Share News

దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు ఎంతో కీలకం

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:00 AM

దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు ఎంతో కీలకమని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌ బెంగళూరు అధిపతి ప్రొఫెసర్‌ బీఎస్‌ దయాసాగర్‌ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆఽధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్‌ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు ఎంతో కీలకం
ర్యాలీలో పాల్గొన్న ప్రొఫెసర్‌ దయాసాగర్‌, వీసీ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌, తదితరులు

సహజ మేధతో కృత్రిమ మేధ మనుగడ సాధ్యం

ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌ అధిపతి ప్రొఫెసర్‌ దయాసాగర్‌

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు ఎంతో కీలకమని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌ బెంగళూరు అధిపతి ప్రొఫెసర్‌ బీఎస్‌ దయాసాగర్‌ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆఽధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్‌ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సహజ మానవ మేథాతోనే కృత్రిమ మేధ మనుగడ సాధ్యపడుతుందన్నారు. విదేశాలకు మేధో వలసలు వెళ్లే వారి సంఖ్య భవిష్యతులో గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. దేశంలో పరిశోధనలు చేసి ఇక్కడే స్థిరపడిన వారి సంఖ్య మెరుగుపడుతుందని, ఇందుకు దేశ ఆర్థిక ప్రగతి కూడా కారణమన్నారు. క్వాంటిఫికేషన్‌ నుంచి ఇన్నోవేషన్‌ వస్తాయని, అందువల్ల క్వాంటిటేటివ్‌ సైన్స్‌పై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. తాను ఏయలో చదువుకునే సమయంలో సాధారణ విద్యార్థిగా ఉండేవాడినని, భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌ జీవిత చరిత్రను చదివాక తన జీవితంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఏయూ భౌతికశాస్త్ర విభాగంతో సర్‌ సీవీ రామన్‌కు ఉన్న అనుబంధాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం మ్యాథమెటికల్‌ మార్ఫోలజీ ప్రాక్షన్‌ జామెంట్రీ అంశాలపై మాట్లాడారు.

ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆసక్తిని, అభిరుచిని తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. మార్కుల కంటే శాస్త్ర జ్ఞానాన్ని మనలో ఎంత ఎక్కువగా నిక్షిప్తం చేసుకున్నాన్న దానికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జాతీయ విద్యా విధానం ప్రాంతీయ భాషల్లో బోధనను ప్రోత్సహిస్తుందని, దీనిని తాము కూడా త్వరలో అందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశ్నించడాన్ని అలవాటు చేసుకోవాలని, దీనినుంచి ఆవిష్కరణలు సాకారమవుతాయన్నారు. సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎంవీఆర్‌ రాజు మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ సాకారం కావడానికి సైన్స్‌ దోహదపడుతుందన్నారు. అభివృద్ధికి పునాది రాయిగా సైన్స్‌ నిలుస్తుందన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. సైన్స్‌ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేలా విద్యార్థులతో భారీ ర్యాలీని చేపట్టారు.

Updated Date - Mar 16 , 2025 | 12:00 AM