యథేచ్ఛగా ఆహార పదార్థాల కల్తీ
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:43 AM
జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార పదార్థాల తయారీలో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలను వినియోగిస్తున్నట్టు ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీల్లో తేలింది.

జిల్లా ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీల్లో గుర్తింపు
గడిచిన ఆరు నెలల్లో 218 నమూనాలు సేకరించి పరీక్షల నిర్వహణ
తొమ్మిది హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రమాదకరమైన కలర్స్ వినియోగం
అవి కలిసిన ఆహారం తీసుకుంటే అజీర్తి, కడుపులో వికారం, వాంతులు, ఎసిడిటీ వంటి ఇబ్బందులు
మరో 22 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్టు నిర్ధారణ
మరో 31 నమూనాల్లో కల్తీ
విశాఖపట్నం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార పదార్థాల తయారీలో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలను వినియోగిస్తున్నట్టు ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకూ హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు నిత్యావసర సరకులను విక్రయించే దుకాణాల నుంచి 218 నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. అందులో తొమ్మిది నమూనాల్లో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు ఉన్నట్టు తేలింది. టార్టరాజినా, సన్‌సెట్ ఎల్లో వంటి కలర్స్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఆ కలర్స్ వినియోగించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అజీర్తి, కడుపులో వికారం, వాంతులు, ఎసిడిటీ వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్నారులు దీర్ఘకాలంలో ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కలర్స్ కలిపిన ఆహార పదార్థాలను కూల్ చేసి మళ్లీ రీహీట్ చేయడం వల్ల విషతుల్యమవుతాయని చెబుతున్నారు. ఈ తొమ్మిది నమూనాలకు సంబంధించిన హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే, దుకాణాల నుంచి సేకరించిన 22 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్టు తేలింది. అంటే అయోడిన్ సాల్ట్‌లో అయోడిన్ ఉండాలి. కానీ, లేకుండానే అయోడిన్ ఉన్నట్టు చెప్పి విక్రయాలు సాగిస్తారు. అలాగే, పప్పు, ఇతర పిండి పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల పురుగులు పట్టడం జరుగుతుంది. వాటిల్లో కూడా నాణ్యత ఉండదు. అటువంటి 22 కేసులకు సంబంధించి ఇప్పటివరకూ 19 మంది వ్యాపారులకు జేసీ కోర్టులో జరిమానా విధించారు. ఆయా దుకాణాల నిర్వాహకులకు రూ.3.54 లక్షల జరిమానాను విధించారు. మరో 31 నమూనాల్లో కల్తీతోపాటు నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్నట్టు తేలింది. వీటిలో వివిధ రకాల కల్తీలు ఉన్నట్టు చెబుతున్నారు. మరో 40 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
అన్నిరకాల ఆహార ఉత్పత్తులు, పదార్థాల్లో కల్తీ జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. వీలైనంత వరకు బయట ఆహారానికి దూరంగా ఉండడం ద్వారా కల్తీ కాటు నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.