తుఫాన్ చేసిన గాయాలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:39 AM
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రధాన రహదారులు ఛిద్రమయ్యాయి. ఆర్ అండ్ బీ రోడ్లపై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో రాకపోకలకు వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు.
- జిల్లాలో పలు ప్రధాన రహదారులపై భారీగా గోతులు
- దెబ్బతిన్న 13 కల్వర్టులు
- ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులకు రూ.3.5 కోట్లు
- కొత్త రోడ్లు వేయాలంటే రూ.17.5 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రధాన రహదారులు ఛిద్రమయ్యాయి. ఆర్ అండ్ బీ రోడ్లపై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో రాకపోకలకు వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో సుమారు 366.92 కిలోమీటర్ల పొడవు గల రోడ్లు 79 చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయని ఆర్ అండ్ బీ ఇంజనీర్లు తేల్చారు. అనకాపల్లి, చోడవరం, సబ్బవరం, బుచ్చెయ్యపేట, ఎలమంచిలి, పరవాడ, ఎస్.రాయవరం, నక్కపల్లి, కె.కోటపాడు, నర్సీపట్నం, చీడికాడ, మునగపాక, కశింకోట, నాతవరం, అచ్యుతాపురం మండలాల్లో ఎక్కువగా ఆర్ అండ్ బీ రోడ్లు ఽధ్వంసమయ్యాయి. తుమ్మపాల దాటిన తరువాత మార్టూరు జంక్షన్‌లో అడుగు లోతు గొయ్యి ఏర్పడింది. ఇక్కడ తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మామిడిపాలెం, దర్జీనగర్ పరిసరాల్లోని రోడ్డు దుస్థితి దయనీయంగా మారింది. చోడవరం నుంచి వడ్డాది, కాశీపురం వరకు వెళ్లే రోడ్డు పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోడ్డుపై ప్రయాణమంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. భారీ వర్షాల వలన పలు మండలాల్లో ఆర్ అండ్ బీ రోడ్లలోని 13 కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలంటే కనీసం రూ.3.5 కోట్లు అవసరమని, దెబ్బతిన్న రోడ్ల స్థానంలో శాశ్వత మరమ్మతులు చేపట్టి కొత్తగా రోడ్లు వేయాలంటే కనీసం రూ.17.5 కోట్లు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నివేదికను కలెక్టర్ ద్వారా ఆర్ అండ్ బీ ఇంజనీర్లు ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. ఆర్ అండ్ బీ రోడ్లతో పాటు మండలాల్లోని పలు పీఆర్ రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. రోలుగుంట, రావికమతం మండలాల్లో ఇటీవల నిర్మించిన అనేక కొత్త రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పలు రోడ్లు కోతకు గురయ్యాయి. మాడుగుల మండలం ముకుందపురం నుంచి వంటర్లపాలెం వరకు 100 మీటర్ల పొడవున పంచాయతీరాజ్ శాఖకు చెందిన రోడ్డు పూర్తిగా పాడైంది. మునగపాక మండలం కొండకర్ల ఆవ, గుణపర్తి కల్వర్టు, చీడికాడ మండలం జి.కొత్తూరులో కల్వర్టు కూలిపోయింది. అనకాపల్లి నుంచి వయా తుమ్మపాల, వెంకన్నపాలెం, చోడవరం, వడ్డాది, మాడుగుల వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఎస్.రాయవరం మండలం నుంచి నర్సీపట్నం వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుపై కొన్నేళ్లుగా పెద్ద పెద్ద గొయ్యిలు ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డుపై అడుగుకో గోయ్యి ఏర్పడింది. వర్షాలు తగ్గినా రోడ్లపై భారీ గుంతలు ఏర్పడడంతో రాకపోకలు సాగించే వృద్ధులు, చిన్నారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి ఛిద్రమైన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులైనా వెంటనే చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. కాగా జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టామని ఆర్ అండ్ బీ ఈఈ నందమూరి సాంబశివరావు తెలిపారు. ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పెద్ద గుంతలను పూడ్చుతున్నామని చెప్పారు. పరిపాలనాపరమైన అనుమతులు రాగానే రోడ్ల నిర్మాణ పనులు చేపడతామని ఆయన తెలిపారు.