Share News

బటర్‌ఫ్లై పార్కు స్థలం బదలాయింపుపై ఆరా

ABN , Publish Date - Jul 06 , 2025 | 01:11 AM

జీవీఎంసీ జోన్‌-2 పరిధి ఆరో వార్డులో బటర్‌ఫ్లై పార్కులోని 489 గజాల స్థలాన్ని, వెనుక ఉన్న ప్రైవేటు భూమి యజమానులకు బదలాయించిన అంశంపై రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ ఆరా తీసినట్టు తెలిసింది.

బటర్‌ఫ్లై పార్కు స్థలం బదలాయింపుపై ఆరా

అందుకు సంబంధించిన ఫైల్‌ పంపాల్సిందిగా జీవీఎంసీ అధికారులకు పురపాలక శాఖ కమిషనర్‌ ఆదేశం

విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ జోన్‌-2 పరిధి ఆరో వార్డులో బటర్‌ఫ్లై పార్కులోని 489 గజాల స్థలాన్ని, వెనుక ఉన్న ప్రైవేటు భూమి యజమానులకు బదలాయించిన అంశంపై రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ ఆరా తీసినట్టు తెలిసింది. మధురవాడలో 1.02 ఎకరాల్లో ఉన్న ఓపెన్‌స్పేస్‌ను జీవీఎంసీ రూ.1.92 కోట్లు వెచ్చించి బటర్‌ఫ్లై పార్కుగా అభివృద్ధి చేసింది. సీతాకోకచిలుక ఆకారంలో పార్కు స్థలం ఉండడంతో దానికి అదే పేరు (బటర్‌ ఫ్లై) ఖరారుచేసింది. పార్కు వెనుక రెండు ఎకరాలకుపైగా భూమి ప్రైవేటు వ్యక్తులకు ఉంది. ఆ భూమికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో పార్కు స్థలంలో 489 గజాల స్థలాన్ని తమకు ఇస్తే, అందుకు ప్రతిగా పార్కు వెనుక ఉన్న తమ భూమిలో అంతే స్థలాన్ని బదలాయిస్తామని కోరుతూ జీవీఎంసీకి వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన పంపారు. దీనికి అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని పెద్దల ద్వారా పావులు కదపడంతో జీవీఎంసీ కౌన్సిల్‌లో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. తర్వాత ఎన్నికలు రావడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో నగరానికి చెందిన కూటమిలోని కీలక నేత ద్వారా మంత్రాంగం నడిపించారు. జీవీఎంసీ కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఈ ఏడాది మే నెలలో గుట్టుగా మెమో జారీచేసింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 4న ’జీవీఎంసీ పార్కు పాయె’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జీవీఎంసీ అధికారులను సీడీఎంఏ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ ఆరా తీసి, దానికి సంబంధించిన ఫైల్‌ను పంపించాలని ఆదేశించినట్టు తెలిసింది.

Updated Date - Jul 06 , 2025 | 01:11 AM