ఉక్కుకు తొలగని చిక్కులు
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:20 AM
స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏడాది నుంచి ఇన్‌చార్జి సీఎండీతోనే కాలక్షేపం
ఇష్టారాజ్యంగా నిర్ణయాలు...
స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు బేఖాతరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యానికి విజ్ఞప్తి
పర్సనల్, ఆపరేషన్స్, ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టులు ఖాళీ
పూర్తిస్థాయి సీఎండీని నియమించడంతోపాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్న ప్రజా ప్రతినిధులు
విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్లాంటుకు సుమారు రూ.12 వేల కోట్ల సాయం చేసిన కేంద్రం పూర్తిస్థాయి సీఎండీని నియమించకుండా ఇన్‌చార్జి సీఎండీతో ఏడాది నుంచి ప్లాంటును నడుపుతోంది. పర్సనల్, ఆపరేషన్లు, కమర్షియల్, ప్రాజెక్టులు, ఫైనాన్స్ విభాగాలకు ఐదుగురు డైరెక్టర్లు ఉండాలి. కానీ ఇక్కడ ఇద్దరే ఉన్నారు. పర్సనల్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఆపరేషన్ల డైరెక్టర్ లేరు. ఆర్థిక ఇబ్బందులో ఉన్న సంస్థను గాడిలో పెట్టాల్సిన ఫైనాన్స్ డైరెక్టర్ కూడా లేరు. కమర్షియల్ డైరెక్టర్‌కే ప్రాజెక్ట్సు విభాగం అదనంగా ఇప్పించారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనా కొనసాగిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్‌ప్లాంటును గాడిలో పెట్టాలని, లాభాల బాటలోకి తీసుకురావాలని భారీసాయం చేశాయి. కానీ ఆ నిధులు సక్రమంగా సద్వినియోగం కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అవసరానికి మించి భారీగా రా మెటీరియల్ ఆర్డర్ పెడుతున్నారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో నాణ్యత లేని కోక్ వినియోగించడం వల్ల వైజాగ్ స్టీల్ ఉత్పత్తుల్లో ప్రమాణాలు తగ్గిపోయి, కంపెనీలకు వెళ్లిన సరకు వెనక్కి తిరిగి వస్తోంది. స్టీల్ ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించాల్సిన క్వాలిటీ కంట్రోల్ హెడ్ పోస్టు కూడా చాలాకాలంగా ఖాళీగా ఉంది. దానిని కూడా భర్తీ చేయడం లేదు. ముఖ్యమైన, కీలకమైన అధికారులను నియమించడంలో తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్లాంటుకు నష్టం జరుగుతోంది. తాము చెప్పిన మాట వినడం లేదని అత్యంత ముఖ్యమైన అధికారులను సైతం యాజమాన్యం సస్పెండ్ చేసి పక్కన పెడుతోంది. అర్హత, అనుభవం లేని వారికి బ్లాస్ట్ ఫర్నేస్ వంటి కీలక విభాగాలు అప్పగిస్తోంది.
కల్పించుకోవాలని కోరుతున్న ఎమ్మెల్యే
ప్లాంటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీలోనే కోరారు. డబ్బులు అయితే ఇప్పించగలం కానీ, రోజువారీ వ్యవహారాలు యాజమాన్యమే చూసుకోవాలని, ఉద్యోగులు దానికి సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మొదట్లో సూచించారు. కానీ ప్రస్తుత యాజమాన్యం...ప్రజా ప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా నచ్చినట్టు వ్యవహరిస్తుండడంతో ఇబ్బందులు అధికమయ్యాయి. ఎంపీ చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా కాంట్రాక్టు వర్కర్ల తొలగింపు ప్రక్రియ ఆగడం లేదు. నిర్వాసితులను సైతం పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ బుధవారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని ఢిల్లీలో కలిసి స్టీల్ ప్లాంటులో నిర్ణయాలు వేగవంతంగా తీసుకొని, అమలు చేయడానికి పూర్తిస్థాయి సీఎండీని నియమించాలని కోరడం గమనార్హం. ప్రస్తుతం ఇన్‌చార్జి సీఎండీగా ఉన్న సక్సేనా పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది. ఇక్కడే కొనసాగడానికి ఆయన యత్నిస్తున్నట్టు సమాచారం. అది సరైన నిర్ణయం కాబోదని, ఆయనను మార్చడంతో పాటు ఖాళీగా ఉన్న డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీచేయాలని ఇక్కడి బీజేపీ నాయకులు కూడా కేంద్రాన్ని కోరడం విశేషం.
కేంద్ర మంత్రి పర్యటన రద్దు
ఉత్తరాంధ్రలోని ఫెర్రో అల్లాయిస్ కంపెనీల ప్రతినిధులతో నోవాటెల్ హోటల్‌లో గురువారం ఒక సమావేశాన్ని ఎంఓఐఎల్ సీఎండీ హోదాలో సక్సేనా నిర్వహించాలని అనుకున్నారు. దీనికి కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమార స్వామిని ఆహ్వానించారు. అయితే ఏ కారణాలతోనే మంత్రి రాలేదు. దాంతో సమావేశం రద్దయినట్టు తెలిసింది. దీనిపై అధికారులు పెదవి విప్పడం లేదు.