యూరియా వాడే పరిశ్రమల్లో తనిఖీలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:23 PM
జిల్లాలో టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడుతున్న పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలు
అనకాపల్లి కలెక్టరేట్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడుతున్న పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సబ్సిడీ యూరియాను పరిశ్రమలకు మళ్లించడంపై మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, పరిశ్రమల, మత్స్య, కార్మిక శాఖలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వ్యవసాయ అవసరాల కోసం రాయితీపై సరఫరా చేసే యూరియాను ఈ పరిశ్రమలకు తరలించే అవకాశం వుందని అన్నారు. కార్మిక, వ్యవసాయ, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బృందాలుగా ఏర్పడి ఆయా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. సబ్సిడీ యూరియాను వినియోగిస్తుంటే వెంటనే ఎరువుల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. అనకాపల్లి జిల్లా నుంచి ఇతర జిల్లాలు; రాష్ట్రాలకు సబ్సిడీ యూరియా తరలించకుండా రవాణా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్ శాఖలు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. ఎరువుల దుకాణాల్లో 47 కిలోల యూరియా బస్తాను రూ.267కు మించి అమ్మకుండా దృష్టి సారించాలన్నారు.