Share News

అప్పన్నను దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:24 AM

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని సోమవారం భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యులు దర్శించుకున్నారు.

అప్పన్నను దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు

సింహాచలం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని సోమవారం భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. క్రికెట్‌ సభ్యులకు ఏఈఓ కె.తిరుమలేశ్వరరావు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. దేవాలయంలో విశిష్టత కలిగిన కప్ప స్తంభాన్ని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో పాటు ఇతర సభ్యులు ఆలింగనం చేసుకుని ప్రార్థనలు చేశారు. తరువాత బేడామండప ప్రదక్షిణలు ముగించుకున్న క్రికెటర్ల గోత్రనామాలతో అర్చకులు అంతరాలయంలో స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. గోదాదేవి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజల అనంతరం ఆలయ పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలీయగా, అధికారులు శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

నేడు రెండో టీ20

గెలుపుపై కన్నేసిన శ్రీలంక మహిళలు

మరో గెలుపు కోసం ఆత్మ విశ్వాసంతో బరిలోకి భారత్‌

విశాఖపట్నం స్పోర్ట్స్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న రెండో మ్యాచ్‌కు భారత్‌, శ్రీలంక మహిళా జట్లు సిద్ధమయ్యాయి. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చెందిన లంక క్రికెటర్లు...రెండో మ్యాచ్‌లోనైనా గెలుపొందాలని భావిస్తున్నారు. ఇక సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలుపుపొందిన భారత్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. కాగా మంచు ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టాస్‌ కీలకంగా మారనుంది.

లంక జట్టు ముమ్మర సాధన

శ్రీలంక జట్టు సభ్యులు సోమవారం ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ముమ్మర సాధన చేశారు. సుమారు రెండు గంటలపాటుబౌలింగ్‌, బ్యాటింగ్‌ సాధన చేశారు. భారత్‌ మహిళలు నెట్‌ ప్రాక్టీసుకు హాజరుకాలేదు.

Updated Date - Dec 23 , 2025 | 01:24 AM