సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలపై ఆరా
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:14 PM
పుట్టిన బిడ్డ నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు గల ప్రతి ఒక్కరికీ సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు.
40 ఏళ్లలోపు వారికి తప్పనిసరిగా పరీక్షలు చేయాలని డీఎంహెచ్‌వో ఆదేశం
64 పీహెచ్‌సీల పరిధిలో 1,582 మందికి వ్యాధిని నిర్ధారించి వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడి
పాడేరు రూరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పుట్టిన బిడ్డ నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు గల ప్రతి ఒక్కరికీ సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని 64 పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య పర్యవేక్షకులు, ఏఎన్‌ఎంలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలో సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స అందించాలన్నారు. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా ఆరు నెలల వయస్సులో ప్రారంభమవుతాయన్నారు. వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కాలక్రమేణా మారవచ్చని చెప్పారు. ఈ వ్యాధి కలిగిన వారికి ఎర్ర రక్త కణాలు భర్తీ చేసేందుకు 120 రోజులు పడుతుందన్నారు. కొడవలి కణాలు 10 నుంచి 20 రోజుల్లో చనిపోతాయన్నారు. 64 పీహెచ్‌సీల పరిధిలో ఇప్పటి వరకు 4,57,465 మందికి పరీక్షలు చేయగా, 13,903 మందిలో లక్షణాలను గుర్తించామని, 1,582 మందికి వ్యాధిని నిర్ధారించి వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతూ ఈ వ్యాధి సోకిన వారికి పాడేరు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ వ్యాధి పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.