వైద్యుడి వక్రబుద్ధిపై ఆరా
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:55 AM
మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులు, నర్సింగ్ సిబ్బందిని వేధిస్తున్న ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని ఓ అధికారి వ్యవహారశైలిపై ‘వైద్యుడి వక్రబుద్ధి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనం వైద్య వర్గాల్లో కలకలం రేపింది.
కలకలం రేపిన ఆంధ్రజ్యోతి కథనం
ఏం జరిగిందో ఆరా తీసిన ఆంధ్ర మెడికల్ కళాశాల అధికారులు
బయటకు వస్తున్న మరిన్ని అడ్డగోలు వ్యవహారాలు
పుట్టిన రోజు వేడుకలకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలని వైద్య విద్యార్థులకు ఆదేశం
విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):
మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులు, నర్సింగ్ సిబ్బందిని వేధిస్తున్న ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని ఓ అధికారి వ్యవహారశైలిపై ‘వైద్యుడి వక్రబుద్ధి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనం వైద్య వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పటికైనా ఆయన బండారం బయటపడిందంటూ చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేయగా, కొందరు మాత్రం...ఎవరా వైద్యుడు అంటూ ఆరా తీశారు. ఇకపోతే, ఆంధ్ర మెడికల్ కళాశాల అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు సదరు వైద్యుడికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సదరు వైద్యుడు పనిచేస్తున్న ఆస్పత్రికి కళాశాల అధికారులు ఫోన్లు చేసి వివరాలు సేకరించారు. అసలేమి జరుగుతోందని సీనియర్ వైద్యులతోపాటు వైద్య విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అయితే కొంతమంది వైద్యులు, వైద్య విద్యార్థినులు తమకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో ఏఏమీ తెలియదని తప్పుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇదిలావుంటే సదరు వైద్యుడి గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వచ్చే నెలలో తన పుట్టినరోజు ఉందని, ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని వైద్య విద్యార్థులకు చెప్పినట్టు తెలిసింది. అలాగే ఏదైనా సమస్య వస్తే తనకు మాత్రమే చెప్పాలని, కాదు..కూడదు అంటే మీ భవిష్యత్తు నా చేతిలో ఉందన్న విషయం మర్చిపోవద్దంటూ వైద్య విద్యార్థులను తన గ్రిప్‌లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారని చెబుతున్నారు. వసూళ్ల వ్యవహారాలకు ప్రత్యేకంగా ఒకరిని పెట్టుకున్నట్టు చెబుతున్నారు.
భయం..భయంగానే..
ఇదిలావుండగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తమను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తారేమోనని వేధింపులకు గురైన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, మెడికల్ కాలేజీ అధికారులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నవారు తమ వద్దకు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని చెబుతున్నారు. విద్యార్థులు తన వద్దకు వచ్చి చెబితే న్యాయం చేస్తానని, వారి వివరాలను బయటకు వెల్లడించే ప్రసక్తే లేదని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి తెలిపారు.