Share News

యథేచ్ఛగా ఇసుక దోపిడీ

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:19 AM

‘‘ఇసుక ఉచితంగా ఇస్తున్నది స్థానికుల అవసరాల కోసమే. దీనిని వ్యాపారం చేస్తే అధికారులు చూస్తూ ఊరుకోవద్దు’’ అని సీఎం చంద్రబాబునాయుడు చేసిన మౌఖిక ఆదేశాలను జిల్లాలో అధికారులు అమలు చేయడంలేదు. ‘ఉచిత ఇసుక’ పేరుతో మండలంలో ఇసుకాసులు బరితెస్తున్నారు.

యథేచ్ఛగా ఇసుక దోపిడీ
గవరవరంలో రవాణాకు సిద్ధం చేసిన ఇసుక కుప్పలు

నదుల్లో తవ్వకాలు, రవాణా కోసం గ్రామాల్లో వేలం పాటలు

ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు

ప్రకటనలకే పరిమితమైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు

చోడవరం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇసుక ఉచితంగా ఇస్తున్నది స్థానికుల అవసరాల కోసమే. దీనిని వ్యాపారం చేస్తే అధికారులు చూస్తూ ఊరుకోవద్దు’’ అని సీఎం చంద్రబాబునాయుడు చేసిన మౌఖిక ఆదేశాలను జిల్లాలో అధికారులు అమలు చేయడంలేదు. ‘ఉచిత ఇసుక’ పేరుతో మండలంలో ఇసుకాసులు బరితెస్తున్నారు. నదీ తీర గ్రామాల్లో వేలం పాటలు నిర్వహించి మరీ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా అక్రమార్కులకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు.

చోడవరం మండల పరిధిలోని శారదా నది పరివాహక ప్రాంతంలో గవరవరం, శేమునాపల్లి, గజపతినగరం, జుత్తాడ, ముద్దుర్తి ప్రాంతాల వద్ద పెద్ద మొత్తంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రి సమయంలో ఎక్స్‌కవేటర్లతో ఇసుకను తవ్వి టిప్పర్లు, డంపర్‌ లారీలతో విశాఖ, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలకు తరలిస్తున్నారు. సుమారు 20 టన్నులు వుండే ఇసుక లోడును రూ.15-20 వేలకు అమ్ముతున్నట్టు తెలిసింది. మండలంలోని గవరవరంలో స్థానిక నాయకులు ఇసుక తవ్వకాలు, విక్రయాలకు వేలం పాట నిర్వహించడం వారి తెంపరితనానికి, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి కె.కోటపాడు మండలం చౌడువాడ ప్రాంతంతోపాటు, పక్కనే వున్న చోడవరం మండలం శేమునాపల్లి ప్రాంతంలో ఇసుక లూటీ చేస్తున్నారు. కానీ ఇసుక తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదంటూ రెవెన్యూ అధికారులు తప్పించుకునే తరహాలో ప్రకటనలు చేస్తున్నారు. దీనినిబట్టి ఇసుకాసురులకు ‘రెవెన్యూ’ సహకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు కాగితాలకే పరిమితం

జనసేన నాయకులు ఈ ఏడాది మే నెలలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి మండల పరిధిలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన తహశీల్దారు.. ఆయా పంచాయతీల పరిధిలో ఇసుక తవ్వకాల నిరోధానికి వివిధ శాఖల అధికారులతో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కమిటీలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు వుంటారని, మండల స్థాయి కమిటీలో తహశీల్దారు, ఎండీవో, ఇరిగేషన్‌ అధికారి వుంటారంటూ కమిటీలను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అంతేకాక ఎక్కడైనా ఇసుక తవ్వకాలు, రవాణా జరిగితే స్థానిక వీఆర్వోలను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఆచరణలో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇవి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు కాదని ‘టాస్క్‌ ఫార్స్‌’ కమిటీలను స్థానికులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టిసారిస్తే తప్ప మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఆగే పరిస్థితిలేదని అంటున్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:19 AM