Share News

వాటర్‌షెడ్‌ పనుల పరిశీలన

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:20 AM

వాటర్‌షెడ్‌ పథకం ముఖ్యోద్దేశానికి తగినట్టుగా రైతులను చైతన్యపరిచి సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.

   వాటర్‌షెడ్‌ పనుల పరిశీలన
మంప పంచాయతీలోని నగరం వాటర్‌షెడ్‌ పథకం కింద నిర్మించిన చెరువును పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో శ్రీపూజ

మంప పంచాయతీలో పర్యటించిన ఐటీడీఏ పీవో శ్రీపూజ

తవ్విన చెరువుల విస్తీర్ణం, ఏ మేరకు సాగునీరందుతుందని ఆరా

కొయ్యూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) వాటర్‌షెడ్‌ పథకం ముఖ్యోద్దేశానికి తగినట్టుగా రైతులను చైతన్యపరిచి సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. మండలంలోని పలు పంచాయతీల్లో వాటర్‌షెడ్‌ పథకం కింద రూ.3.76 కోట్లతో చేపట్టిన 158 పనులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా సోమవారం ఆమె మంప పంచాయతీలో పర్యటించారు. మధ్యాహ్నం ఆ పంచాయతీ పరిధిలోని కించెవానిపాలెం, మంప, గంగవరం, నగరంలో చేపట్టిన పలు చెరువులు, నీటికుంటల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తవ్విన చెరువుల విస్తీర్ణం, వాటి ద్వారా ఎంత మంది రైతులకు ఎంత మేర భూములకు సాగునీరందుతుంది?, సీజన్‌ అనంతరం ఈ చెరువుల ద్వారా రైతాంగానికి అదనంగా ఆదాయం రావడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలపై ఆరా తీశారు. అలాగే చెరువు గట్లు పటిష్ఠంగా ఉండేందుకు వీలుగా ఏ మేరకు పండ్ల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు?, తదితర విషయాలపై రికార్డుల పరంగా పరిశీలించారు. అనంతరం మంపలోని అల్లూరి స్మారక మందిరాలను సందర్శించి దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అదనంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సమీపంలో అల్లూరి సీతారామరాజు ధ్యానానికి వినియోగించిన ఉర్లకొండ గుహలను పర్యాటకుల సందర్శనకు వీలుగా ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చో ఎంపీపీ బడుగు రమేశ్‌బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శివరామరాజును అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ అభ్యర్థన మేరకు సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో గల కించెవానిపాలెం రిజర్వాయర్‌ను సందర్శించి, పర్యాటకంగా ఈ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ వాటర్‌షెడ్‌ ద్వారా నిర్వహించిన పనులను పరిశీలించిన అనంతరం బకాయిలు చెల్లించాలనే ఉద్దేశంతోనే చెల్లింపులను నిలిపినట్టు తెలిపారు. గోకులాలు నిర్మించిన రైతులకు ఆవు లేదా గేదె ఒక్కింటికి రూ.50 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, లబ్ధిదారులు దీనిని వినియోగించుకోవాలన్నారు. గంగవరం గ్రామంలోని బాలానగర్‌లో మరో మంచినీటి బోరు వేయాలని ఎంపీపీ కోరడంతో చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. అలాగే గంగవరం- కొయ్యూరు మధ్య పొలాలకు వెళ్లే రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఆమె వెంట వాటర్‌షెడ్‌ పీవో శంకరరావు, మంప వీఆర్‌వో సత్యనారాయణ, ఎంపీపీ రమేశ్‌బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శివరామరాజు, తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:20 AM