Share News

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:41 AM

కేంద్ర గిరిజన వ్యవహారాల సెక్షన్‌ అధికారి ఆదిత్య గోషైన్‌ ఆదివారం పాడేరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయన స్వయంగా పరిశీలించారు. తొలుత మండలంలో మోదాపల్లి గ్రామ సమీపంలోని గిరిజనులు పండిస్తున్న కాఫీ తోటలను పరిశీలించారు.

 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా
పాడేరు మండలం మోదాపల్లి గ్రామ సమీపంలో కాఫీ తోటలను పరిశీలిస్తున్న కేంద్ర అధికారి ఆదిత్య గోషైన్‌

- మన్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల అధికారి పర్యటన

పాడేరు, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): కేంద్ర గిరిజన వ్యవహారాల సెక్షన్‌ అధికారి ఆదిత్య గోషైన్‌ ఆదివారం పాడేరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయన స్వయంగా పరిశీలించారు. తొలుత మండలంలో మోదాపల్లి గ్రామ సమీపంలోని గిరిజనులు పండిస్తున్న కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీ, మిరియాల సాగుతో ఏ మేరకు ఆదాయం లభిస్తుందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వనుగుపల్లి పంచాయతీ ముంతమామిడి గ్రామాన్ని సందర్శించి అక్కడ రూ.60 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన బహుళ ప్రయోజన సామాజిక భవనాన్ని ఆయన పరిశీలించి, దాని ఉపయోగాన్ని అడిగి తెలుసుకున్నారు. మోదాపల్లి, సప్పిపుట్టు గ్రామాల్లో గిరిజనులు నిర్మించుకున్న పీఎం జన్‌మన్‌ ఇళ్లను పరిశీలించి, బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి, లబ్ధిదారులకు సేవలు పక్కాగా అందించాలన్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు, వాటి ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఏఈఈ దుర్గాప్రసాద్‌, ట్రైకార్‌ అసిస్టెంట్‌ ఎన్‌.సీతారామయ్య, పీఎంయూ అధికారి రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:41 AM