎక్కడుందో తెలియకపోవడంతో మరికొందరు తీసుకోలేకపోతున్నారు. అయితే కొత్తగా ముద్రించిన రైస్‌ కార్డు ప్రతి ఒక్కరికీ అందజేయాలని ప్రభుత్వం చెబుతోంది. దీనికి అనుగుణంగా జిల్లాలో కార్డుల పంపిణీపై జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ప్రతివారం సమీక్షిస్తున్నారు. డిపోల్లో ఉండిపోయిన 49 వేల కార్డులను వచ్చే నెల మొదటివారంలోనైనా పంపిణీ చేయాలని డీలర్లకు జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కర్‌ సూచించారు. అలాగే కార్డుదారులు కూడా తమ డిపోకు వెళ్లి కార్డు తీసుకోవాలని కోరారు.

Updated Date - Nov 30 , 2025 | 01:41 AM