బీఆర్‌టీఎస్ రోడ్డు టీడీఆర్‌లపై విచారణ
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:51 AM
సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణలో భాగంగా పాతగోశాల నుంచి అడవివరం జంక్షన్ వరకూ స్థలాలు పోగొట్టుకున్నవారికి టీడీఆర్‌లు జారీ విషయంలో మరోసారి అధ్యయనం జరపాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయించినట్టు తెలిసింది.
యాజమాన్య హక్కులపై ఆర్డీవో స్థాయి అధికారితో మరోసారి అధ్యయనం
జీవీఎంసీ కమిషనర్ నిర్ణయం
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణలో భాగంగా పాతగోశాల నుంచి అడవివరం జంక్షన్ వరకూ స్థలాలు పోగొట్టుకున్నవారికి టీడీఆర్‌లు జారీ విషయంలో మరోసారి అధ్యయనం జరపాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయించినట్టు తెలిసింది. బీఆర్‌టీఎస్ రోడ్డులో స్థలాలు పోగొట్టుకున్న 210 మందికి టీడీఆర్‌లు జారీచేసేందుకు వీలుగా వైసీపీ హయాంలో జాబితా తయారుచేశారు. అయితే రోడ్డు విస్తరణకు తీసుకున్న స్థలంపై సింహాచలం దేవస్థానానికి యాజమాన్య హక్కులు ఉన్నాయని, ఆక్రమణదారులుగా ఉన్న ప్రైవేటు వ్యక్తులకు టీడీఆర్‌లను ఎలా ఇస్తారంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అప్పటి కమిషనర్ సాయికాంత్‌వర్మ అబియెన్స్‌లో పెట్టారు. దీనిపై స్థలాలు పోగొట్టుకున్న వ్యక్తులు పలుమార్లు సీఎం చంద్రబాబునాయుడుకు వినతిపత్రాలు సమర్పించడం, స్థానిక ప్రజా ప్రతినిధుల కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో ఆక్రమణదారులుగా ఉన్న ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి నోటరీ అఫిడవిట్, ఇతర ఆధారాలను తీసుకుని టీడీ ఆర్‌లను జారీచేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అయితే జాబితాలో ఉన్నవారిలో అత్యధికులు అనర్హులేనని, వారిలో కొందరికి అసలు ఆస్తిపన్ను కూడా లేదని, మరికొందరు అండగల్ అందజేసినవారు ఉన్నారని, పోయిన స్థలం కంటే ఎక్కువ స్థలం పోయినట్టు చూపించి అదనపు టీడీఆర్‌లను కొట్టేశార ంటూ ఆధారాలతో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఇటీవల జీవీఎంసీ కమిషనర్, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు, మంత్రితోపాటు సీఎం చంద్రబాబునాయుడుకు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏసీబీ శాఖల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ అధికారులు స్పందించారు. టీడీఆర్ జాబితాలో ఉన్న వ్యక్తులు అందజేసిన భూయజమాన్య హక్కు పత్రాలతోపాటు వారికి ఆ భూమి ఎలా సంక్రమించిందనే దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు వంటి వాటిని పరిశీలించాలని ఆదేశించినట్టు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో స్థాయి అధికారితో సమగ్ర విచారణ చేయించి జిల్లా కలెక్టర్ ద్వారా 210 మంది లబ్ధిదారుల అర్హతను తేల్చాలని కమిషనర్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం లేఖ పంపించే అవకాశం ఉందని టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎవరికి ఎంత టీడీఆర్ ఇస్తున్నారు, వారి నుంచి రోడ్డు విస్తరణకు ఎంత స్థలం సేకరించారు?...అనే వివరాలను తెలపాలని డీటీసీపీ విద్యుల్లత జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణకు వాడుకోగా మిగిలిన స్థలం అన్యాక్రాంతం కాకుండా రక్షించుకోవాలని కోరుతూ దేవదాయ శాఖ అధికారులకు లేఖ రాయాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.