విద్యాసంస్థల బస్సుల తనిఖీ
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:47 AM
పట్టణంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా జిల్లాలోని విద్యా సంస్థలకు చెందిన బస్సులపై సమగ్ర తనిఖీలు చేపట్టామని జిల్లా రవాణాశాఖ అధికారి జి. మనోహర్ తెలిపారు. పాఠశాలల బస్సులు అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, ఎంవీ చట్టం, బస్సు బాడీకోడ్‌ల ప్రకారం పాటించబడుతున్నాయా అనే అంశాలను ఎంవీ ఇన్‌స్పెక్టర్ల ప్రత్యేక బృందాలు పరిశీలించినట్టు చెప్పారు. జిల్లాలో ఉన్న పాఠశాలల బస్సులన్నింటిని మూడు బృందాలు సూక్ష్మంగా పరిశీలించినట్టు ఆయన తెలిపారు.
లోపాలున్న నాలుగు బస్సులు సీజ్
మరో 95 బస్సులకు నోటీసులు
జిల్లా వ్యాప్తంగా మూడు బృందాలు తనిఖీలు
జిల్లా రవాణాశాఖ అధికారి జి. మనోహర్
అనకాపల్లి టౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) :
పట్టణంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా జిల్లాలోని విద్యా సంస్థలకు చెందిన బస్సులపై సమగ్ర తనిఖీలు చేపట్టామని జిల్లా రవాణాశాఖ అధికారి జి. మనోహర్ తెలిపారు. పాఠశాలల బస్సులు అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, ఎంవీ చట్టం, బస్సు బాడీకోడ్‌ల ప్రకారం పాటించబడుతున్నాయా అనే అంశాలను ఎంవీ ఇన్‌స్పెక్టర్ల ప్రత్యేక బృందాలు పరిశీలించినట్టు చెప్పారు. జిల్లాలో ఉన్న పాఠశాలల బస్సులన్నింటిని మూడు బృందాలు సూక్ష్మంగా పరిశీలించినట్టు ఆయన తెలిపారు. పరిశీలనలో ఫైర్ అలారం, డిటెక్షన్ సిస్టం, అత్యవసర ద్వారాలు, స్పీడ్ గవర్నర్లు, ఫైర్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అంశాలు ప్రధానంగా తనిఖీ చేశామన్నారు. మొత్తం 106 పాఠశాలల బస్సులను తనిఖీ చేయగా.. భద్రతాపరమైన లోపాలున్న 95 బస్సులకు నోటీసులు జారీ చేసి, పన్ను, ఫిట్‌నెస్ లోపాలున్న నాలుగు బస్సులను సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా 24 పాఠశాలలను తనిఖీ బృందాలు ప్రత్యక్షంగా సందర్శించి సిబ్బందికి భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించినట్టు చెప్పారు. బస్సుల భద్రతలో పాఠశాలల నిర్వాహకులు కూడా సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. యాజమాన్యాలు నిత్యం బస్సుల పరిస్థితులపై సమీక్షించాలని సూచించారు. అలాగే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి సక్రమంగా ఉందో.. లేదో.. పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా పాఠశాలల నిర్వాహకులదేనన్నారు. విద్యార్థుల ప్రాణ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎటువంటి నిర్లక్ష్యం సహించమన్నారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌టీవో మనోహర్ హెచ్చరించారు.