Share News

ఆదివాసీలకు అన్యాయం!?

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:59 AM

ఐదు దశాబ్దాల నుంచి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు ఓ ఎన్‌ఆర్‌ఐ హక్కుదారుడంటూ రెవెన్యూ అధికారులు అతని పేరుతో ఆన్‌లైన్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, బడాబాబులతో కుమ్మక్కై తమ సాగులో వున్న ప్రభుత్వ భూములను జిరాయితీగా మార్చేశారని వారు ఆరోపిస్తున్నారు. అయితే 2022లో నిర్వహించిన సర్వే రిపోర్టుల ఆధారంగా సంబంధిత వ్యక్తి పేరు మీద ఆన్‌లైన్‌ చేసినట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి అటు గిరిజనులు, ఇటు రెవెన్యూ అధికారులు చెబుతున్న వివరాలిలా వున్నాయి.

ఆదివాసీలకు అన్యాయం!?
గదబపాలెం గిరిజనులు సాగుచేసుకుంటున్న భూమి

పాతమల్లంపేటలో అనాదిగా సాగు చేసుకుంటున్న భూములు అన్యాక్రాంతం

ఓ ఎన్‌ఆర్‌ఐ పేరుతో ఆన్‌లైన్‌ చేసిన రెవెన్యూ అధికారులు

ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దారు ఆఫీస్‌ ఎదుట ఆందోళన

సర్వే నంబర్‌ను సబ్‌డివిజన్‌ చేసి కట్టబెట్టారని ఆరోపణ

2022 సర్వే రిపోర్టు ఆధారంగానే ఆన్‌లైన్‌ చేసినట్టు తహసీల్దారు వెల్లడి

గొలుగొండ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఐదు దశాబ్దాల నుంచి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు ఓ ఎన్‌ఆర్‌ఐ హక్కుదారుడంటూ రెవెన్యూ అధికారులు అతని పేరుతో ఆన్‌లైన్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, బడాబాబులతో కుమ్మక్కై తమ సాగులో వున్న ప్రభుత్వ భూములను జిరాయితీగా మార్చేశారని వారు ఆరోపిస్తున్నారు. అయితే 2022లో నిర్వహించిన సర్వే రిపోర్టుల ఆధారంగా సంబంధిత వ్యక్తి పేరు మీద ఆన్‌లైన్‌ చేసినట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి అటు గిరిజనులు, ఇటు రెవెన్యూ అధికారులు చెబుతున్న వివరాలిలా వున్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గదబపాలెం గ్రామానికి చెందిన 34 కుటుంబాల గిరిజనులు, తమ నివాసాలకు సమీపంలో వున్న గొలుగొండ మండలం పాతమల్లంపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 850లో వున్న 36 ఎకరాలను సుమారు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. సుమారు 20 ఎకరాల్లో జీడిమామిడి తోటలు వుండగా, మిగిలిన భూమిలో వ్యవసాయ పంటలు పండించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే సమయంలో ఈ భూములపై తమకు సాగు హక్కులు కల్పించాలంటూ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సుమారు 20 రోజులపాటు ధర్నా చేశారు.

ఇదిలావుండగా ప్రస్తుత తహసీల్దార్‌ శ్రీనివాసరావు సర్వే నంబరు 850ని సబ్‌డివిజన్‌ చేసి, సర్వే నంబరు 850/1 కింద 23.4 ఎకరాలను ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఎన్‌ఆర్‌ఐ దుగ్గిరాల బాలకృష్ణ పేరుమీద ఆన్‌లైన్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు, ఏపీ ఆదివాసీ సంఘం గౌరవ సలహాదారు పీఎస్‌ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమ సాగులో వున్న భూమిని సబ్‌డివిజన్‌ చేసి, ఎటువంటి రికార్డులు లేని ఎన్‌ఆర్‌ఐ పేరున ఆన్‌లైన్‌ ఎలా చేస్తారంటూ తహసీల్దార్‌ను నిలదీశారు. 50 ఏళ్ల నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని, ఇంతవరకు ఒక్కరు కూడా ఈ భూములు తమవి అంటూ రాలేదని, అటువంటప్పుడు ఎన్‌ఆర్‌ఐకి అనువంశికంగా ఈ భూములు ఎలా సంక్రమించాయని ప్రశ్నించారు.

నర్సీపట్నానికి చెందిన కాంట్రాక్టర్‌ కొనుగోలు?

కాగా ఎన్‌ఆర్‌ఐ దుగ్గిరా బాలకృష్ణకు రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ చేసిన 23.4 ఎకరాలను నర్సీపట్నానికి చెందిన ఒక కాంట్రాక్టర్‌ కొనుగోలు చేసి, వారం రోజుల క్రితం రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నట్టు మండలంలో ప్రచారం జరుగుతున్నది.

కాగా పాతమల్లంపేట రెవెన్యూ పరిధిలో వివాదాస్పద భూముల గురించి తహసీల్దార్‌ శ్రీనివాసరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా... ఎన్‌ఆర్‌ఐ దుగ్గిరాల బాలకృష్ణ పేరుపై రిజిస్ట్రేషన్‌ రికార్డులు ఉన్నాయన్నారు. వాటి ఆధారంగానే జిరాయితీ భూమిగా ఆన్‌లైన్‌ చేశామని తెలిపారు.

దిబ్బలను సరిచేసి సాగు చేసుకుంటున్నాం

బొండా దేముడమ్మ, గదబపాలెం

పాతమల్లంపేట రెవెన్యూ పరిధిలో మట్టి దిబ్బలు, ఎత్తుపల్లాలతో వున్న భూమిని మా పెద్దలు బాగు చేసి, సాగు చేయడం మొదలుపెట్టారు. వారి వారసులుగా ఇప్పుడు మేము సాగు చేసుకుంటున్నాం. జీడిమామిడి తోటలను సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. రెవెన్యూ అధికారులు ఈ భూములను ఎన్‌ఆర్‌ఐకి కట్టబెట్టడం తగదు.

Updated Date - Mar 22 , 2025 | 12:59 AM