ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఆరా
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:20 AM
ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.

ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్న ప్రభుత్వం
వైద్యులు, సిబ్బంది పనితీరు, అవినీతి, మందుల పంపిణీ, పరిశుభ్రతపై ప్రశ్నలు
మందులు ఇవ్వడం లేదని సగానికిపైగా సమాధానం
ఆ సమాచారాన్ని విశ్లేషించి...
ఇక్కడి అధికారులకు పంపుతున్న ఉన్నతాధికారులు
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అనేక ఆస్పత్రుల్లో సేవలు సక్రమంగా అందడం లేదని, వైద్యులు రోగులకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ఇబ్బందులను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరిస్తుంది. గడిచిన మూడు నెలలుగా ఈ కార్యక్రమం నడుస్తోంది. ప్రతిరోజూ వందలాది మంది నుంచి సేకరించిన అభిప్రాయాలను విశ్లేషించి, ఆయా ఆస్పత్రుల అధికారులకు వివరాలను పంపుతోంది. జిల్లాలో ప్రభుత్వపరంగా చూస్తే...కేజీహెచ్, ఈఎన్‌టీ, మానసిక వైద్యశాల, ఘోషా ఆస్పత్రి, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, విమ్స్ వంటివి ఉన్నాయి.
ఈ అంశాలపై సేకరణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా?, డాక్టర్, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటోంది?, మీకు ఆస్పత్రిలో డాక్టర్ రాసిన మందులు ఇస్తున్నారా.?, ప్రభుత్వ ఆస్పత్రిలో అవినీతి ఏమైనా ఉందా?, పరిశుభ్రత ఎలా ఉంది?...అని ప్రశ్నలు వేసి సమాధానాలను రాబడుతున్నారు.
మందులు ఇవ్వడం లేదన్న 51 శాతం మంది...
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా?...అన్న ప్రశ్నకు 68.31 శాతం మంది ‘ఉంటున్నారని’, 31.69 శాతం మంది ‘ఉండడం లేదని’ సమాధానం చెప్పారు. అలాగే, ఆస్పత్రిలో డాక్టర్ ప్రవర్తన ఎలా ఉందన్న ప్రశ్నకు 65.39 శాతం మంది బాగుందని సమాధానం చెప్పగా, 34.01 శాతం మంది సరిగా ఉండడం లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందన్న ప్రశ్నకు 63.91 శాతం మంది బాగుందని, 36.09 శాతం బాగుండడం లేదని సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ రాసిన మందులు ఇస్తున్నారా?...అనే ప్రశ్నకు 48.89 శాతం మంది ఇస్తున్నారని, 51.1 శాతం మంది ఇవ్వడం లేదని సమాధానమిచ్చారు. ఆస్పత్రుల్లో అవినీతి గమనించారా?...అన్న ప్రశ్నకు 67.52 శాతం మంది లేదని చెప్పగా, 32.48 శాతం మంది ఉందని సమాధానం ఇచ్చారు. ఆస్పత్రిలో పరిశుభ్రత ఎలా ఉందన్న ప్రశ్నకు 53.71 శాతం మంది బాగుందని, 46.29 శాతం బాగుండడం లేదని సమాధానం ఇచ్చారు.