నేవీలో ఇండోర్ షూటింగ్ రేంజ్ సెంటర్ ప్రారంభం
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:47 AM
డాల్ఫిన్స్ హిల్స్ ఏరియాలో తూర్పు నౌకాదళం పది మీటర్ల రేంజ్‌లో ఇండోర్ షూటింగ్ సెంటర్‌ను సోమవారం అందుబాటులోకి తీసుకువచ్చింది.
విశాఖపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
డాల్ఫిన్స్ హిల్స్ ఏరియాలో తూర్పు నౌకాదళం పది మీటర్ల రేంజ్‌లో ఇండోర్ షూటింగ్ సెంటర్‌ను సోమవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సతీమణి ప్రియా భల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరుగా ట్రయల్ షూటింగ్ చేశారు. ఈ కేంద్రంలో 15 వరుసల్లో ఎలక్ర్టానిక్ టార్గెట్లు ఉంటాయి. స్పోర్ట్స్ మౌలిక వసతుల్లో భాగంగా దీనిని ఏర్పాటుచేశారు.
స్టీల్‌ప్లాంటులో సీసీ టీవీ కెమెరాలు?
267 కి.మీ. పొడవున ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారి నివేదికలు
రూ.కోట్ల వ్యయం అవుతుందని అంచనా
మరో 20 రోజుల్లో పూర్తికానున్న ఇన్‌చార్జి సీఎండీ పదవీకాలం
ఈలోగా అంత ఖర్చు అవసరమా...అంటున్న బీజేపీ నేతలు
సీఎండీపై కార్మిక సంఘాల్లో వ్యతిరేకత
ఏడాది కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణకు డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్‌ప్లాంటులో రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలకు కారణాలు గుర్తించడానికి అడుగడుగునా సీసీ టీవీ కెమెరాలు పెట్టాలని యాజమాన్యం భావిస్తోంది. కర్మాగారం ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో ముడి పదార్థాలు సమకూర్చకుండా, ప్రధాన విభాగాలకు సకాలంలో నిర్వహణ పనులు చేపట్టకుండా...అరకొర వనరులతోనే 92 శాతం ఉత్పత్తి సాధించాలని ఉద్యోగ, కార్మిక వర్గాలపై ఒత్తిడి పెడుతున్నారు. ఇచ్చిన లక్ష్యం సాధించకపోతే ఆ మేరకు జీతాల్లో కోత పెడుతున్నారు. నవంబరు నెల జీతాలు ఆ విధంగానే పంపిణీ చేశారు. అందుబాటులో ఉన్న వాటితోనే పూర్తి ఉత్పత్తికి యత్నిస్తుంటే... ప్రమాదాలు జరుగుతున్నాయి. రా మెటీరియల్ సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్‌లు ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. గతంలో ఇలా జరిగితే సాధారణ అంశంగా భావించిన యాజమాన్యం ఇప్పుడు మాత్రం ఉద్యోగులే కావాలని ఆ బెల్ట్‌లను కోసేస్తున్నారంటూ ప్రచారం ప్రారంభించింది. ఈ కారణం చూపించి ప్లాంటు చరిత్రలో తొలిసారి ఓ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలావుండగా శనివారం రాత్రి మూడో నంబరు బ్యాటరీలో ఓవెన్ చార్జింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో 22 పుషింగ్‌లకుగాను 18 మాత్రమే వచ్చాయి. ఇలా ప్రతి విభాగంలో పరిమితికి మించి ఒత్తిడి పెట్టడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇది ఉద్యోగులు, కార్మికుల కుట్రగా యాజమాన్యం చిత్రీకరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాంటు మొత్తం ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమెరాలు పెట్టాల్సి ఉందని యాజమాన్యం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. స్టీల్ ప్లాంటు 25 వేల ఎకరాల్లో విస్తరించి ఉండగా 267 కి.మీ. పొడవున సీసీ టీవీ కెమెరాలు పెట్టాలని యాజమాన్యం చెబుతోంది. పరిశ్రమల్లో సాధారణంగా ప్రతి 100 మీటర్లకు ఒక కెమెరా పెడతారు. అయితే విభాగాల లోపల ఏమి జరుగుతున్నదో తెలియాలంటే...అంతకు రెట్టింపు సంఖ్యలో సీసీ టీవీ కెమెరాలు అవసరం అవుతాయి. గతంలో ఎన్నడూ ఇలా లేదని, ఇప్పుడు అనుమానాల నివృత్తి కోసం ఈ సీసీ టీవీ కెమెరాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడం అవసరమా?...అని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఏర్పాటుచేస్తే సరిపోదని, వాటి నిర్వహణ, మానటరింగ్ చాలా పెద్ద విషయమని అంటున్నారు. ఇంకో 20 రోజుల్లో పదవీ కాలం పూర్తయిపోయే ఇన్‌చార్జి సీఎండీ అనుమానాల నివృత్తి కోసం కోట్ల రూపాయల వ్యయం దండగ అని అభిప్రాయపడుతున్నారు. ప్లాంటులో జరిగే విషయాలపై సీఎండీ ఇచ్చే నివేదికలు ఒకలా ఉంటే...ఉద్యోగ సంఘాలు చెబుతున్న అంశాలు వేరొక విధంగా ఉంటున్నాయని ఏది వాస్తవమో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలావుండగా ప్రస్తుత యాజమాన్యంలో సీఎండీ సక్సేనా గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల ప్లాంటుపై పడిన ఆర్థిక భారంపై సీబీఐతో వెంటనే విచారణ చేయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత విచారణ చేపట్టినా ప్రయోజనం ఉండదని ఇప్పుడే దానికి శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాలు లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో సీఎండీకి పదవి కాలం పొడిగించే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది.