మన్యంలో సమాచార విప్లవం
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:49 PM
మన్యంలో సమాచార వ్యవస్థ పరంగా ఓ విప్లవాత్మకమైన మార్పు రానుంది. ఏజెన్సీ సెల్ సేవల విస్తరణలో భాగంగా 1,584 సెల్ టవర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఏజెన్సీ వ్యాప్తంగా 1,584 సెల్ టవర్ల ఏర్పాటుకు చర్యలు
ఇప్పటి వరకు ఏజెన్సీలో 30 శాతం మాత్రమే సెల్ కనెక్టవిటీ
70 శాతం పల్లెలకు ఎటువంటి సెల్ సేవలు లేని దుస్థితి
మరో ఏడాదిలో కొత్త టవర్ల ఏర్పాటుతో మారుమూలల్లోనూ విస్తరించనున్న సేవలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో సమాచార వ్యవస్థ పరంగా ఓ విప్లవాత్మకమైన మార్పు రానుంది. ఏజెన్సీ సెల్ సేవల విస్తరణలో భాగంగా 1,584 సెల్ టవర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయా పనులు పూర్తయితే మరో ఏడాదిలో ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో సైతం సెల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘మిషన్ కనెక్ట్ పాడేరు’లో భాగంగా మన్యంలో సెల్ సేవలు విస్తరించాలనే లక్ష్యంతో 2021లో అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ చేసిన కృషి ఫలితంగా ఏజెన్సీకి అధిక సంఖ్యలో సెల్ టవర్లు మంజూరయ్యాయి.
ఏజెన్సీ 11 మండలాల్లోని 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803 గిరిజన పల్లెలున్నాయి. వాటిలో 1,150 గ్రామాలకు సెల్ కనెక్టవిటీ ఉండగా, మిగిలిన 2,653 గ్రామాలకు ఎటువంటి సెల్ సేవలు అందుబాటులో లేవు. కాగా అప్పట్లో ఐటీడీఏ పీవోగా రోణంకి గోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టిన తరువాత మన్యంలోని గ్రామాలకు రోడ్డు, రవాణా, సెల్, తాగునీరు, విద్యుత్ , తదితర 42 రకాల సదుపాయాలపై ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సర్వే చేయించారు. ఆ సర్వే ఆధారంగా ఏజెన్సీలో ప్రతి పల్లెలో ఉన్న సదుపాయాలు, ఇంకా కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర నివేదికను రూపొందించారు. దాని ఆధారంగా ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న గిరిజన పల్లెలకు రోడ్డు, సెల్ కనెక్టవిటీ, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో అప్పట్లో ‘మిషన్ కనెక్ట్ పాడేరు’ పేరిట వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు.
మన్యంలో 30 శాతం పల్లెలకే సెల్ కనెక్టవిటీ
మన్యంలో సదుపాయాలపై జరిగిన సర్వేలో ఏజెన్సీ వ్యాప్తంగా 2021 నాటికి కేవలం 30 శాతం గ్రామాలకు మాత్రమే సెల్ సేవలు అందుబాటులో ఉన్నాయని గుర్తించారు. అనంతగిరి మండలంలో 27 శాతం, అరకులోయలో 40, డుంబ్రిగుడలో 22, హుకుంపేటలో 39, ముంచంగిపుట్టులో 23, పెదబయలులో 14, చింతపల్లిలో 55, జీకేవీధిలో 9, జి.మాడుగులలో 32, కొయ్యూరులో 36, పాడేరు మండలంలో 42 శాతం గ్రామాలకు మాత్రమే సెల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ‘మిషన్ కనెక్ట్ పాడేరు’లో భాగంగా ఏజెన్సీలో అధిక సంఖ్యలో సెల్ టవర్ల ఏర్పాటుకు కృషి చేయాలని 2021లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ నిర్ణయించుకున్నారు. అందుకు గాను వివిధ సెల్ నెట్‌వర్క్ కంపెనీలతో చర్చలు, సమావేశాలు నిర్వహించి, ఊహించని విధంగా ఫలితాన్ని సాధించారు. ఏజెన్సీ వ్యాప్తంగా ఇప్పటి వరకు బీఎస్‌ఎన్‌ఎల్ 62, జియో 73. మొత్తం 135 సెల్ టవర్లు మాత్రమే ఉన్నాయి. కలెక్టర్, ఐటీడీఏ పీవో కృషితో ఏజెన్సీకి మొత్తం 1,584 సెల్ టవర్లు ఒకేసారి మంజూరు కావడం విశేషం. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా 936 బీఎస్‌ఎన్‌ఎల్, 509 జియో, 139 ఎయిర్‌టెల్ సెల్ టవర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. గత నాలుగేళ్ల చర్యల కారణంగా ఆయా సెల్ టవర్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. మరో ఏడాదిలో దాదాపుగా అన్ని టవర్ల నిర్మాణం పూర్తయి లక్ష్యం మేరకు మారుమూల పల్లెలకు సైతం సెల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.